
మహబూబాబాద్‌లో యూరియా బస్తాల కోసం వచ్చిన రైతులు
యూరియా కోసం రైతులకు తిప్పలేతిప్పలు
సాక్షి, మహబూబాబాద్ / మిరుదొడ్డి / ఆత్మకూర్: యూరియా కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిపడా స్టాక్ ఉందని అధికారులు చెబుతుండగా, టోకెన్లు ఇచ్చి వారం దాటినా యూరియా ఇవ్వడం లేదని రైతులు రోడ్డెక్కారు. పలుచోట్ల రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పోలీస్ పహారా మధ్య యూరియా బస్తాలు, టోకెన్లు ఇచ్చారు.
⇒ మహబూబాబాద్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణ సెంటర్‌లో శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. వందలాది మంది రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాలో రైతులకు మద్దతుగా ఎమ్మెల్సీ సత్య వతి రాథోడ్ పాల్గొన్నారు. చివరకు టోకెన్లు ఇచ్చి త్వరలో యూరియా అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆపై బందోబస్తు మధ్య టోకెన్లు పంపిణీ చేశారు.
⇒ కురవి, సీరోలు మండల కేంద్రాల్లో యూరియా పంపిణీ కేంద్రం వద్దకు పెద్దఎత్తున రైతులు రావడంతో పోలీస్ పహారా మధ్య పంపిణీ చేశారు.
⇒ సకాలంలో యూరియా ఇవ్వడం లేదని కేసముద్రం మండలం బేరువాడ, దనసరి, ఇనుగుర్తి, డోర్నకల్ మండలం మన్నెగూడెం ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగారు.
⇒ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పీఏసీఎస్‌కు శుక్రవారం యూరి యా లారీ వస్తుందని సమాచారం అందుకున్న పలు గ్రామాలకు చెందిన రైతులు అర్ధరాత్రి నుంచే క్యూ లైన్ కట్టారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి రైతులు చెప్పుల ను క్యూలో పెట్టి బయటకు వెళ్లారు. ఒకేసారి 3 వేల మంది రైతులు బారులు తీరడంతో టోకెన్లు ఇవ్వడంతో అధి కారులకు సైతం తిప్పలు తప్పలేదు. మొత్తానికి యూరి యా లారీ రావడంతో టోకెన్లు అందుకున్న రైతులకు రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేశారు.
⇒ వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతుల కుటుంబసభ్యులందరూ పడిగాపులు కాస్తు న్నారు. శుక్రవారం సొసైటీకి 700 బస్తాల యూరియా రాగా.. గురువారం టోకెన్లు తీసుకున్న 72 మంది అందజేశారు. శుక్రవారం మరో 70 మంది రైతులకు టోకెన్లు ఇచ్చారు. అయితే తమ వంతు ఎప్పుడు వస్తుందేమోనని తెల్లవారుజాము నుంచే రైతులు పీఏసీఎస్ కార్యాలయం వద్ద చెప్పులను క్యూలైన్‌లో పెట్టి ఎదురు చూస్తున్నారు. ఇంటివద్ద నుంచి భోజనం తెచ్చుకొని అక్కడే తింటున్నారు. అలసిపోయి చెట్టు నీడన నిద్రపోతున్నారు.
టోకెన్ ఇచ్చి ఐదురోజులు..
నాకున్న ఎకరంతోపాటు మూడు ఎకరాల పొలం మునాబాకు తీసుకు న్నా. పొలం నాటేసిన వెంటనే యూ రియా వేయాలి. నాటేసి నెలరోజు లైనా యూరియా వేయలేదు. యూరియా కోసం వస్తే వారం క్రితం టోకెన్లు ఇచ్చారు. ఇప్పటి వరకు బస్తా కూడా ఇవ్వలేదు. – అజ్మీర చక్రు, రోటిబండ తండా, మహబూబాబాద్
అదును దాటితే ఇబ్బందే..
వరి, మొక్కజొన్న సాగు చేశా. వర్షా లు పడుతున్నాయి. ఇప్పుడు యూ రియా వేస్తేనే దిగుబడి వస్తుంది. ఐదురోజుల నుంచి ఇద్దరం తిరుగు తున్నా ఒక్క బస్తా దొరకలేదు. అదును దాటిన తర్వాత యూరియా వేసినా లాభం లేదు. పంట దిగుబడి తక్కువ వస్తుంది. – భూక్య హుస్సేన్, సికింద్రాబాద్ తండా, మహబూబాబాద్