Coronavirus: వ్యాక్సిన్‌.. కోవిడ్‌పై విన్‌

Coronavirus:Doctor L Sanjay Says Vaccination Is Important For Covid Patients - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ 19 గురించి రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. అయితే వాటిని విస్మరించాలి. వ్యాక్సినేషన్‌ వల్ల స్పష్టంగా కనిపిస్తున్న ప్రయోజనాలనే దృస్టిలో ఉంచుకుని తమతో పాటు తమ చుట్టుపక్కల ఉన్నవారికీ రక్షణ అందించేందుకు వ్యాక్సిన్‌ వేయించుకోవడం తప్పనిసరి అంటున్నారు అపోలో స్పెక్ట్రాకు చెందిన ఇంటర్నల్‌ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌  వైద్యులు డా. సంజయ్‌. వ్యాక్సినేషన్‌పై అన్ని రకాల అపోహలూ తొలగించుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వ్యాక్సిన్‌ డోసులు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. వ్యాక్సిన్‌ ద్వారా కోవిడ్‌ 19 సోకదు. ఎందుకంటే వ్యాక్సిన్‌లో జీవించి ఉన్న కోవిడ్‌ వైరస్‌ ఉండదు. కేవలం జ్వరం, అలసట, చేతుల వాపు వంటివి రావచ్చునని స్పష్టం చేస్తున్నారు.

ఆయన ఏమంటున్నారంటే.. అప్పుడే పుట్టిన బిడ్డల్లో, చిన్నారులు కోవిడ్‌ పాజిటివ్స్‌ అవుతున్నారు. లక్షణాలు  స్వల్పంగా ఉంటే త్వరగానే కోలుకుంటున్నారు. చిన్నారుల్లో  జ్వరం, దగ్గు, న్యూమోనియా, గొంతు నొప్పి, విరేచనాలు, నీరసం వంటి లక్షణాలు పాజిటివ్‌ లక్షణాలు కనపడుతున్నాయి. ఏదేమైనా.. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారి మీద మాత్రమే కాదు యువత, చిన్నారులు, పసిపిల్లలు టీనేజర్లతో సహా... ఆరోగ్యంగా ఉన్నవారిపైనా  కోవిడ్‌ దాడి చేస్తోంది. కాబట్టి ఎవరూ నాకు రాదు అనుకోకుండా 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. వ్యాక్సిన్‌ తో ఒనగూరే ప్రయోజనాలెన్నో..

తగ్గే ఇన్ఫెక్షన్‌ రిస్క్‌..
తొలి డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత శరీరం కరోనా వైరస్‌తో పోరాడే యాంటీ బాడీస్‌ని తయారు చేయడం మొదలుపెడుతుంది. అత్యధిక శాతం జనాభా వ్యాక్సినేషన్‌ పూర్తయితే హర్డ్‌ ఇమ్యూనిటీ వస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్‌ ప్రమాదం తగ్గుతుంది. తద్వారా సామాజిక భధ్రతతో పాటు సామాజిక వ్యాప్తికి కూడా అడ్డుకట్టపడుతుంది. 

తీవ్రత నుంచి రక్షణ..
పలు అధ్యయనాలు చెబుతున్న ప్రకారం... కోవిడ్‌ 19 వ్యాక్సిన్స్‌ వ్యాధి తీవ్రతను నివారించడంలో సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాబట్టి, వ్యాక్సినేషన్‌ తర్వాత కూడా ఇన్ఫెక్షన్‌ వచ్చినప్పటికీ... అలా కోవిడ్‌ సోకిన వారిలో వ్యాధి తీవ్రంగా మారదు. ఇన్ఫెక్షన్‌ సోకిన ఇతరులతో పోలిస్తే వారిలో చాలా స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. పూర్తి స్థాయి వ్యాక్సినేషన్‌ తర్వాత దాదాపుగా అందరికీ ఆసుపత్రి పాలయ్యే, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం తప్పుతుందనే చెప్పొచ్చు. 

గర్భస్థ శిశువు, అప్పుడే పుట్టిన బిడ్డకు రక్షణ..
ఒక నూతన అధ్యయనం ప్రకారం... వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్న గర్భవతులు తమ ప్లసెంటా ద్వారా గర్భంలోని శిశువుకు సైతం యాంటీ  బాడీస్‌ని సరఫరా చేస్తారు. తల్లి పాల ద్వారా కూడా ఇది జరగవచ్చు. ఫలితంగా అప్పుడే పుట్టిన బిడ్డకు సైతం పుట్టిన క్షణం నుంచే వైరస్‌తో పోరాడే ఇమ్యూనిటీ ఉంటుంది. పొత్తిళ్లలోని బిడ్డకు వ్యాక్సిన్‌ వేయడం సాధ్యం కాదు కాబట్టి... అలాంటి పిల్లలకు వైరస్‌ దాడి చేయకుండా ఆపడంలో ఇది కీలకాంశం. 

మనతో పాటు ఇతరులకూ..
వ్యాక్సినేషన్‌ పూర్తి అయిన వారు తర్వాత వైరస్‌ బారిన పడినప్పటికీ వారి నుంచి ఇతరులకు సోకే అవకాశాలు బాగా తగ్గిపోతాయి.  వ్యాక్సినేషన్‌∙ప్రధాన కారణాల్లో చిన్నారులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, ముఖ్యంగా గర్భిణులను కాపాడడం కూడా ఒకటి. అంటే అర్ధం ప్రజలు తమను తాము మాత్రమే కాకుండా ఇతరులను కూడా కాపాడతారన్నమాట.

దూరాలకు కత్తెర..
వ్యాక్సినేషన్‌ పూర్తయితే.. స్వేఛ్చగా తిరిగే అవకాశం పెరుగుతుంది. తమ లాగే వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్న బంధు మిత్రుల ఇళ్లకు రాకపోకలు కొనసాగించవచ్చు. ఇమ్యూనిటీ సంతరించుకునేందుకు అవసరమైస వ్యవధి ఇచ్చిన తర్వాత వ్యక్తిగత సంబంధాలు, సమావేశాలు కోవిడ్‌కు పూర్వస్థితికి చేర్చవచ్చు. ఒక ప్రాంతంలో ఊరిలో 100శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయితే ఇక ఎవరు ఎవరినైనా కలవచ్చు. పాజిటివ్‌గా తేలినప్పటికీ లక్షణాలేవీ కనపడని వారిని కూడా కలవవచ్చు. 

మాస్కుల నుంచి విముక్తి..
గత కొన్ని నెలలుగా మాస్కులు ధరించడం, చేతులు శుభ్రపరచుకోవడం వంటివి తప్పనిసరి అయిపోయాయి. అయితే ఈ జాగ్రత్తలన్నీ అత్యధిక శాతం జనాభాకి వ్యాక్సినేషన్‌ పూర్తయేవరకూ తప్పదు. ఒకసారి హర్డ్‌ ఇమ్యూనిటీ అనేది అభివృద్ధి చెందితే మాస్కుల ధారణ అవసరం కూడా తగ్గిపోతుంది. 
–డా.ఎల్‌.సంజయ్‌
ఇంటర్నల్‌ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌
అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top