విద్యుత్‌ షాక్‌.. గంటసేపు స్తంభంపైనే..

Electric Shock Tragedy In Adilabad - Sakshi

సాక్షి, నార్నూర్‌(ఆదిలాబాద్‌): నార్నూర్‌ మండలం మల్లంగి తండాలో విద్యుత్‌ షాక్‌తో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్పృహతప్పి గంటపాటు స్తంభంపైనే వేలాడుతూ ఉన్నాడు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన గురువారం వెలుగు చూసింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారంమల్లంగి గ్రామపంచాయతీ పరిధిలో మూడు అనుబంధ గ్రామాలు ఉన్నాయి. వర్షాకాలం కావడంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వీధి దీపాలు ఏర్పాటు చేసే పనిని సర్పంచ్‌ మాలేపూర్‌ గ్రామానికి చెందిన ప్రైవేటు హెల్పర్‌ మాటే పరమేశ్వర్‌కు అప్పగించాడు.

హెల్పర్‌ గ్రామానికే చెందిన హాండేభగ్‌ మాధవరావుతో కలిసి ఐదు రోజులుగా వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నాడు. బుధవారం సర్పంచ్‌ భర్త మల్లంగి తండాకు వెళ్లగా అక్కడ నాలుగు లైట్లు వెలగడం లేదని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సమస్యను పరమేశ్వ ర్‌ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో విద్యుత్‌ శాఖ ఏఈ కానీ, స్థానిక సిబ్బందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మాలేపూర్‌ గ్రామ సమీపంలో ఉన్న డీటీఆర్‌(టాన్స్‌ఫార్మర్‌) వద్ద ఏజీ ఫీజులు తీసివేసి నాలుగు స్తంభాలకు విద్యుత్‌ బల్బులు మార్చే పనులను పరమేశ్వర్, మాధవరావు చేపట్టారు. మూడు స్తంభాలకు వీధిదీపాలు బిగించారు.

నాలుగో స్తంభం ఎక్కి లైటు మార్చే క్రమంలో ఆ స్తంభం పైనుంచే ఉన్న 11 కేవీ విద్యుత్‌ తగలడంతో షాక్‌కు గురయ్యాడు. మెడ, చెయ్యి, కాళ్లు కాలిపోవడంతో స్పృహ తప్పి స్తంభంపైనే పడిపోయాడు. వెంటనే పరమేశ్వర్‌ విద్యుత్‌ అధికారులకు ఫోన్‌చేసి 11 కేవీ సరఫరా నిలిపివేయించాడు. అనంతరం గ్రామస్తుల సహకారంతో గంటపాటు శ్రమించి మాధవరావును కిందకు దించి ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలుపడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top