పెట్టుబడికి 'ఫ్యూచర్‌' | CM Revanth Reddy says Future City competes with world-class cities | Sakshi
Sakshi News home page

పెట్టుబడికి 'ఫ్యూచర్‌'

Apr 29 2026 5:42 AM | Updated on Apr 29 2026 5:42 AM

CM Revanth Reddy says Future City competes with world-class cities

ఫ్యూచర్‌ సిటీ ప్రపంచస్థాయి నగరాలతో పోటీపడుతుంది: సీఎం

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారత్‌ ఫ్యూచర్‌సిటీ అంతర్జాతీయ పె­ట్టు­బడులకు స్వర్గధామంగా నిలవబోతోంది. ప్ర­పంచ­వ్యాప్తంగా ఎన్నియుద్ధాలు వచ్చినా.. ఇక్కడ ఎలాంటి నష్టం ఉండదు. అన్ని రకాలుగా రక్షణతో కూడిన ప్రదేశం ఇదే. పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గ­జ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. న్యూ­యార్క్, టోక్యో వంటి ప్రపంచస్థాయి నగరాలతో పోటీపడుతుంది’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్‌సిటీ పోలీసు కమిషనరేట్‌ భవనానికి మంగళవారం ఆయన భూ­మిపూజ, శంకుస్థాపన చేశారు. మల్కాజ్‌గిరి కమిషనరేట్‌ భవనం సహా ఆక్టోపస్‌ అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్, కుత్బుల్లాపూర్‌ డీసీపీ కార్యాలయ భవనాలకు సంబంధించిన శిలాఫలకాలనూ ఆవిష్కరించారు. గిరిదర్శక్‌ పథకంలో భాగంగా 20 మంది మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులకు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..  

తీర్మానం చేసి పంపండి.. 
మూసీనది పునర్నిర్మాణం, రీజినల్‌ రింగ్‌ రోడ్డు, ఫ్యూచర్‌సిటీ అభివృద్ధిలో ఏమాత్రం వెనక్కితగ్గం. శంషాబాద్‌ కేంద్రంగా అమరావతి మీదుగా చెన్నై వరకు, అటు బెంగళూరు, ఇటు పుణే నుంచి ముంబై ఇలా మూడు బుల్లెట్‌ రైళ్లు రాబోతున్నాయి. ఇక్కడే అతిపెద్ద బస్‌ టెర్మినల్‌ రాబోతోంది. అభివృద్ధిలో మనం స్ఫూర్తిగా తీసుకుంటున్న నగరాలతో పోటీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. 160 కి.మీ. ఔటర్‌ రింగ్‌రోడ్డు దేశంలో ఏ నగరానికీ లేదు. అదేస్థాయిలో రీజినల్‌ రింగ్‌రోడ్డును అందుబాటులోకి తేనున్నాం. కొంతమంది ప్రజాప్రతినిధులు తమ గ్రామాలను కూడా ఫ్యూచర్‌సిటీలో కలపాలని కోరుతున్నారు. తీర్మానం పంపితే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి చెందుతుంది. ఫ్యూచర్‌ సిటీ కార్యాలయంలో కూర్చొని ఒప్పందాలు చేసుకోవాలి. జూన్‌ 2లోపే ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది.   

మీరు ఏడ్చుకుంటూ ఉండండి... 
శంషాబాద్, ఔటర్‌ రింగ్‌రోడ్డు, హైటెక్‌ సిటీలను నాడు అవహేళన చేశారు. ఊహాచిత్రంగా భావించి, అనుమానించారు. అదేవిధంగా నేడు కొంత మంది ఫ్యూచర్‌ లేని సీఎం ఫ్యూచర్‌ సిటీ కడతాడట అని విమర్శిస్తున్నారు. మీరు ఏడ్చుకుంటూ ఉండండి. నేను చేయాల్సింది చేసుకుంటూ పోతుంటా. మీ ఏడుపు నాకు శంకరాభరణంలోని సంగీతం విన్నట్లు ఉంటుంది. వారిది అసురజాతి. వాళ్లు పోయినా నష్టం లేదు. మీరు ఎన్ని కుట్రలు చేసినా.. రైతులను ఎంత రెచ్చగొట్టినా అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గం. లీగల్‌ చిక్కులకు అవకాశం లేకుండా పక్కాగా నోటిఫికేషన్లు ఇచ్చి, రైతులను ఒప్పించి, మెప్పిస్తాం. వారికి నచ్చిన విధంగా ఆర్థిక సహాయం అందించిన తర్వాతే ముందుకెళ్తాం. అభివృద్ధి పనుల కోసం ఈ రోజు కాకపోయినా రేపైనా భూసేకరణ తప్పదు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని తీసుకుని వేరేచోట పెట్టుబడి పెట్టుకోండి. మీ పిల్లల భవిష్యత్తుకు, ఉద్యోగ అవకాశాలకు సహకరించండి.  
 
జనజీవన స్రవంతిలో కలవండి.. 
అన్నలూ అడవిని వీడి జనజీవన స్రవంతిలో కలవండి. మీ ప్రాణాలకు పూర్తి రక్షణ, ఆరోగ్య బాధ్యత మాది. ఆశయ సాధన పేరుతో అడవుల్లో ఉండి అసువులు బాసే కన్నా జనారణ్యంలో భాగస్వాములు కావడం ఉత్తమం. ఇటీవల లొంగిపోయిన గణపతి ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలిసింది. ఆయన ప్రాణాలకు పూర్తి రక్షణ కల్పించడంతోపాటు మంచి వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గిరిజన, ఆదివాసీ బిడ్డలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే ఆలోచనతోనే గిరిదర్శన్‌ పథకాన్ని తీసుకొచ్చాం’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, అరికెపూడి గాం«దీ, డీజీపీ బి.శివధర్‌రెడ్డి, ఫ్యూచర్‌సిటీ సీపీ సుదీర్‌బాబు, మల్కాజ్‌గిరి సీపీ సుమతి తదితరులు పాల్గొన్నారు.  

అన్ని హంగులతో ఫ్యూచర్‌సిటీ: మంత్రి శ్రీధర్‌బాబు  
2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీయే తెలంగాణ లక్ష్యం. అన్ని హంగులతో భారత్‌ ఫ్యూచర్‌సిటీని తీర్చదిద్దబోతున్నాం. పరిశ్రమలు, వాణిజ్యం ముందంజలో ఉండటానికి పోలీసుల కృషి అభినందనీయం. డ్రగ్స్‌రహిత సమాజం కోసం పోలీసు శాఖ ఎంతగానో కృషిచేస్తోంది. సాంకేతిక వినియోగంలోనూ ముందంజలో ఉంది.  

20 మంది గిరిదర్శక్‌ల నియామకం: డీజీపీ శివధర్‌రెడ్డి 
తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అద్భుత అడ్వెంచర్లు ఉన్నాయి. పర్యాటకులకు వీటిని చూపించేందుకు ప్రభుత్వం గిరిదర్శన్‌ పేరుతో ప్రత్యేక గైడ్లను నియమించింది. అడవిబాటను వీడి జనం బాటపట్టిన గిరిజన, ఆదివాసీ యువకులను ఇందుకు ఎంచుకుంది. ఎత్తైన కొండలు, గుట్టలు, లోయలు, జలపాతాలను చూపించనుంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం నుంచి 20 మంది ఆదివాసీలను గిరిదర్శక్‌లుగా నియమించి శిక్షణ ఇచ్చాం. ఉపాధి కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు పూయిస్తాం. ప్రత్యేక యూనిఫాంలో ఉండే వీరు.. పోలీసులు, ఫారెస్ట్, టూరిజం శాఖల సమన్వయంతో పనిచేస్తారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలి. ప్రభుత్వం వారికి అన్నివిధాలా అండగా ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement