
సంరక్షణకు దాతల సహాయం
ఆవులకు ముద్దు పేర్లు
200 ఆవుల సంరక్షణ
తాటిపల్లి సురభి గోశాల నిరంతర కృషి
జగిత్యాల జోన్: దూడ నుంచి కాడెద్దు వరకు.. రైతుకు సేవలందించిన పశువులను వయసు మీరిన తర్వాత కబేళాలకు తరలించడం వారిని కదిలించింది. తనువు చాలించే వరకూ వాటిని రక్షించాలని అప్పుడే సంకల్పించారు. అనుకున్నదే తడవుగా స్వచ్ఛందంగా గోశాలను ఏర్పాటు చేసి 28 ఏళ్లుగా గోవులను రక్షిస్తున్నారు. వాటి పేడతో వర్మి కంపోస్టు, గోఆధారిత ఉత్పత్తులు తయారు చేసి పలువురి మన్ననలు అందుకుంటున్నారు జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామ శివారులోని సురభి గోశాల నిర్వాహకులు.
నాలుగు ఆవులతో ప్రారంభం
1997లో దాతల సహకారంతో రెండున్నర ఎకరాల్లో గోశాలను ఏర్పాటు చేశారు. ఇందులో కొంతభాగం ఆవుల కోసం షెడ్లను నిర్మించారు. కొంతభాగంలో ఆవుల పేడతో వర్మి కంపోస్టు తయారు చేస్తున్నారు. మరో 20 గుంటల భూమిలో పాడి ఆవులు, దూడల కోసం పచ్చిగడ్డిని పెంచుతున్నారు. మొదట నాలుగు ఆవులతో ప్రారంభమైన గోశాల.. ప్రస్తుతం 200 ఆవుల వరకు చేరింది.
గోశాలకు స్థలం సరిపోకపోవడంతో.. మేడిపల్లి శివారులో 41 ఎకరాలు కొనుగోలు చేశారు. అందులో పశువులను మేపడంతోపాటు పదెకరాల్లో నీలగిరి చెట్లు పెంచుతున్నారు. ప్రస్తుతం గోశాలలో 160 వరకు ఆవులు ఉన్నాయి. వంద ఆవులను మేడిపల్లి శివారు షెడ్లలో ఉంచుతున్నారు. మరో 60 ఆవులను తాటిపల్లి షెడ్లలో ఉంచుతున్నారు. గోశాల చుట్టూ ప్రహరీ గోడతో పాటు.. మూడు కుటుంబాల కూలీలు ఉండేందుకు షెడ్లు నిర్మించారు.
దాతల దాతృత్వంతో..
ప్రారంభం నుంచే గోశాల దాతల సహకారంతో నడుస్తోంది. కరోనాకు ముందు ఆవుల కోసం గడ్డిని కొనుగోలు చేసినప్పటికీ.. ప్రస్తుతం చుట్టుపక్క గ్రామాల రైతులే ఉచితంగా ఇస్తున్నారు. గతంలో ఆవులకు పుట్టిన ఆంబోతులను రైతులకు అమ్మితే.. కొంత ఆర్థికంగా కలిసి వచ్చేది. ఇప్పుడు ఉచితంగా ఇస్తామన్నా.. తీసుకునేవారు లేరు. ఫలితంగా ఆవులను రక్షించాల్సిన బాధ్యత నిర్వాహకులపై పడింది.
ప్రతినెలా కూలీల ఖర్చులు, పశువుల దాణా, మందులు వంటి నిర్వహణ కోసం రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. కిలోమీటరున్నర దూరంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద వేసిన బోరు నుండి.. గోశాలలోని నీటి తొట్టెల్లోకి తాగునీటిని పంపింగ్ చేసి పశువుల దాహార్తిని తీర్చుతున్నారు. పశువుల పేడతో వర్మి కంపోస్టు, పశువుల మూత్రంతో గో–ఆర్కను తయారు చేసి విక్రయిస్తుండటంతో, వాటిద్వారా వచ్చే అదాయం గోశాలకు కొంతమేర వెసులుబాటుగా మారింది.
గోశాలలో నిత్య పూజలు.. శిక్షణ
గోశాలలో సప్త గోసైత కృష్ణ మందిరం నిర్మించడంతో పాటు రోజూ నిత్య పూజలు చేస్తుంటారు. గోశాల కమిటీ నిర్వాహకులతో పాటు.. అక్కడి కూలీలు ఆవులను గాయత్రి, లక్ష్మి, దేవత, మల్లి అంటూ పేర్లతో పిలుస్తుంటారు. దీనికి తోడు, ఏటా కార్తీక పౌర్ణమి రోజు గోశాల వన భోజనాలు, గో పూజలతో సందడిగా ఉంటుంది. వారానికోసారి ఆవులను పశువైద్యులు పరిక్షిస్తుంటారు. గోశాలలో గో ఆధారిత వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, పెట్టుబడి లేని సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ ఇచ్చేందుకు రూ.35 లక్షలతో రైతు శిక్షణ మందిరం నిర్మించారు. ఇందులో నెలకోమారు సేంద్రియ వ్యవసాయ నిపుణులతో రైతులకు సదస్సులు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం అంతంతే..
గోశాలకు పెద్దగా ప్రభుత్వ ప్రోత్సాహం అందడం లేదు. పలు పార్టీల రాజకీయ నాయకులు గోశాలకు వచి్చనప్పటికీ.. పెద్దగా నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవు. ఇది చాలదన్నట్లు, పోలీసులు ఎక్కడో పట్టుకున్న ఆవులను గోశాలలో వదిలేసి వెళ్తుండటం, వాటి నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వకుండా నెలల తరబడి ఉంచుతుండటం, కేసులో ఉన్న పశువులు చనిపోతే పోస్టుమార్టమ్ చేయించడం వంటి అనవసర సమస్యలు గోశాల నిర్వాహకులకు ఇబ్బందిగా మారాయి.
దాతల సహకారంతోనే..
దాతల సహకారంతోనే సురభి గోశాలను నిర్వహిస్తున్నాం. వర్మి కంపోస్టు అమ్మితే విద్యుత్ బిల్లుల నిర్వహణకే సరిపోవడం లే దు. కూలీల జీతాలు సైతం దాతలే చెల్లించాల్సి వస్తోంది. గోశాలకు దాతలు ఇతోధికంగా సహాయం చేసి గోశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. – తురగ రాజిరెడ్డి, గోశాల అధ్యక్షుడు, జగిత్యాల
ప్రభుత్వం ప్రోత్సాహమివ్వాలి
గోశాలకు ప్రభు త్వం ప్రోత్సాహం అందించాలి. గోశాలలో అన్ని వసతులు ఉన్నందున.. గో ఆధారిత వ్యవసాయంపై శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. గోశాల అభివృద్ధికి సైతం ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. – బండారి కమలాకర్ రావు, గోశాల ప్రధాన కార్యదర్శి, జగిత్యాల