
గంగారాంను ఈడ్చుకెళ్తున్న కలెక్టరేట్ పోలీసులు
ప్రజావాణికి వచ్చిన దివ్యాంగుడిని ఈడ్చుకెళ్లిన సిబ్బంది
జగిత్యాల కలెక్టరేట్‌లో అమానవీయం
జగిత్యాల టౌన్: జగిత్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన ఓ దివ్యాంగుడిని ఈడ్చుకెళ్లిన అమానవీయ ఘటన కలకలం సృష్టించింది. అధికారులకు గోడు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా దివ్యాంగుడిని (లోకోమోటివ్ డిజార్డర్) కలెక్టరేట్ పోలీసులు, సిబ్బంది బయట వదిలేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన మర్రిపెల్లి రాజగంగారాం ప్రజావాణిలో తన సమస్య చెప్పుకునేందుకు చక్రాలబండిపై వచ్చాడు. కలెక్టర్ వస్తున్నారంటూ అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ కానిస్టేబుల్, ఇతర సిబ్బంది రాజగంగారాంను వీల్‌చైర్‌తో సహా బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. ఆడిటోరియం తలుపును పట్టుకున్న గంగారాం.. అక్కడే నేలపై పడుకుని నిరసన తెలిపే ప్రయత్నం చేశాడు.
సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన కలెక్టర్ సత్యప్రసాద్ దివ్యాంగుడిని పట్టించుకోకుండానే లోపలికి వెళ్లిపోయారు. తర్వాత రాజగంగారాంను సిబ్బంది ప్రజావాణి ప్రాంగణం నుంచి బయట వదిలేశారు. తన ఇంటికి అడ్డుగా గోడ నిర్మించి ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత సోమవారం కూడా నేలపై పడుకుని నిరసన తెలిపాడు.
అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తిరిగి ప్రజావాణికి వచ్చి తన సమస్య వివరించే ప్రయత్నం చేయగా ఆయన్ను బయటకు తోసేయడం వివాదాస్పదంగా మారింది. వెన్నుపూస సంబంధిత వైకల్యంతో బాధపడుతున్న తాను ఎనిమిదేళ్లుగా ఆర్డీవో, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ తన సమస్యను పట్టించుకోలేదని రాజగంగారం వాపోయారు.
బాధ్యుడైన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలి: కవిత
గోడు చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడిని కలెక్టర్ ఎదుటే ఈడ్చుకెళ్లి బయట పడేయడం అత్యంత దుర్మార్గమని, ఈ ఘటనకు బాధ్యుడైన కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. తన కళ్లెదుటే ఇంతటి దారుణం జరుగుతున్నా స్పందించని కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆమె డిమాండ్ చేశారు.
ప్రజావాణికి వచ్చిన దివ్యాంగుడిని ఈడ్చుకెళ్లడం ఏంటి?: వాసుదేవరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనకున్న సమస్యను చెప్పుకుందామని ప్రజావాణికి వచ్చిన దివ్యాంగుడిని పోలీసులు ఈడ్చుకెళ్లడం ఏంటని దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా? లేదా రాచరికమా అని సోమవారం ఒక ప్రకటనలో నిలదీశారు. జగిత్యాల కలెక్టరేట్‌లో జరిగిన సంఘటన మానవత్వానికి మాయని మచ్చ అని మండిపడ్డారు. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, జగిత్యాల మంత్రి, జిల్లా కలెక్టర్ స్పందించి ఆ దివ్యాంగుడి సమస్యను తీర్చాలని కోరారు.