ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌ బహిరంగ లేఖ | Cm Revanth Reddy Writes Open Letter To Pm Modi On Delimitation | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌ బహిరంగ లేఖ

Apr 14 2026 6:41 PM | Updated on Apr 14 2026 8:50 PM

Cm Revanth Reddy Writes Open Letter To Pm Modi On Delimitation

సాక్షి, హైదరాబాద్‌: డీలిమిటేషన్‌పై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లోక్‌సభ సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లేఖలో మూడు అంశాలను రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌ను సీట్ల పెంపుతో కలపడం సరికాదన్న రేవంత్‌.. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాదికి నష్టం అన్నారు.

ఆర్థిక, అభివృద్ధి ప్రమాణాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్‌ సూచించారు. హైబ్రిడ్ మోడల్‌ను అనుసరించాలన్నారు. అన్ని పార్టీలతో చర్చలు జరపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దేశ ఐక్యతకు న్యాయమైన ప్రతినిధిత్వం కీలకమన్న రేవంత్‌.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ప్రస్తుత 543 సీట్లతోనే మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, సీట్ల పెంపు మూడు వేర్వేరు అంశాలు. డిలిమిటేషన్‌ను సీట్ల పెంపుతో కలపడం సరైంది కాదని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.

జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని.. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు నష్టపోతాయని రేవంత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర రాష్ట్రాలకు అధిక రాజకీయ శక్తి వెళ్తుంది. దక్షిణ రాష్ట్రాల వాణి పార్లమెంట్‌లో తగ్గే ప్రమాదం ఉంది. ఆర్థికంగా ఎక్కువగా దేశానికి తోడ్పడుతున్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. హైబ్రిడ్ మోడల్ ద్వారా సమతౌల్యం సాధించవచ్చు. సీట్లలో సగం జనాభా ఆధారంగా, మిగతా సగం ఆర్థిక ప్రమాణాల ఆధారంగా ఇవ్వాలి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో చర్చలు జరపాలి. న్యాయం, సమాన ప్రతినిధిత్వం లేకపోతే దేశ ఐక్యత దెబ్బతింటుంది’’  అని సీఎం రేవంత్‌ లేఖలో పేర్కొన్నారు.

తమిళనాడు సీఎంకు లేఖ: 
తమిళనాడు సీఎంకు కూడా రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. లోక్‌సభ సీట్లను ప్రోరాటా పద్ధతిలో పెంచే ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేస్తుందని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా నిలబడాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌కు  లేఖ రాశారు సీఎం. మహిళల రిజర్వేషన్, డిలిమిటేషన్, లోక్‌సభ సీట్ల పెంపు అనే మూడు వేర్వేరు అంశాలను కలిపి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.

లోక్‌సభ సీట్లను 543 నుంచి 850కు పెంచి ప్రోరాటా పద్ధతిలో పంచితే దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని అప్రమత్తం చేశారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునే  రాష్ట్రాలు నష్టపోతూ, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లాభపడే పరిస్థితి వస్తుందని అన్నారు. అందుకే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేలా హైబ్రిడ్ మోడల్‌ను పరిశీలించాలని, ఈ అంశంపై రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement