ఆర్థిక, సాంకేతిక, పర్యావరణపరంగా అత్యుత్తమ ప్రత్యామ్నాయం
ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, భూసేకరణ భారం తగ్గే అవకాశం
అధ్యయనాలన్నీ పూర్తయ్యాక అలైన్‌మెంట్‌పై నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ వెల్లడి
ప్రాణహిత–చేవెళ్ల పునరుద్ధరణపై అధికారులతో మంత్రి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల బరాజ్‌కు నీటిని తరలించాలనే ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌ను ఖరారు చేసే అంశంపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తక్కువ వ్యయం, సాంకేతిక సుస్థిరత, పర్యావరణ అనుకూల మార్గాలపై ఇప్పటికే అధ్యయనం జరపగా, తుమ్మిడిహెట్టి–సుందిళ్ల బరాజ్ అనుసంధానం అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా తేలిందన్నారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు 10–12 శాతం తగ్గడంతోపాటు భూసేకరణ వ్యయం సగానికి తగ్గి చివరకు రూ.1,500–1,600 కోట్ల భారం తగ్గుతుందన్నారు.
తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించాలనే పాత అలైన్‌మెంట్‌ను అనుసరిస్తే బొగ్గు నిక్షేపాలున్న భూముల గుండా సొరంగం తవ్వకాలు జరపడం ప్రమాదకరమని చెప్పారు. కొత్త అలైన్‌మెంట్‌తో ఇలాంటి భౌగోళిక ప్రతికూలతలను నివారించడంతోపాటు కాల్వ, సొరంగాల పొడవూ తగ్గి వ్యయభారం తగ్గుతుందన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణపై సోమవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఈ ప్రాజెక్టును పటిష్ట సాంకేతికత, ఆర్థిక సుస్థిరత, పర్యావరణ అనుకూల పద్ధతుల్లో నిర్మించి ఎత్తయిన ప్రాంతంలో ఉన్న కరువు పీడిత ప్రాంతాలకు గోదావరి జలాలను సరఫరా చేయడమే తమ లక్ష్యమన్నారు.
కొత్త అలైన్‌మెంట్‌కు సంబంధించి సాంకేతిక, ఆర్థిక అధ్యయనాలన్నీ పూర్తయిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో మళ్లీ జియోఫిజికల్, జియోటెక్నికల్ అధ్యయనాలు జరిపిన గతంలో జరిపిన సర్వేల సరిపోల్చుకుని చూడాలన్నారు. ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌తో గ్రావిటీ కాల్వ పొడవు 30 కి.మీ.ల నుంచి 13 కి.మీ.లకి, సొరంగం పొడవు 14 కి.మీ.ల నుంచి 10 కి.మీ.లకి, పంప్‌హౌస్‌ల సంఖ్య 15 నుంచి10 కి తగ్గుతాయని అధికారులు వివరించారు. కేవలం వ్యయం తగ్గింపే లక్ష్యం కాకుండా తరతరాలకు ఉపయోగపడేలా దీర్ఘకాలం మన్నిక కలిగి తక్కువ విద్యుత్ అవసరాలుండే ప్రాజెక్టు కోసం డిజైన్లు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. అధ్యయనాలను సమగ్రంగా పూర్తి చేశాకే ప్రాజెక్టు సవరణ డీపీఆర్‌ను రూపొందించాలని చెప్పారు. డీపీఆర్‌ను మంత్రివర్గం ముందు ఉంచి ఆమోదిస్తామన్నారు.
త్వరలో మహారాష్ట్రతో సంప్రదింపులు
సాధ్యమైనంత ఎక్కువ ఎత్తులో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మిస్తే కాల్వలకు గ్రావిటీతో నీళ్లు అందుతాయని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఇందుకోసం మహారాష్ట్ర సమ్మతి తీసుకోవడానికి తగిన సమయంలో సంప్రదింపులు ప్రారంభిస్తామని చెప్పారు. గతంలో ఎత్తు తగ్గించడంతో నీటి మళ్లింపు సామర్థ్యం తగ్గిపోయిందన్నారు. సమ్మక్క–సారక్క, సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ నిర్మాణం, ఎన్డీఎస్‌ఏ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల పునరుద్ధరణ పనుల నిర్వహణ, జలాశయాల్లో పూడిక తొలగింపు, దేవాదుల ప్రాజెక్టు పురోగతి, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం తవ్వకాల పునరుద్ధరణ, సింగూరు కాల్వ లైనింగ్ తదితర అంశాలపై ఈ సమీక్షలో మంత్రి చర్చించారు. కోర్టు కేసులు, ఎన్జీటీ కేసులను సత్వరంగా పరిష్కరించాలని ఆదేశించారు.


