ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు: సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక
క్షేత్రస్థాయిలో ధాన్యం, మక్కల కొనుగోళ్ల తీరును పరిశీలించాలి
ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి
లారీలు అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టండి
మిషన్ మోడ్‌లో పనిచేసి సేకరణ పూర్తి చేయాలన్న సీఎం
ధాన్యం సేకరణ ప్రక్రియ, పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను మిషన్ మోడ్‌లో పనిచేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పరిశీలించాలని సూచించారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాలని చెప్పారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లు బాధ్యత తీసుకుని పరిష్కరించాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై చర్యలకూ ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ, పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై రేవంత్ ఆరా తీశారు.
ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలి
‘గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలి. రవాణా శాఖ కమిషనర్ ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలి. ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులకూ వెనకాడొద్దు. అవసరమైతే స్థానికంగా ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించాలి. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకూడదు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సీఎస్‌కు నివేదికలు పంపాలి.
రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను వాడుకోండి
సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు మిల్లుల్లో స్థలం సరిపోవడం లేదని అంటున్నారు. చాలా ప్రాంతాల్లో గోదాముల సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలి. రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను తీసుకుని ధాన్యాన్ని అక్కడికి తరలించాలి. తర్వాత పరిస్థితిని బట్టి గోడౌన్లకు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి..’అని సీఎం ఆదేశించారు.
అకాల వర్షాల నష్టాన్ని తగ్గించేందుకు ప్రత్యేక వ్యవస్థ
‘అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేయాలి. కల్లాల వద్ద ధాన్యం తడవకుండా ఉండేందుకు అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలి. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలి. వాతావరణ సూచనలను రైతులకు చేరవేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
ప్రతి మిల్లు వద్ద ఒక అధికారి ఉండాల
ప్రతి ఐకేపీ సెంటర్‌కు ఒక అధికారిని నియమించి కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలి. ప్రతి రైస్ మిల్లు దగ్గర ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షించాలి. ధాన్యం లోడింగ్‌లో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమాలీలను గుర్తించి వారితో పని చేయించుకోవాలి. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు ఇవ్వాలి. అలా చేస్తే తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చు..’అని ముఖ్యమంత్రి అన్నారు.
సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి: మంత్రి ఉత్తమ్
ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో జిల్లాల్లో ఎక్కడ సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ధాన్యం సేకరణ విషయంలో ఎలాంటి సహకారం అందించేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
పొరుగు రాష్ట్రాల ధాన్యంతో సమస్యలు: మంత్రి తుమ్మల
సరిహద్దు రాష్ట్రాల రైతులు కొంతమంది ధాన్యాన్ని తెలంగాణలో కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారని, దీంతో కొన్నిచోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. అలా ధాన్యం రాకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరులోగా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


