పెళ్లైన ఆరు నెలలకే నవ దంపతులు ఆత్మహత్య

నల్గొండ: ఉరేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పడమటితండాలో మంగళవారం రాత్రి వెలుగుచూసింది. గుడిపల్లి ఎస్‌ఐ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పడమటితండాకు చెందిన రమావత్ లక్ష్మణ్(24) ఆరునెలల క్రితం నేరెడుగొమ్ము మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ మేగావత్‌తండాకు చెందిన నిఖిత(20)తో వివాహం జరిగింది.
అప్పటినుంచి స్వగ్రామంలోనే కిరాణ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం తమ కిరాణ దుకాణంలోనే లక్ష్మణ్, నిఖిత దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కిరాణ దుకాణానికి వచ్చిన తండావాసి చూసి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో విషయం వెలుగు చూసింది. వివాహం జరిగిన ఆరు నెలలకే దంపతులు ఆత్మహత్య చేసుకోవడం తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరి ఆత్మహత్యకు కుటుంబ కలహాలా? లేదా ఆర్థిక ఇబ్బందులా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు ఎస్‌ఐ వీరబాబు తెలిపారు.