
హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్
పునరావాసాన్ని ఆర్థిక లావాదేవీగా చూడొద్దు
డిజిటల్ దు్రష్పభావాలపై కఠిన చట్టాలు రావాలి
‘వాయిస్ ఫర్ వాయిస్ లెస్’ కార్యక్రమంలో ప్రసంగం
కార్యక్రమంలో పాల్గొన్న ఏసీజే జస్టిస్ సుజోయ్‌పాల్, న్యాయమూర్తులు
సాక్షి, హైదరాబాద్: లైంగిక బాధితులైన చిన్నారులకు అందించే పరిహారం దాతృత్వం కాదని.. అది బాధ్యతని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ స్పష్టం చేశారు. డిజిటలైజేషన్ దు్రష్పభావాలను ఎదుర్కొనేందుకు బలమైన చట్టాలు రూపొందించాలన్నారు. ఆన్‌లైన్ గ్రూమింగ్, సైబర్ బెదిరింపులు, లైంగిక వేధింపులు సవాళ్లు విసురుతున్నాయని.. వాటిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీర్ఘకాలిక సంరక్షణ అందించే కుటుంబ, సమాజ మద్దతు వ్యవస్థలను నిర్మించాలని సూచించారు. పోలీసులు, ప్రాసిక్యూటర్లు, వైద్యులు, మనస్తత్వవేత్తలు, నాయాధికారులు.. సానుభూతి, సున్నితత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. బలహీనులు, అవసరమైన వారికి రక్షణగా నిలిచి.. ప్రతి చిన్నారికి జవాబుదారీగా ఉండాలని కోరారు.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ‘వాయిస్ ఫర్ ది వాయిస్‌లెస్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘అలహాబాద్ హైకోర్టులో జువెనైల్ జస్టిస్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఐదేళ్లు పనిచేసిన సమయంలో చిన్నారుల ఇబ్బందులు తెలుసుకొనే అవకాశం లభించింది. బాధిత చిన్నారులకు న్యాయం, పునరావాసం అందించాలి. పోక్సో చట్టం, పిల్లల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలి. ముందుగా సమస్య సంక్లిష్టతను గుర్తించాలి. లైంగిక వేధింపులకు గురైన బాలలు తక్షణం వారికి జరిగిన గాయం నుంచి మాత్రమే బాధపడరు. వారిని రక్షించడానికి ఉద్దేశించిన వ్యవస్థలతో తరచుగా తిరిగి గాయపడుతుంటారు. అటువంటి పిల్లలకు న్యాయం అంటే నిందితులకు శిక్ష మాత్రమే కాదు.. బాధితులకు శారీరక, మానసిక వైద్యంతోపాటు భవిష్యత్‌పై ఆశను పునరుద్ధరించాలి’అని జస్టిస్ విక్రమ్‌నాథ్ చెప్పారు.
పోక్సో ఓ మైలురాయి..
‘లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో–2012) తీసుకురావడం ఓ మైలురాయి. ఇది పిల్లల హక్కులను నివేదిస్తుంది. సాక్ష్యాల నమోదు, దర్యాప్తు, విచారణ కోసం బాధితులకు స్నేహపూర్వక విధానాన్ని కల్పిస్తుంది. అయితే చట్టాలు ఎంత మంచి ఉద్దేశంతో ఉన్నా వాటి అమలు తీరు కూడా పగడ్బందీగా ఉండాలి. మానసిక మద్దతు, ఉచిత న్యాయం, పునరావాసం, పునరేకీకరణకు కొత్త పథకాలు కొనసాగించాలి. తెలంగాణలో భరోసా కేంద్రాల ఏర్పాటు అభినందనీయం. పోలీసులు, వైద్య నిపుణులు, న్యాయ సాయం, మానసిక ఆరోగ్య నిపుణులను ఒకేచోట అందించడంలో వాటి పాత్ర ప్రశంసనీయం.
భరోసా కేంద్రంలోకి అడుగుపెట్టే బాధిత చిన్నారికి పోలీస్‌స్టేషన్‌లోకో లేక ఆస్పత్రిలోకో అడుగుపెట్టిన భావన కలగదు. భద్రత, వైద్య సాయం కోసం వచ్చామన్న ఉద్దేశంతో ఉంటారు. ఇలాంటి కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పోలీసులు, న్యాయాధికారులు, బాలల సంక్షేమ కమిటీలు, జువెనైల్ జస్టిస్ బోర్డులు, వైద్య సిబ్బంది, బాలల మనస్తత్వవేత్తలు, ఎన్‌జీవోలు అంతా కలసి పనిచేయాలి. ఈ ప్రయత్నంలో విధాన సంస్కరణలు అవసరం’అని జస్టిస్ విక్రమ్‌నాథ్ పేర్కొన్నారు.
లోటుపాట్లను అధిగమించాలి..
‘పోక్సో కేసుల విచారణలో జాప్యం, పథకాల అమల్లో ఆలస్యం, సిబ్బంది లేమి లాంటి లోటుపాట్లను అధిగమించాలి. చైల్డ్ ప్రెండ్లీ కో ర్టుల ఆవçశ్యకతను సుప్రీంకోర్టు పలుమార్లు నొక్కిచెప్పింది. తాజా గణాంకాలను పరిశీలిస్తే కేసుల పెండింగ్‌తోపాటు దోషుల నిర్ధారణ రేటు ఆందోళన కలిగిస్తోంది. చట్టాలు ఎన్ని ఉన్నాయనేది కాదు.. వాటిని ఎంత సమర్థంగా అమలు చేస్తున్నామనేది ముఖ్యం. కోర్టుల్లో చిన్నారులకు మౌలిక సదుపాయాలున్నాయా? న్యాయసాయానికి న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారా అన్నది సమీక్షించుకోవాలి. చట్టాన్ని మించిన బాధ్యత న్యాయమూర్తులపైనా ఉంది.
ప్రతి కేసును సానుభూతితో పరిష్కరించాలి. విచారణను ఇన్ కెమెరా (ఎవరూ లేకుండా)లో నిర్వహించాలి. ప్రశ్నలను జాగ్రత్తగా అడగాలి. చిన్నారి మనల్ని విశ్వసించేలా చూడాలి. బాధిత చిన్నారుల సంరక్షణలో లీగల్ సర్విసెస్ అథారిటీ పాత్ర కీలకం. నల్సా, రాష్ట్ర పథకాలు బాధితులకు సత్వరం అందేలా చూడాలి’అని వివరించారు. ఏసీజే జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ శామ్‌కోషి, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, పీపీ పల్లె నాగేశ్వర్‌రావు, రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.