భగీరథ ప్రయత్నం!  | Sakshi
Sakshi News home page

భగీరథ ప్రయత్నం! 

Published Sun, Apr 7 2024 3:43 AM

Farmers struggle to save crops in Nalgonda district - Sakshi

నల్లగొండ జిల్లాలో పంటలను కాపాడుకోవడానికి రైతుల తంటాలు 

సాగర్‌ జలాశయం అడుగంటడంతో బ్యాక్‌ వాటర్‌లో తేలిన భూములు 

వాటిల్లో బావులు తవ్వి, 8 కి.మీ. దాకా పైపులు వేసి నీటి తరలింపు 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆరుగాలం శ్రమించి వేసుకున్న పంటలను కాపాడుకొనేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. కళ్ల ముందే ఎండిపోతున్న పంటలను బతికించుకొనేందుకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. కరువు కారణంగా భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వట్టిపోవడంతో పంటలను ఎలాగైనా కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. నాగార్జునసాగర్‌ ఆయకట్టులో ఇప్పటికే వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోగా సాగర్‌ బ్యాక్‌ వాటర్‌ కింద సాగు చేసు­కుంటున్న రైతులు పంటలను కాపాడుకొనే ప్రయ­త్నం చేస్తున్నారు.

ముఖ్యంగా బత్తాయి, మామిడి వంటి పండ్ల తోటలతోపాటు వేరుశనగ, వరి పంటలను బతికించుకొనేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. ముఖ్యంగా సాగర్‌ జలాశయం డెడ్‌ స్టోరేజికి చేరడంతో బ్యాక్‌ వాటర్‌ కిలోమీటర్ల మేర తగ్గిపోయింది. దీంతో నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలంలోని నంభాపురం, పెద్దగట్టు, పుట్టంగండి తదితర ప్రాంతాల్లో గిరిజన రైతులు పంటకు నీరందించేందుకు కిలోమీటర్ల పొడవునా పైపులైన్లు వేసుకొని మోటార్లు పెట్టి నీటిని తరలిస్తున్నారు.

పెద్దవూర మండలం పాత్తితండా, పర్వేదుల తదితర గ్రామాల రైతులు పదుల సంఖ్యలో సాగర్‌ వెనుక జలాశయంలోని లోతట్టు ప్రాంతాల్లో కొద్దిపాటి నీళ్లు ఉన్న ప్రదేశాలకు దూరంగా బావులు తవ్వి అక్కడి నుంచి 7–8 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసుకుంటున్నారు. 

పంటల కోసం తంటాలు పడుతున్నాం 
పంటలు ఎండిపోకుండా నానా తంటాలు పడుతున్నాం. అప్పులు చేసి మరీ పంటలను కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నాం. నాగార్జునసాగర్‌ జలాశయం డెడ్‌ స్టోరేజికి చేరడంతో బ్యాక్‌ వాటర్‌ నుంచి పంటలకు నీటిని అందించేందుకు కిలోమీటర్ల పొడవునా పైప్‌లైన్లు వేస్తున్నాం.      – రమావత్‌ పత్తి, నంభాపురం  

 
Advertisement
 
Advertisement