మేడారం.. జనసంద్రం 

Devotees Rush In Sammakka Sarakka Medaram Before The Maha Jatra - Sakshi

మహాజాతరకు ముందే పెరిగిన రద్దీ 

ఒక్కరోజే అమ్మవార్లను  దర్శించుకున్న ఆరున్నర లక్షల మంది  

ట్రాఫిక్‌ జామ్‌తో అవస్థలు 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/తాడ్వాయి: మహాజాతరకు ముందే భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది. వనదేవతలను దర్శించుకునేందుకు, మొక్కులు తీర్చుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం భక్తుల తాకిడి పెరగడంతో మేడారం సందడిగా మారింది. ఈ ఒక్కరోజు దాదాపు ఆరున్నర లక్షల మందికి పైగా భక్తులు దేవతలను దర్శించుకున్నట్టు అధికారులు అంచనా వేశారు. ఈసారి జాతరకు ముందు నెల రోజుల నుంచే అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.  

16 నుంచి జాతర 
మహాజాతర ఉత్సవాలు ఈ నెల 16న బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 16న (బుధవారం) కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ నుంచి పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరనున్నారు. 17న (గురువారం) చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపై కొలువుదీరనుంది. 18న (శుక్రవారం) భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. 19న (శనివారం) సమ్మక్క ,సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు తిరిగి వన ప్రవేశం చేయనున్నారు. కాగా, సమ్మక్క–సారలమ్మల పూజారులు అమ్మవార్ల పూజా కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. దేవాదాయ శాఖ అధ్వర్యంలో పూజారులకు కావాల్సిన పూజ సామగ్రి, దుస్తులు అందించారు.  

భక్తుల తాకిడి.. ట్రాఫిక్‌ జామ్‌ 
భక్తుల తాకిడి పెరుగుతుండటంతో పోలీసులు ముందస్తుగా శనివారం నుంచే ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఆదివారం సెలవు కావడంతో భక్తుల రద్దీ పెరిగి హన్మకొండ–మేడారంకు వెళ్లే రహదారి పస్రా, తాడ్వాయి, నార్లాపూర్‌ మార్గాల్లో పలుచోట్ల ట్రాఫిక్‌ జామైంది. తాడ్వాయి–మేడారం మధ్య గంటల తరబడి వాహనాలు నిలిచి భక్తులు ఇబ్బందిపడ్డారు. మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు మేడారం సందర్శనలో ఉండటం, మరోవైపు మేడారం బస్‌ డిపో ప్రారంభం సందర్భంగా ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఉన్నతాధికారులు రావడంతో పోలీసు బలగాలను అక్కడ మోహరించాల్సి వచ్చింది. పోలీసులు అప్రమత్తమై ఎక్కకికక్కడ వాహనాలను పార్కింగ్‌ స్థలాల్లోకి మళ్లించి నియంత్రణ చర్యలు చేపట్టారు. 

మేడారం రూట్‌మ్యాప్‌
మేడారం జాతరకు అంతా సిద్ధమైంది. 16 నుంచి ప్రజలు తరలివచ్చి సమ్మక్క, సారక్క గద్దెలను దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో అక్కడికి ఎలా వెళ్లాలి.. ఎలా రావాలి.. ట్రాఫిక్‌ ఆంక్షలు ఏంటి.. వాహనాల పార్కింగ్‌ ఎక్కడ.. లాంటి సందేహాల నివృత్తికి రూట్‌మ్యాప్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top