పిక్కలు పీకేస్తున్నాయ్‌ | Dog bites are increasing every year in the state | Sakshi
Sakshi News home page

పిక్కలు పీకేస్తున్నాయ్‌

Feb 6 2025 4:15 AM | Updated on Feb 6 2025 4:15 AM

Dog bites are increasing every year in the state

రాష్ట్రంలో ఏటా పెరిగిపోతున్నకుక్క కాట్లు

ఒక్క 2024లోనే 1,21,997 కేసుల నమోదు 

జీహెచ్‌ఎంసీ చుట్టుపక్కలజిల్లాల్లో 42,067 కేసులు..13 అనుమానాస్పద మరణాలు.. 

గతేడాదితో పోల్చితే పెరిగిన తీవ్రత

పటాన్‌చెరులోని ఇస్నాపూర్‌లో 2024, జూన్‌ 28న వీధికుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడు విశాల్‌ మృతిచెందాడు. బిహార్‌కుచెందిన బాలుడి కుటుంబం పొట్టకూటి కోసం రాష్ట్రానికివచ్చిoది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన బాలుడిపై కుక్కలు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

హైదరాబాద్‌ మణికొండలో 2024, జూన్‌ 22నఓ మహిళపై ఏకంగా 15 వీధికుక్కలు దాడి చేశాయి. సుమారు అరగంటసేపు తీవ్రంగా దాడి చేశాయి.చివరకు ఎలాగోలా బాధితురాలు వాటి బారి నుంచిప్రాణాలతో బయటపడింది.

సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్రంలో ఏటా కుక్కకాట్లు పెరిగిపోతున్నాయి. రాజధాని హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో కుక్కల దాడుల ఘటనలు వందలు, వేలల్లో చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కుక్క కాట్లు తగ్గడం లేదు.. ప్రభుత్వ గణాంకాలే దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. 2024లో 1,21,997 కేసులు నమోదవగా జీహెచ్‌ఎంసీ, చుట్టుపక్క జిల్లాల్లోనే 42,067 కేసులు నమోదయ్యాయి. ఆయా ఘటనల్లో 13 మంది మరణించారు. 2023 గణాంకాలతో పోలిస్తే ఇది చాలా అధికం. 

స్పందించిన హైకోర్టు 
వీధికుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడు మృతిచెందిన ఉదంతంపై వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. గతంలో ఇదేఅంశంపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లకు దీన్ని జత చేసింది. ఈ పిటిషన్లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిజస్టిస్‌ సుజోయ్‌పాల్, జస్టిస్‌ రేణుక యారా ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కౌంటర్‌ దాఖలు చేసింది. దీనిపైరిప్లై కౌంటర్‌ వేయడానికి సమయం కావాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరడంతో విచారణ 25కు వాయిదా వేసింది.

జీహెచ్‌ఎంసీ చేస్తున్న కసరత్తు ఇలా..
» మున్సిపల్‌ కార్పొరేషన్‌ బయట కుక్కల కోసం పునరావాస కేంద్రాల ఏర్పాటు కుక్కకాట్లు, ఇతరఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 040–2111111 అందుబాటులోకి.. 
» 898 కుక్కల సంరక్షణ కేంద్రాలతోపాటు 92 బోన్లు, కుక్కల తరలింపునకు 49 వ్యాన్ల ఏర్పాటు 
» యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ (ఏబీసీ)కి సంబంధించిన6 ఆపరేషన్‌ థియేటర్ల ఏర్పాటు. స్టెరిలైజేషన్,వ్యాక్సినేషన్‌కు చర్యలు  
» 18 మంది వెటర్నరీలు,ఆరుగురు షెల్టర్‌ మేనేజర్లు, 22 పారా వెటర్నరీలు, 362 మంది డ్రైవర్లు, అవుట్‌ సోర్సింగ్‌ వర్కర్ల నియామకం

కుట్లు వేస్తే వైరస్‌ వ్యాప్తి... 
కుక్క కరిచిన వెంటనే ట్యాప్‌ వాటర్, సబ్బుతో గాయాన్ని కడగాలి. చర్మంపై గాయాలకు టీటీ, యాంటీ రేబిస్‌ నాలుగు డోసులు సరిపోతుంది. కుక్క కరిచిన 1వ రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు టీకా వేయించుకోవాలి. కండ లోపలికి గాయమైనా కుట్లు వేయకూడదు. 

వేస్తే శరీరంలో వైరస్‌ మరింత వ్యాప్తి చెందుతుంది. ఒకవేళ చేతులు, ముఖంపై తీవ్ర గాయాలైతే ముందుగా అక్కడ ఇమ్యునోగ్లోబులిన్‌ ఇంజెక్షన్‌ వేయాలి. 2 గంటలు ఆగాక కుట్లు వేయవచ్చు. ఎంత ఆలస్యమైనా యాంటీ రేబిస్‌ టీకా తీసుకోవాలి. – డాక్టర్‌ జి.రాజమనోహర్‌రెడ్డి,  ల్యాప్రోస్కోపిక్‌ సర్జన్‌

మెదడు అదుపులో ఉండదు... 
రేబిస్‌ సోకిన కుక్కలమెదడు అదుపులోఉండదు. ఎదురుగా ఏ జీవివచ్చినా కరుస్తాయి. కరిచినప్పుడు లాలాజలంలోఉండే వైరస్‌ శరీరంలోకి వెళ్తుంది. రేబిస్‌ సోకినజంతువు, వ్యక్తి కూడా కుక్కల మాదిరేప్రవర్తిస్తారు.– చిట్యాల బాబు,వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్, కనగల్‌

సంవత్సరాల వారీగా రాష్ట్రంలో కుక్క కాటు కేసులు, అనుమానాస్పద మరణాలు.. 
                                      2022        2023         2024        మొత్తం 
కుక్క కాటు కేసులు          92,924    1,19,014    1,21,997    3,33,935 
అనుమానాస్పద మరణాలు    8              15             13             36 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement