నరహరి దంపతులకు రివార్డు డీడీని అందజేస్తున్న డీజీపీ ఆనంద్
మావోయిస్టు అగ్రనేత గణపతి సహా తెలంగాణ నుంచి మిగిలిన ముగ్గురికి డీజీపీ సీవీ ఆనంద్ సూచన
డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి దంపతులు
సాక్షి, హైదరాబాద్: అజ్ఞాతంలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన మిగిలిన ముగ్గురు మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని డీజీపీ సీవీ ఆనంద్ భరోసా ఇచ్చారు. కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, జోడె రత్నబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగ్తులు లొంగిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, బిహార్–జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ కార్యదర్శి పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ అలియాస్ సలైదా, ఆయన భార్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేదర దానమ్మ అలియాస్‌లత అలియాస్ పూనం మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్ సమక్షంలో జనజీవనస్రవంతిలో కలిశారు. ఇద్దరి పేరిట ఉన్న రివార్డు మొత్తానికి సంబంధించి మొత్తం రూ.45 లక్షలకు రెండు డీడీలను డీజీపీ వారికి అందించారు. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ పోలీసుల వద్దకు వచ్చినా నరహరి అనారోగ్య కారణాల రీత్యా మంగళవారం లొంగుబాటు చూపారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాంతిభద్రతల డీజీ మహేశ్ భగవత్, ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్‌కుమార్, ఎస్‌ఐబీ ఇంచార్జి కార్తీకేయలతో కలిసి డీజీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు.
గణపతి విదేశాల్లో ఉన్నారన్నది అవాస్తవం
మావోయిస్టు అగ్రనేత గణపతి విదేశాల్లో ఉన్నట్టు వస్తున్న వార్తలు వాస్తవం కాదని, గణపతికి ఎక్కడ ఉన్నారన్న దానికి సంబంధించిన కచ్చితమైన సమాచారం తెలియనప్పటికీ దేశంలోనే ఏదో ఒక చోట గణపతి ఉండొచ్చని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామన్నారు. తిరిగి మావోయిస్టు భావజాలం వైపు మళ్లకుండా వారికి నచ్చిన పనిలో మెళకువలు నేర్పేలా ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నట్లుగా స్కిల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు అందుతున్న పునరావాస కార్యక్రమాల గురించి స్వయంగా తెలుసుకుంటానని, త్వరలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మావోయిస్టుల సమస్యపై గత అనుభవాల దృష్ట్యా ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్‌ను ఇంకా కొనసాగిస్తామని, అయితే సిబ్బంది కొంత తగ్గొచ్చని తెలిపారు. లొంగిపోయినవారి గురించి స్థానిక పోలీసుల నుంచి జిల్లాల ఎస్పీలు, సీపీల వరకు గమనిస్తూనే ఉంటారని, ప్రతి నెల, రెండు నెలలు, ఆరు నెలలకు ఒకసారి పునరావాసంపై రిపోర్టులు తీసుకుంటామని వెల్లడించారు.
పరిస్థితులు అనుకూలంగా లేకనే లొంగుబాటు : నరహరి
దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ నష్టాలను చవిచూసిందని, ఈ సమయంలో సాయుధ పోరాటమనే దారి ప్రస్తుతం కష్టాల మయంగా కనిపించడం..అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పునరావాస పథకంలోని అనుకూలత కారణంగా జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు పసునూరి నరహరి తెలిపారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన పసునూరి నరహరి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ ఆర్‌ఎస్‌యూలో చేరారు. 1982లో పీపుల్స్‌వార్‌లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు. తుపాకులు, రాకెట్లు, రాకెట్ ప్రేరేపిత గ్రెనేడ్ల తయారీలో నరహరికి అపారమైన నైపుణ్యం ఉంది. నరహరి భార్య మేదరి దానమ్మది ఏపీలోని గుంటూరు, ఆమె 1986 నుంచి ఉద్యమంలోకి వచ్చారు.


