సర్దుకుపోదాం రండి!.. టీపీసీసీ నేతలతో దిగ్విజయ్‌ భేటీ | digvijay singh steps in to save telangana congress | Sakshi
Sakshi News home page

సర్దుకుపోదాం రండి!.. టీపీసీసీ నేతలతో దిగ్విజయ్‌ భేటీ

Published Thu, Dec 22 2022 3:23 AM | Last Updated on Thu, Dec 22 2022 3:06 PM

digvijay singh steps in to save telangana congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ న్యూఢిల్లీ:  రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల అంతర్గత సమస్యలను పరిష్కరించేందుకు అధిష్టానం దూతగా సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ హైదరాబాద్‌ వచ్చారు. బుధవారం రాత్రి 8:30 గంటల సమయంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌ కుమార్, పార్టీ ముఖ్య నేతలు హర్కర వేణుగోపాల్‌రావు, సంగిశెట్టి జగదీశ్‌ తదితరులు స్వాగతం పలికారు. దిగ్విజయ్‌ నేరుగా తాజ్‌ కృష్ణా హోటల్‌కు చేరుకున్నారు.

అక్కడ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆయన్ను కలిశారు. కాగా గురువారం ఉదయం 11 గంటల నుంచి గాంధీభవన్‌లో దిగ్విజయ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో విడివిడిగా భేటీ కానున్నారు. పీసీసీ డెలిగేట్ల నియామకం నుంచి పీసీసీ కమిటీల ఏర్పాటు, రేవంత్‌ రెడ్డితో సీనియర్ల సమన్వయం, పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలకు గల కారణాలపై వారితో చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం నాలుగున్నర గంటల సమయంలో దిగ్విజయ్‌ మీడియాతో మాట్లాడనున్నట్లు గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.  

ఇప్పటికే సమాచార సేకరణ 
తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితిపై దిగ్విజయ్‌ సింగ్‌ ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించారు. హైదరాబాద్‌ బయలుదేరడానికి ముందే ఢిల్లీలో ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శులు నదీమ్‌ జావెద్, బోసురాజుతో సమావేశమయ్యారు. పార్టీలో విభేదాలకు గల కారణాలపై ఆరా తీశారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో సీనియర్లకు పొసగకపోవడానికి గల కారణాలు, పీసీసీ కమిటీపై సీనియర్ల అభ్యంతరాలు, వారి డిమాండ్లు అడిగి తెలుసుకున్నారు.

పీసీసీలో రేవంత్‌ వర్గంగా ఉన్న నేతల వివరాలు, వారి రాజీనామాల అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. రేవంత్‌కు, సీనియర్ల మధ్య సమన్వయానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ చేసిన ప్రయత్నాల వివరాలను తీసుకున్నారు. అనంతరం పార్లమెంట్‌కు వెళ్లిన దిగ్విజయ్‌.. మాణిక్యం ఠాగూర్‌తోనూ సమావేశమై పార్టీలో విభేదాలపై చర్చించారు. ఆ తర్వాతే హైదరాబాద్‌ బయలుదేరారు. 

వాదనలకు సిద్ధం: దిగ్విజయ్‌ ముందు తమ వాదనలు వినిపించేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు సిద్ధమయ్యాయి. పార్టీ అభివృద్ధికి తాము కష్టపడిన తీరును, సీనియర్లతో సమన్వయం కోసం రేవంత్‌రెడ్డి చేసిన ప్రయత్నాలను వివరించేందుకు రేవంత్‌ వర్గం సిద్ధమైనట్లు తెలిసింది. మరోవైపు రేవంత్‌ ఏకపక్ష వైఖరి, మాణిక్యం ఠాగూర్‌ వ్యవహారశైలి, పీసీసీ పదవుల్లో పార్టీలోని పాతకాపులకు జరిగిన అన్యాయం, సీనియర్లను కోవర్టులుగా చిత్రీకరించేందుకు యత్నించడం, సోషల్‌మీడియాలో దుష్ప్రచారం తదితర అంశాలపై సీనియర్లు నివేదికలు సిద్ధం చేసుకున్నారు. ఇలావుండగా పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి గురువారం నాటి సమావేశానికి హాజరుకావడం లేదని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement