‘టైమ్‌బౌండ్‌’ ఒత్తిడే! | Construction companies told Justice Pinaki Chandraghosh Commission on BRS Govt | Sakshi
Sakshi News home page

‘టైమ్‌బౌండ్‌’ ఒత్తిడే!

Published Thu, Jun 13 2024 4:09 AM | Last Updated on Thu, Jun 13 2024 4:09 AM

Construction companies told Justice Pinaki Chandraghosh Commission on BRS Govt

కాళేశ్వరం బరాజ్‌లను వేగంగా పూర్తి చేయాలని గత ప్రభుత్వం ఒత్తిడి చేసింది

జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌కు తెలిపిన నిర్మాణ సంస్థలు

బుధవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో విచారణ జరిపిన కమిషన్‌ 

నిర్మాణ సంస్థల ప్రతినిధులు, హైడ్రాలజీ, డిజైన్స్‌ విభాగాల ఇంజనీర్లు హాజరు 

డిజైన్ల తయారీ, మార్పులు, నీటి లభ్యత తదితర అంశాలపై ప్రశ్నించిన కమిషన్‌ 

సమాధానాలన్నీ అఫిడవిట్‌ రూపంలో అందజేయాలని అందరికీ ఆదేశం 

నేడు నిపుణుల కమిటీ సభ్యులను ప్రశ్నించేందుకు ఏర్పాట్లు 

విజిలెన్స్, కాగ్‌ అధికారులను కూడా ప్రశి్నస్తాం: జస్టిస్‌ చంద్రఘోష్‌

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ ల నిర్మాణ పనులను నిర్ణీత గడువు (టైమ్‌ బౌండ్‌)లోగా పూర్తి చేయాలని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒత్తిడి చేసిందని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ నేతృత్వంలోని విచారణ కమిషన్‌కు బరాజ్‌ల నిర్మాణ సంస్థలు తెలిపాయి. పనులు సత్వరంగా పూర్తి చేయాలంటూ పరుగులు పెట్టించిందని పేర్కొన్నా యి. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసి బరాజ్‌లను అప్పగించామని వివరించాయి. ఈ అంశాలను నెలాఖరు లోగా అఫిడవిట్‌ రూపంలో సమర్పించాలని నిర్మాణ సంస్థలను జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ ఆదేశించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై న్యాయవిచారణలో భాగంగా బుధవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లోని కార్యాలయంలో నిర్మాణ సంస్థల ఉన్నతాధికారులను ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డ బరాజ్‌ నిర్మాణ సంస్థ ‘ఎల్‌అండ్‌టీ’ తరఫున ఉపాధ్యక్షులు ఎంవీ కృష్ణరాజు, సురేశ్‌కుమార్, సీనియర్‌ డీజీఎం రంజీష్‌ చౌహాన్, అన్నారం బరాజ్‌ నిర్మాణ సంస్థ ‘అఫ్కాన్స్‌–విజేత జేవీ’ తరఫున హైడ్రో ప్రాజెక్టుల విభాగాధిపతి కె.మల్లికార్జునరావు, జీఎం శేఖర్‌దాస్, సుందిళ్ల బరాజ్‌ నిర్మాణ సంస్థ ‘నవయుగ’ తరఫున డైరెక్టర్‌ రామేశ్‌    యెద్దూరి, ప్రాజెక్టు మేనేజర్‌ కె.ఈశ్వర్‌రావు, జీఎం సి.మాధవ్‌ తదితరులు కమిషన్‌ ఎదుట హాజరై సమాధానాలు ఇచ్చారు. 

డిజైన్లు, హైడ్రాలజీ విభాగం ఇంజనీర్లు కూడా.. 
బరాజ్‌ల డిజైన్లను రూపొందించిన నీటిపారుదల శాఖలోని సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఓ)లో పనిచేస్తున్న చీఫ్‌ ఇంజనీర్లు టి.శ్రీనివాస్, వి.మోహన్‌కుమార్‌ సహా మొత్తం 13 మంది ఇంజనీర్లను కూడా జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ బుధవారం తన కార్యాలయం విచారించారు. డిజైన్ల తయారీలో ఒక్కొక్కరి పాత్రను అడిగి తెలుసుకున్నారు. 

డిజైన్ల ప్రకారమే పనులు జరిగాయా? తర్వాత డిజైన్లను ఏమైనా మార్చారా? ఎవరి ఆదేశాలతో మార్పులు చేశారు? షీట్‌పైల్స్‌కు బదులు సెకెంట్‌ పైల్స్‌ను ఎందుకు డిజైన్లలో సిఫారసు చేశారు? వంటి అంశాలపై ప్రశ్నలు గుప్పించినట్టు సమాచారం. ఇక బరాజ్‌ల వద్ద నీటి లభ్యతను నిర్ధారించిన హైడ్రాలజీ విభాగంలో పనిచేస్తున్న చీఫ్‌ ఇంజనీర్‌ శంకర్‌నాయక్, మరో ఐదుగురు ఇంజనీర్లను సైతం జస్టిస్‌ చంద్రఘోష్‌ ప్రశ్నించారు.

ఆదేశించిన వారినీ పిలిచి విచారిస్తాం: జస్టిస్‌ చంద్రఘోష్‌ 
బ్యారేజీల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణలో లోపం ఎక్కడ జరిగింది? ఎవరు చేశారో తేలుస్తామని జస్టిస్‌ చంద్రఘోష్‌ వెల్లడించారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరి ఆదేశాలతో బరాజ్‌ల నిర్మాణ పనులు జరిగాయో రికార్డు రూపంలో సమాచారం అందిన తర్వాత వారిని సైతం విచారణకు పిలుస్తామన్నారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించాక అవసరమైన వారిని మళ్లీ పిలిపించి విచారిస్తామని తెలిపారు. 

క్షేత్రస్థాయిలోని వాస్తవాలను తెలుసుకోవడానికే అఫిడవిట్లను దాఖలు చేయాలని కోరినట్టు చెప్పారు. బరాజ్‌ల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణపై సమగ్ర వివరాలు అఫిడవిట్లలో ఉండాలని నిర్మాణ సంస్థలను కోరినట్టు తెలిపారు. ఎలాంటి సమాచారమైనా అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేస్తేనే కమిషన్‌ స్వీకరిస్తుందన్నారు. తప్పుడు సమాచారంతో అఫిడవిట్లు దాఖలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్, కాగ్‌ నివేదికలు అందాయని.. వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు. న్యాయ విచారణలో భాగంగా విజిలెన్స్, కాగ్‌ అధికారులను సైతం ప్రశ్నిస్తామన్నారు.  

నేడు నిపుణుల కమిటీ సభ్యుల విచారణ
జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ గురువారం నీటిపారుదల శాఖలోని హైడ్రాలజీ విభాగం ఇంజనీర్లతోపాటు కమిషన్‌కు సహకరించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ సభ్యులను విచారించనుంది. నిపుణుల కమిటీలో ఎన్‌ఐటీ వరంగల్‌ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ సీబీ కామేశ్వర్‌రావు, రిటైర్డ్‌ సీఈ కె.సత్యనారాయణ, ఎన్‌ఐటీ వరంగల్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.రమణమూర్తి, ఉస్మానియా వర్సిటీ సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం హెచ్‌ఓడీ పి.రాజశేఖర్, రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ ఉన్నారు. నిపుణుల కమిటీ ఇప్పటికే బరాజ్‌లకు చేసిన తనిఖీ నివేదికను కమిషన్‌కు సమర్పించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement