ఎల్ అండ్ టీ–పీఈఎస్ జాయింట్ వెంచర్‌కు లేఖలో నీటిపారుదల శాఖ అల్టిమేటం
ఇకపై టెండర్లలో పాల్గొనకుండా నిషేధిస్తామని హెచ్చరిక
డిపాజిట్లతోపాటు పెండింగ్ బిల్లులనూ జప్తు చేస్తామని స్పష్టికరణ
ప్రాజెక్టు పునరుద్ధరణ వ్యయం, నష్టాలను సైతం రికవరీ చేస్తామని వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: కుంగిపోయిన మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరించేలా తక్షణమే సిబ్బంది, సామగ్రి, యంత్రాలను నిర్మాణస్థలికి తరలించాలని ఎల్‌అండ్‌టీ–పీఈఎస్ జాయింట్ వెంచర్‌ను రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆదేశించింది. లేకపోతే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని.. భవిష్యత్తులో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలు నిర్వహించే టెండర్లలో పాల్గొనకుండా నిషేధించాలని కోరుతూ సిఫారసు చేస్తామని హెచ్చరించింది. జాయింట్ వెంచర్‌కి సంబంధించిన ప్రభుత్వం వద్ద డిపాజిట్లతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్న పెండింగ్ బిల్లులనూ జప్తు చేసుకుంటామని హెచ్చరించింది.
నీటిపారుదల శాఖ రామగుండం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఈ నెల 3న ‘ఎల్ అండ్ టీ’జనరల్ మేనేజర్, ప్రాజెక్టు మేనేజర్‌లకు ఈ మేరకు లేఖ రాశారు. లేఖ అందిన వారంలోగా సానుకూల స్పందన తెలియజేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మేడిగడ్డ బరాజ్‌లోని 7వ బ్లాక్ 2023 అక్టోబర్ 21న కుంగిపోవడం తెలిసిందే. బరాజ్ తీవ్ర ప్రమాదంలో ఉన్నందున పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని పదేపదే కోరినా ఎందుకు సహకరించడం లేదని ‘ఎల్ అండ్ టీ’ని నీటిపారుదల శాఖ ప్రశ్నించింది. కంపెనీ క్రియాశీలరాహిత్యంతో దిగువ స్థాయి అధికారులను ఉన్నతాధికారులు నేరస్తులుగా చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
రెండుసార్లు అంచనాలు పెంపు..
మేడిగడ్డ బరాజ్‌ను రూ. 2,591 కోట్ల అంచనాతో నిర్మించడానికి పరిపాలనా అనుమతులిస్తూ 2016 మార్చి 1న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రూ. 1,849.30 కోట్లతో 24 నెలల గడువులో బరాజ్ నిర్మించడానికి 2016 ఆగస్టు 26న నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీతో రామగుండం సూపరింటెండింగ్ ఇంజనీర్ ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంలో లేని అదనపు పనులు చేయాల్సి రావడంతో 2018 మే 19న తొలిసారిగా అంచనాలను రూ. 3260 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండోసారి అంచనాలను రూ. 4,613 కోట్లకు పెంచగా 2022 మే 9న నిర్మాణ సంస్థతో అనుబంధ ఒప్పందాన్ని సూపరింటెండింగ్ ఇంజనీర్ చేసుకున్నారు.
5 నోటీసులిచ్చినా ఎల్ అండ్ టీ స్పందించలేదు..
మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా అంతకు ముందే బరాజ్‌లోని లోపాలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం ఐదుసార్లు నోటీసులు ఇచ్చినా ‘ఎల్ అండ్ టీ’స్పందించలేదు. ఒప్పందం ప్రకారం అదనపు పనులతోపాటు మిగులు పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించిన ‘ఎల్ అండ్ టీ’కి జారీ చేసిన వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. అది సరైన నిర్ణయమేనని తాజా లేఖలో రామగుండం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పేర్కొన్నారు. కేవలం అనుభవం కోసం ఈ సరి్టఫికెట్ జారీ చేశామని.. దాన్ని స్వీయ రక్షణ కోసం వాడుకోవడం అన్యాయమని ఎల్ అండ్ టీ తీరును ఆక్షేపించారు.


