ఇప్పుడేం చేద్దాం? ఢిల్లీ వెళ్లాలా? లేఖ రాయాలా

Congress Leaders Met Residence Of CLP Leader Bhatti Vikramarka - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై చర్చించేందుకు పలువురు ముఖ్యనేతలు శనివారం భేటీకానున్నారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో జరగనున్న ఈ సమావేశానికి సీనియర్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కోదండరెడ్డి తదితరులు హాజరుకానున్నట్టు తెలిసింది. ఇటీవల ప్రకటించిన టీపీసీసీ కమిటీలు, పీసీసీ ప్రతినిధుల ఎంపిక జరిగిన తీరు, పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై వారు భేటీలో చర్చించనున్నట్టు సమాచారం. 

కొత్త కమిటీలు.. విమర్శల మధ్య.. 
టీపీసీసీ కొత్త కమిటీలను ప్రకటించిన అనంతరం భట్టి నివాసం వేదికగా కొందరు సీనియర్‌ నేతలు భేటీ అయి చర్చించారు. అయితే తమది అసమ్మతి భేటీ కాదని, ఆత్మీయ సమావేశమని ప్రకటించారు. తాజాగా వారికి మాజీ ఎంపీ ఉత్తమ్‌ కూడా జత కలుస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. శనివారం జరిగే సమావేశంలో నేతలు ఏయే అంశాలపై చర్చిస్తారు, సమావేశం అనంతరం ఏం చెప్తారనేది కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్నవేళ పార్టీలో నెలకొన్న పంచాయితీలను పరిష్కరించుకునే దిశగా కూడా చర్చలు జరిగే అవకాశముందని టీపీసీసీ కీలక నేత ఒకరు వెల్లడించారు.

పార్టీలోని పరిణామాలను అధిష్టానానికి నివేదించేందుకు ఢిల్లీ వెళ్లాలా, లేక లేఖ రాయాలా అన్నదానిపైనా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ‘‘అంతా ఇదేదో సీనియర్ల సమస్య అను కుంటున్నారు.  కొత్త కాంగ్రెస్‌ వర్సెస్‌ పాతకాపులు అని అంటున్నారు. కానీ, ఇది సీనియర్‌ నాయకుల సమస్య కాదు. ఎందుకంటే మాకు అధిష్టానం దగ్గరి నుంచి అందరు నేతలు తెలుసు. మా వ్యక్తిగత సమస్యలు మేం పరిష్కరించుకోగలం.

కానీ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం పాటుపడుతున్న కేడర్‌ గురించి మేం ఆలోచించాలి. గత ఎనిమిదేళ్లుగా అనేక కష్టాలకోర్చి టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొంటున్న పార్టీ నేతల గురించి ఆలోచించాలి. ఆ బాధ్యత మాపై ఉంటుంది. అసలు పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలియాలి. ఢిల్లీలో తప్పులు జరుగుతున్నాయా? ఇన్‌చార్జి కార్యదర్శుల వద్ద జరుగుతున్నాయా స్పష్టం కావాలి’’అని ఆ కీలక నేత పేర్కొనడం గమనార్హం. 

భేటీ అయిన ముగ్గురు నేతలు 
భట్టి విక్రమార్క, మాజీమంత్రులు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు శుక్రవారం భట్టి నివాసంలో సమావేశమయ్యారు. రానున్న అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించినట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. దేశ, రాష్ట్ర రాజకీయాలతోపాటు తెలంగాణ కాంగ్రెస్‌ పరిణామాలు, పీసీసీ నూతన కమిటీల కూర్పుపైనా వారు మాట్లాడుకున్నట్టు వివరిస్తున్నాయి.  

(చదవండి: ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ అమలు చేయండి )

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top