అంత లంచం ఇచ్చుకోలేనయ్యా...

Farmer Suicide Due To Demand For Bribe In Telangana  - Sakshi

తహసీల్‌ కార్యాలయం ఎదుటే పురుగుల మందు తాగిన రైతు

తన పట్టా భూమి ఇప్పించాలని మూడేళ్లుగా వేడుకోలు 

రూ.60 వేలు డిమాండ్‌ చేసిన సర్వేయర్‌

గద్వాల జిల్లా మల్దకల్‌లో ఘటన 

మల్దకల్‌: తమ పేరుపై ఉన్న పట్టాభూమిని సర్వే చేసి రిపోర్టు ఇచ్చేందుకు సర్వేయర్‌ ఏకంగా రూ.60 వేలు డిమాండ్‌ చేయడంతో, మనస్తాపంతో ఓ రైతు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుటే పురుగుల మందు తాగాడు. ఈ ఘటన శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్‌లో చోటు చేసుకుంది. మద్దెలబండ గ్రామానికి చెందిన బుడ్డ వీరన్న, నర్సింహులు, భీమేష్‌లు అన్నదమ్ములు. వీరికి గ్రామ శివారులో సర్వే నంబర్‌ 64లో 3.16 ఎకరాల పొలం ఉంది.

2015లో ఉపాధి నిమిత్తం ముగ్గురూ వలస వెళ్లి.. తిరిగి 2018లో స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సమయంలోనే వీరి పొలంలో 1.10 ఎకరాలను రాములు నాయక్‌ ఆక్రమించుకున్నాడు. దీనిపై జిల్లా రెవెన్యూ, పోలీసులకు సదరు రైతులు ఫిర్యాదు చేశారు. న్యాయం కోసం కోర్టును ఆశ్ర యించగా.. వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని అధికారుల ను వేడుకోగా, సర్వే చేసి రిపోర్టు అందజేస్తే, న్యా యంచేస్తామని  చెప్పారని ఆ రైతులు తెలిపారు. 

రూ. 60 వేలు ఇస్తేనే..
కొత్త పట్టాదారు పాసుపుస్తకం ఉన్న తన భూమిని సర్వే చేసి, రిపోర్టు ఇవ్వా లని సర్వేయర్‌ బ్రహ్మయ్యను వారు సంప్రదించా రు. భూ ఆక్రమణదారుడు తనకు రూ.50 వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని, మీరు రూ.60 వేలు ఇస్తే రిపోర్టు అనుకూలంగా ఇస్తానని సర్వేయర్‌ చెప్పినట్లు బాధితులు తెలిపారు. అంత డబ్బు ఇవ్వలేమని బతిమాలుకున్నా సర్వేయర్‌ కనికరించలే దన్నారు. దీంతో మనస్తాపం చెందిన బుడ్డ వీరన్న శుక్రవారం సాయంత్రం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఈ విషయాన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది, రైతులు వెంటనే ఆయనను గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నా.. మెరుగైన వైద్యం కోసం కర్నూలు తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. ఈ విషయంపై మల్దకల్‌ తహసీల్దార్‌ మీర్‌ అజాం అలీని వివరణ కోరగా, బుడ్డ వీరన్న పేరున పట్టా భూమి ఉన్న విషయం వాస్తవమేనని తెలిపారు. కోర్టులో విచారణ కొనసాగుతున్నట్లు తెలిసిందని, అందుకే రైతుకు న్యాయం చేయలేకపోయామని తప్పించుకునే ప్రయత్నం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top