జీపీల సొంత ఆదాయం బ్యాంక్‌ ఖాతాలో వేయండి | Deposit GPs own income into their bank accounts | Sakshi
Sakshi News home page

జీపీల సొంత ఆదాయం బ్యాంక్‌ ఖాతాలో వేయండి

May 27 2026 2:26 AM | Updated on May 27 2026 2:26 AM

Deposit GPs own income into their bank accounts

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి సీతక్క, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి

గ్రామపంచాయతీ సిబ్బందికి మొదటి తారీఖునే జీతాలు అందాలి 

ఒక్కరోజు ఆలస్యమైనా ఊరుకునేది లేదు 

ప్రస్తుత పెన్షన్‌ విధానాన్ని మార్చి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయాలి... అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డి 

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్షా సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని (వోన్‌ సోర్స్‌ రెవెన్యూ) ట్రెజరీ ఖాతాలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా సవరించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతీ నెలా మొదటి తారీఖునే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఐఏఎస్‌ అధికారులకు నెల నెలా సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా అలాగే జీతాలు అందాలన్నారు. సిబ్బంది జీతాలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా రూ.50 కోట్లు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా ఊరుకునేది లేదని వారిని హెచ్చరించారు. 

మంగళవారం డా.ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో పంచాయతీ, ఆర్థికశాఖల అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి పెన్షన్ల పంపిణీ విధానంపై కీలక ఆదేశాలిచ్చారు. ప్రస్తుత పెన్షన్‌ విధానాన్ని మార్చి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని సూచించారు. అర్హులకే చేయూత పించన్లు అందేలా చూడాలని స్పష్టంచేశారు. ఓటర్‌ ఐడీ, ఆధార్, కులగణన (సీప్‌సీ డేటా) ఆధారంగా పెన్షన్లను స్ట్రీమ్‌ లైన్‌ చేయాలని ఆదేశించారు. కొత్తగా అందించే పెన్షన్లలో ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. కాగా సొంత ఆదాయంపై గ్రామపంచాయతీల స్వతంత్రతకు భంగం కలిగించేలా గత ప్రభుత్వం నిబంధనను తొలగించిందని, ఇప్పుడు దానిని పునరుద్ధరించేందుకు సీఎం అంగీకారం తెలిపారు. దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేయాల్సి ఉంటుంది. 

ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి గవర్నర్‌కు పంపిస్తే ఆయన ఆమోదం తర్వాత ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఈ మేరకు ఆర్డినెన్స్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత శాసనసభ సమావేశాల సమయంలో దీనిపై చట్ట సవరణ బిల్లు పెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం ఆదేశాలతో జీపీల సొంత ఆదాయాన్ని (వోన్‌ సోర్స్‌ రెవెన్యూ)బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా పీఆర్‌ఆర్‌డీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమీక్షా సమావేశంలో పీఆర్‌ ఆర్‌డీమంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు, ఎంపీ వేం నరేందర్‌ రెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ దానకిషోర్, కమిషనర్‌ దివ్యాదేవరాజన్, సీఎం సెక్రటరీ మాణిక్‌ రాజ్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement