కుళ్లిన అల్లం, వెల్లుల్లితో.. ప్రజల ప్రాణాలతో చెలగాటం

Company Supply Rotten Ginger Garlic Paste To Customers Adilabad - Sakshi

అనుమతులు లేకుండానే ఫ్యాక్టరీ నిర్వహణ

ఏడేళ్లుగా కొనసాగుతున్నా బయట పడని వైనం

సీజ్‌ చేసిన రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రజల అవసరాలను సొమ్ము చేసుకోవడంతో పాటు వారి ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు కొంతమంది వ్యాపారులు. గతంలో జిల్లా కేంద్రంలో కల్తీ, గడువు దాటిన నూనె, కల్తీ చాయ్‌ పత్తి తయారు చేస్తూ పట్టుబడ్డ విషయం విదితమే. తాజాగా జిల్లా కేంద్రంలోని ఖానాపూర్‌లో కుళ్లిన అల్లం, వెల్లుళ్లితో పేస్ట్, ఇతర మసాలాలు తయారు చేస్తున్న వ్యాపారి గుట్టురట్టయ్యింది. శుక్రవారం పోలీసులు పెట్రోలింగ్‌ సమయంలో ఫ్యాక్టరీలోకి వెళ్లి పరిశీలించగా కుళ్లిన ఎల్లిగడ్డలు, అల్లం పేస్ట్‌ డబ్బాల్లో ప్యాకింగ్‌ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో మున్సిపల్‌ అధికారులకు సమాచారం అందించడంతో ఈ తతంగం బయటపడింది. 

ఏడేళ్లుగా వ్యాపారం..
పట్టణంలోని ఆర్‌ఆర్‌ ఫుడ్‌ ప్రొడక్ట్‌ పేరిట ఖానాపూర్‌లోని క్రిస్టల్‌ గార్డెన్‌ వెనకాల ఈ ఫ్యాక్టరీని కొనసాగిస్తున్నారు. పట్టణంలోని బొక్కల్‌గూడకు చెందిన సిరాజ్‌ అహ్మద్‌ పేరిట ఈ ఫ్యాక్టరీ కొనసాగుతోంది. నిర్వాహకుడు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనుమతి ఉందని చెబుతున్నాడు. అయితే మున్సి పాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఏడేళ్లుగా అక్రమంగా నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఎంఎస్‌ఎంఈ (చిన్న తరహా పరిశ్రమల) అనుమతి కూడా లేదు. సివిల్‌సప్‌లై లైసెన్స్‌ తీసుకోవాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం కొనసాగిస్తున్నారు.ఽ

పర్యవేక్షణ కరువు..
అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అక్రమార్కుల ఆగడాలు కొనసాగుతున్నాయి. వారి అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యాపారులు ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీలు మరవడంతో ఇలాంటి ఫ్యాక్టరీల్లో హానికరమైన పదార్థాలను తయారు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అనుమతులు లేకుండా వెలుస్తున్న ఫ్యాక్టరీపై అధికారులు నిఘా ఉంచి చర్యలు చేపట్టకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి.

ఫ్యాక్టరీ సీజ్‌..
ఎలాంటి అనుమతులు లేకుండా కల్తీ, కుళ్లిన పదార్థాలు తయారు చేసి సరఫరా చేస్తున్న ఫ్యాక్టరీకి శుక్రవారం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్, ఆదిలాబాద్‌అర్బన్‌ తహసీల్దార్‌ భోజన్న సీల్‌ వేశారు. ఆహార పదార్థాల నాణ్యతపై శాంపిల్స్‌ సేకరించారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీ చేపట్టేందుకు సమాచారం అందించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, వన్‌టౌన్‌ సీఐ రామకృష్ణ, ఎస్సై అజరొద్దీన్, ఆదిలాబాద్‌ ఆర్‌ఐ మహేష్, మున్సిపల్, రెవెన్యూ శాఖాధికారులు సందర్శించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top