దారి తప్పుతున్న పోలీస్‌ సిబ్బంది | Sakshi
Sakshi News home page

దారి తప్పుతున్న పోలీస్‌ సిబ్బంది

Published Wed, Mar 27 2024 8:06 AM

Telangana Some Police Officers Irregularities In Jagtial - Sakshi

జగిత్యాలక్రైం/మెట్‌పల్లి: జిల్లాలో కొందరు పోలీస్‌ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖకు కళంకం తెస్తోంది. శాంతిభద్రతల విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటూ ప్రజల మెప్పు పొందేలా ఉన్నతాధికారులు వ్యవహరిస్తుంటే కిందిస్థాయిలో మాత్రం కొందరు సిబ్బంది ఖాకీ చొక్కాను అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేస్తూ పోలీస్‌ శాఖను అభాసు పాల్జేస్తున్నారు. దారి తప్పిన సిబ్బందిపై ఉన్నతాధికారులు వారం వ్యవధిలోనే వేటువేయడం ఇందుకు అద్దం పడుతోంది.

జేబులు నింపుతున్న అక్రమదందాలు
పోలీస్‌స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల నుంచే కాకుండా బయట అక్రమదందాలు నడిపే వారి నుంచి కూడా కొందరు సిబ్బంది వసూళ్లకు పాల్ప డుతున్నారు. ఇసుక, పేకాట, బెల్టు, మద్యం, కల్లు, దాబాలు, రేషన్‌ బియ్యం తదితర దందాలు చేసే వారి నుంచి నెలవారీగా మామూళ్లు వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. స్టేషన్ల ఖర్చులతో పేరుతో కొన్నిచోట్ల ఎస్‌హెచ్‌ఓలు ఈ వసూళ్లకు పాల్పడుతుంటే.. కింది సిబ్బంది సైతం వారినే అనుసరిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కొన్ని స్టేషన్లలో సివిల్‌ పంచాయితీలకు పెద్దపీట వేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. సివిల్‌ కేసుల్లో పోలీసులు తల దూర్చరాదు. కానీ ఈ కేసుల్లో అధిక సొమ్ము వస్తుందనే ఆశతో ఎక్కువగా ఇలాంటి వాటిపైనే దృష్టి పెడుతున్నారు.

ఉన్నతాధికారుల చర్యలతో దారికొచ్చేనా..?
అక్రమ వసూళ్లు, మహిళల పట్ల వంకరబుద్ధి ప్రదర్శిస్తున్న పోలీస్‌ సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. జిల్లావ్యాప్తంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో జరుగుతున్న పోలీ సుల వ్యవహారంపై ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి కఠిన చర్యలు చేపడుతోంది. పోలీస్‌ శాఖలో పనిచేసే ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

2023
నవంబర్‌ 28న ధర్మపురి పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్‌ శేఖర్‌నాయక్‌ ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో విచారణ చేపట్టిన అధికారులు సస్పెండ్‌ చేశారు.

♦ మల్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్‌ సుదర్శన్‌ అక్రమ వసూళ్లకు పాల్పడగా విచారణ చేపట్టిన పోలీసులు ఈనెల 22న సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

జగిత్యాల పట్టణ సీఐగా పనిచేస్తున్న నటేశ్‌ అవినీతి ఆరోపణలు, క్రైం బర్కింగ్‌ ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టి ఫిబ్రవరి 23న సస్పెండ్‌ చేస్తూ మల్టీజోన్‌–1 ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

♦ రాయికల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్‌ మహేందర్‌ అల్లీపూర్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద కోర్టు విషయంలో వసూళ్లకు పాల్పడగా 2024 ఫిబ్రవరి 2న సస్పెండ్‌ చేశారు.

♦ డీసీఆర్బీ ఎస్సైగా పనిచేస్తున్న వెంకట్రావ్‌ కొడిమ్యాల పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నసమయంలో ఓ మహిళ కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు విచారణ చేపట్టిన పోలీసులు ఈనెల 23న సస్పెండ్‌ చేస్తూ మల్టీజోన్‌–1 ఐజీ ఉత్తర్వులు జారీచేశారు.

ఇబ్రహీంపట్నం ఏఎస్సైగా పనిచేస్తున్న రాములు ఓ మహిళ పోలీస్‌స్టేషన్‌కు వస్తే ఆమెతో పరిచయం పెంచుకుని సన్నిహితంగా ఉండగా ఫొటోలు తీయించుకున్నాడు. అవి వైరల్‌ కావడంతో ఏఎస్సైని ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఈనెల 25న ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు మల్టీజోన్‌ ఐజీకి నివేదిక సమర్పించారు.

► మల్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు  నిర్వర్తించే హెడ్‌కానిస్టేబుల్‌తోపాటు, ఇద్దరు కానిస్టేబుళ్లు వారం క్రితం బయట వ్యక్తులతో పోలీస్‌స్టేషన్‌లోనే మద్యం సేవించిన విషయం వెలుగు చూడటంతో విచారణ చేపట్టిన     పోలీసులు త్వరలోనే క్రమశిక్షణ చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. 

పోలీస్‌స్టేషన్‌లోనే మాంసం, మద్యంతో జల్సా

హెడ్‌కానిస్టేబుల్‌, ఇద్దరు కానిస్టేబుళ్ల నిర్వాకం

ఈనెల 17న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి

మల్లాపూర్‌: ఈనెల 17న మల్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ముగ్గురు సిబ్బంది మాంసం, మద్యంతో జల్సా చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ రోజు జగిత్యాలలో ప్రధాని మోదీ సభ ఉండడంతో బందోబస్తు కోసం ఎస్సై కిరణ్‌కుమార్‌ వెళ్లారు. దీంతో హెడ్‌కానిస్టేబుల్‌ అశోక్‌, కానిస్టేబుళ్లు ధనుంజయ్‌, సురేశ్‌ పోలీస్‌స్టేషన్‌లోకి మాంసం, మద్యం తెచ్చుకుని పార్టీ చేసుకున్నారని, వీరితో మరో ఇద్దరు బయటి వ్యక్తులు కూడా పాల్గొన్నారని సమాచారం. వారు పార్టీ చేసుకునే సమయంలో అక్కడికి వెళ్లిన ఓ అధికారి ఆ తతంగాన్ని చూసి సదరు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

పార్టీలో పాల్గొన్నవారిలో ఒకరు విషయాన్ని బయట పెట్టడంతో విషయం జిల్లా పోలీస్‌ బాస్‌ దృష్టికి చేరింది. ఆయన సదరు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేసి విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. వీరిపై రెండు, మూడు రోజుల్లోనే క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ విషయమై ఎస్సైని సంప్రదించగా.. పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది జల్సా చేసుకుంది నిజమేనని, సిబ్బందిపై ఎస్పీకి నివేదించామని పేర్కొన్నారు.

క్రమశిక్షణ ఉల్లంఘిస్తే  చర్యలు తప్పవు
పోలీస్‌ అధికారులు, సిబ్బంది అంతా క్రమశిక్షణతో పనిచేయాలి. ప్రజలకు సత్వర సేవలందించడంతోపాటు, న్యాయం జరిగేలా చూడాలి. ఎలాంటి ఆరోపణలు వచ్చినా విచారణ చేపట్టి నిజమని తేలితే చర్యలు తీసుకుంటాం.  
– సన్‌ప్రీత్‌సింగ్, ఎస్పీ 

Advertisement
Advertisement