ధాన్యం కొనేది ఎప్పుడు? | Farmers Chaos In Nalgonda District Of Telangana | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనేది ఎప్పుడు?

Nov 6 2021 2:38 AM | Updated on Nov 6 2021 2:46 AM

Farmers Chaos In Nalgonda District Of Telangana - Sakshi

నల్లగొండ జిల్లా వేములపల్లిలో టోకెన్ల కోసం బారులు తీరిన రైతులు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు ఆందోళనలకు దిగారు. కొనుగోలు కేంద్రాలన్నీ ప్రారంభం కాకపోవడం, పరిమితంగా టోకెన్లు ఇస్తుండటం, వాటికోసం కూడా గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తుండటంతో నిరసనలు చేపట్టారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, త్రిపురారం, దామరచర్లలో ధాన్యం కొనుగోళ్ల టోకెన్ల కోసం రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, గరిడేపల్లిలో రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలకు దిగారు. నేరేడుచర్ల వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద టోకెన్ల క్యూలో తోపులాట జరిగింది. నేరేడుచర్ల, వేములపల్లి, పెన్‌పహాడ్, మఠంపల్లితోపాటు చాలా ప్రాంతాల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచే రైతులు క్యూలైన్లలో నిలబడ్డారు.  

పదిహేను రోజులు గడుస్తున్నా.. 
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి కోతలు ప్రారంభమై పదిహేను రోజులు అవుతున్నా కొనుగోళ్ల కోసం అధికారులు ఏర్పాట్లు చేయలేదు. రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరాక అధికారులు మేల్కొన్నా.. తగిన స్థాయిలో చర్యలు చేపట్టలేదు. కొనుగోలు కేంద్రాలను తామే ప్రారంభిస్తామని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తుండటం, వారు వచ్చే వరకు ఆగాల్సి రావడం ఇబ్బందిగా మారిందని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 762 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంటే.. శుక్రవారం వరకు 83 కేంద్రాలనే తెరిచారు. నల్లగొండ జిల్లాలో 199 కేంద్రాలకుగాను 81, సూర్యాపేట జిల్లాలో 333 కేంద్రాలకుగాను రెండు, మూడింటిని మాత్రమే ప్రారంభించారు. యాదాద్రి జిల్లాలో 230 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. ఒక్కటి కూడా తెరవలేదు. 

మిల్లుల్లోనూ కొనుగోళ్లు లేక.. 
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో మొత్తం 221 మిల్లులు ఉండగా.. ప్రస్తుతం 75 మిల్లుల్లోనే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ధాన్యం అమ్మకునేందుకు పెద్ద సంఖ్యలో రైతులు వ్యవసాయ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. కానీ కొనుగోళ్లు చేయలేని పరిస్థితులు అధికారులు తక్కువ సంఖ్యలో టోకెన్లు ఇస్తున్నారు. అదికూడా ఒకరికి ఒక టోకెన్‌ మాత్రమే ఇస్తుండటంతో.. ఎక్కువ ధాన్యమున్న రైతుల కుటుంబ సభ్యులు కూడా క్యూలైన్లలో నిలబడుతున్నారు. రెండు, మూడు రోజులుగా అకాల వర్షాలు పడుతుండటంతో.. ధాన్యం ఎక్కడ పాడవుతుందోనని ఆందోళనలకు దిగుతున్నారు.

ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తే చర్యలు 
మిర్యాలగూడ: సన్నరకం ధాన్యానికి మిల్లర్లు తక్కువ ధర చెల్లిస్తే చర్యలు తీసుకుంటామని నల్లగొండ ఎస్పీ రంగనా«థ్‌ హెచ్చరించారు. శుక్రవారం రాత్రి మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు మిల్లుల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. ధాన్యానికి చెల్లించిన ధరల బిల్లులను పరిశీలించారు. మిల్లర్ల సమావేశంలో నిర్ణయించిన మేరకే సన్నరకాలకు ధర చెల్లించాలన్నారు. రైతులకు టోకెన్లు ఇచ్చేక్రమంలో వారి ఫోన్‌ నంబర్లు తీసుకోవాలని, రోజువారీగా మిల్లుల్లో ధాన్యానికి చెల్లిస్తున్న ధరలను రైతులకు ఫోన్‌ చేసి తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. 

12 ఎకరాల వరికి ఒక్క టోకెనే ఇచ్చారు 
నేను 12 ఎకరాల్లో వరి వేశాను. ఒకేసారి నాటు వేయడం వల్ల ఒకేసారి కోతకు వచ్చింది. మూడు ట్రాక్టర్ల ధాన్యం ఉంటుంది. ఉదయం నుంచి క్యూలో ఉన్నా ఒక్క టోకెన్‌ మాత్రమే ఇచ్చారు. ఒక్క టోకెన్‌తో ధాన్యం మొత్తం ఎలా అమ్ముకోవాలి? ఇలాంటి విషయాలపై అధికారులు దృష్టిపెట్టాలి. 
–నాగుల్‌మీరా, రైతు, ఊట్లపల్లి, నల్లగొండ జిల్లా 

25 రోజులుగా పడిగాపులే..
భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దామెరకు చెందిన ఉప్పునూతల నర్సింహ ఏడున్నర ఎకరాల్లో వరి వేశాడు. దసరాకు ముందు ధాన్యాన్ని చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌కు తీసుకువచ్చి కుప్పపోశాడు. ఇన్నిరోజులు గడిచినా కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో ఆందోళనలో ఉన్నాడు.

సన్నరకాలు కొనేలా ఆదేశాలిచ్చాం 
జిల్లాలోని మిల్లుల్లో గత సీజన్‌ సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) ధాన్యం అలాగే ఉండటంతో ఇప్పుడు కొనుగోలు చేయలేకపోతున్నారు. శుక్రవారం నుంచి సన్నరకాలు కొనుగోలు చేయాలని మిల్లర్లను ఆదేశించాం. రైతులు ఇబ్బంది పడకుండా టోకెన్లు అందజేస్తాం. రైతులు తమకు కేటాయించిన రోజున ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్లాలి. 
     – వినయ్‌కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్, సూర్యాపేట  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement