బేసిక్‌ ఫోన్‌ వాడుతున్నారా? ఈ హెచ్చరిక మీకోసమే!

Cyber Mafia Misusing Feature Phone Mobile Number To Whatsapp - Sakshi

బేసిక్‌ ఫోన్‌ వినియోగదారుల నంబర్‌ దుర్వినియోగం 

వివిధ కారణాలతో వారినుంచి ఓటీపీ సంగ్రహణ 

తమ ఫోన్లలో యాక్టివేట్‌ చేసుకుని వైఫైలో వినియోగం 

వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్న సైబర్‌ మోసగాళ్లు  

సాక్షి, సిటీబ్యూరో: ‘మా నాన్న బేసిక్‌ మోడల్‌ ఫోన్‌ వాడుతున్నారు. ఆయన వినియోగిస్తున్న నంబర్‌తో గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్‌ యాక్టివేట్‌ చేసుకున్నారు. అందులో అభ్యంతరకర స్టేటస్‌లు పెడుతున్నారు. ఇది మా నాన్నతో పాటు మొత్తం కుటుంబానికే ఇబ్బందికరంగా మారింది’ కాచిగూడకు చెందిన ఓ వ్యక్తి శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఇచి్చన ఫిర్యాదు ఇది. ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ను తమకు నచి్చనట్లు వాడేస్తుండటంతో ఈ తరహా ఫిర్యాదులు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.  

వారికి అదే కలిసి వస్తోంది... 
వాట్సాప్‌ మాత్రమే కాదు.. ఈ తరహా యాప్స్‌ వినియోగించడంలో ఉన్న ఓ చిన్న లోపం సైబర్‌ నేరగాళ్లకు కలిసి వస్తోంది. వాట్సాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక కేవలం యాక్టివేట్‌ చేసుకోవడానికి మాత్రమే ఫోన్‌ నంబర్‌ అవసరం. ఆ సందర్భంలో వచ్చే వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ లేదా వెరిఫికేషన్‌ కోడ్‌/కాల్‌ను అందుకోవడానికి ఫోన్‌ నంబర్‌ కచ్చితం. ఆ తర్వాత నంబర్, సిగ్నల్‌తో సంబంధం లేకుండా వైఫైలో వాట్సాప్‌‌ను వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అనేకసార్లు ఫోన్‌ సిగ్నల్‌ లేకపోయినా వాట్సాప్‌ వినియోగదారులు వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్‌ చేసుకోగలుగుతారు. ఫోన్‌ నంబర్‌తో అవసరం లేని ఈ విధానమే సైబర్‌ మోసగాళ్లకు కలిసి వస్తోంది.  

ఆయా యాప్స్‌లో సెర్చ్‌ చేస్తూ... 

  • వేధింపులు, బెదిరింపుల సహా ఇతర సైబర్‌ నేరాలకు పాల్పడే నేరగాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పేర్లతో లేదా సంబంధీకుల పేర్లతో తీసుకున్న ఫోన్‌ నంబర్లు వినియోగించరు. అలా చేస్తే పోలీసుల దర్యాప్తులో చిక్కుతామనే ఉద్దేశంతో వాటికి దూరంగా ఉంటారు.  
  • తమ స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్‌ను యాక్టివేట్‌ చేసుకుని, వైఫై వినియోగిస్తే మాత్రం వీళ్ల పని తేలికవుతుంది. ఈ యాప్‌ను యాక్టివేట్‌ చేసుకోవడానికి వాళ్లుకు ఓ ఫోన్‌ నంబర్‌ కావాలి. దీనికోసం సైబర్‌ నేరగాళ్లు కొన్ని సీరీస్‌ల్లో నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. వాటి యజమానులు అప్పటికే వాట్సాప్‌ వాడుతుంటే మళ్లీ వీళ్లు యాక్టివేట్‌ చేసుకోవడం సాధ్యం కాదు. ఆయా నంబర్లతో వాట్సాప్‌ యాక్టివేషన్‌లో ఉందా.. లేదా? అనేది తెలుసుకోవడానికి  సైబర్‌ నేరగాళ్లు కొన్ని యాప్స్‌ వాడుతున్నారు. ఐకాన్‌ సçహా ఇతర వాటిలో ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి సెర్చ్‌ చేస్తే వాట్సాప్‌ యాక్టివేట్‌ అయి ఉందా అనేది తెలుసుకోవడం సాధ్యం.  

మాయ మాటలతో ఓటీపీ తీసుకుంటూ... 

  • సాధారణంగా తమ సిమ్‌కార్డును బేసిక్‌ ఫోన్లలో వాడుతున్న వినియోగదారులు వాట్సాప్‌ను యా క్టివేట్‌ చేసుకోరు. అలాంటి వారినే సైబర్‌ నేరగాళ్లు టార్గెట్‌ చేసుకుంటున్నారు. తమ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ను ఇన్‌స్టల్‌ చేసిన తర్వాత వెరిఫికేషన్‌ కోడ్‌ కోసం ఆ ఫోన్‌ నంబర్‌ ఇస్తున్నారు. ఇలా ఆ వినియోగదారుడికి ఈ కోడ్‌ చేరుతుంది. వారిని సంప్రదిస్తున్న సైబర్‌ నేరగాళ్లు ఓ లావాదేవీలో పొరపాటున మీ ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేశామని, దీంతో ఓటీపీ మీకు వచ్చిందని చెప్పి దాన్ని తీసుకుంటున్నారు.  
  • కొన్ని సందర్భాల్లో బ్యాంకులతో పాటు ఇతర కాల్‌ సెంటర్ల పేర్లు వాడుతున్నారు. ఇలా ఓటీపీ ని చేజిక్కించుకుని తమ ఫోన్లలో ఎదుటి వారి నెంబర్‌తో వాట్సాప్‌ యాక్టివేట్‌ చేసుకుంటున్నా రు. ఆ వెంటనే వాట్సాప్‌ సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను మార్చేస్తూ టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ పెట్టుకుంటున్నా రు. దీని వల్ల ఎప్పుడైనా సదరు సిమ్‌కార్డు విని యోగదారులు తన ఫోన్‌లో వాట్సాప్‌ యాక్టివేట్‌ చేసుకోవాలని భావించినా... అది సాధ్యం కాదు.  

వైఫైలో వాడుతూ వ్యవహారాలు... 
ఇలా వేరే వారి ఫోన్‌  నంబర్‌తో తమ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ను యాక్టివేట్‌ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు దీన్ని వైఫైలో వాడుతున్నారు. ఫలితంగా ఆ ఫోన్‌ నంబర్‌తో పని లేకుండా వాళ్ల పనులు జరిగిపోతున్నాయి. ఇలాంటి వాట్సాప్‌లను వాడుతూ సైబర్‌ నేరగాళ్లు వేధింపులు, బెదిరింపులతో పాటు ఇతర సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు.  

  • కొన్ని సందర్భాల్లో అమాయకులు పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ తరహా కేసుల్లో ఫిర్యాదులు వచ్చినా.. బాధ్యుల్ని పట్టుకోవడం అత్యంత కష్టసాధ్యమని అధికారులు చెప్తున్నారు. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే వాట్సాప్‌ సంస్థకు లేఖలు రాసి, డీయాక్టివేషన్‌ చేయించే ఆస్కారం ఉంటోందని స్పష్టం చేస్తున్నారు. 
  • వాట్సాప్‌ యాక్టివేట్‌ చేసుకోని నంబర్లతో పాటు కొన్నిసార్లు అప్పటికే వాట్సాప్‌ వాడుతున్న వాళ్లకీ సైబర్‌ నేరగాళ్ల ఇలా బురిడీ కొట్టిస్తున్నారని చెప్తున్నారు. ఎవరైనా కాల్‌ చేసి ఓటీపీలు వంటివి అడిగితే పలుమార్లు సరిచూసుకున్నాకే చెప్పాలని, లేదంటే ఇలాంటి సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని స్పష్టం 
  • చేస్తున్నారు.   
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top