కోటా పెంచండి.. జేపీ నడ్డాకు సీఎం రేవంత్‌రెడ్డి వినతి | CM Revanth Reddy requests JP Nadda on urea supply | Sakshi
Sakshi News home page

కోటా పెంచండి.. జేపీ నడ్డాకు సీఎం రేవంత్‌రెడ్డి వినతి

Jul 9 2025 12:49 AM | Updated on Jul 9 2025 12:49 AM

CM Revanth Reddy requests JP Nadda on urea supply

మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నడ్డాతో భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో ఎంపీ మల్లు రవి

యూరియా సరఫరాపై కేంద్రమంత్రి నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వినతి

యూరియా సకాలంలో సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు 

జూలై కోటా ఇప్పటివరకు 29 వేల టన్నులే సరఫరా అయ్యింది 

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తోనూ భేటీ 

పారిశ్రామిక కారిడార్‌ను ఏరో–డిఫెన్స్‌ కారిడార్‌గా మంజూరు చేయాలని వినతి

సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా కోటా పెంచాలని కేంద్ర ఆరోగ్య, సంక్షేమ, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కోరారు. రెండురోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఉన్న సీఎం.. మంగళవారం నడ్డాతో పాటు మరో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో వేర్వేరుగా వారి అధికారిక నివాసాల్లో భేటీ అయ్యారు. 

ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్‌ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్‌ ఉప్పల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘు నందన్‌రావు ఆయన వెంట ఉన్నారు. కాగా యూరి యా, ఏరో–డిఫెన్స్‌ కారిడార్, వరంగల్‌ విమానాశ్రయా నికి ఆర్థిక సహాయం వంటి అంశాలపై ఇద్దరు మంత్రులతో వేర్వేరుగా సీఎం చర్చించారు.  

రైల్వే రేక్‌లు పెంచండి.. 
రాష్ట్రంలో ప్రాజెక్టులకు నీరు వచ్చి, సాగు పనులు జోరుగా సాగుతున్నందున యూరియా సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా చూడాలని కేంద్ర మంత్రి నడ్డాను రేవంత్‌ కోరారు. వర్షాకాలం సీజన్‌కు సంబంధించి ఏప్రిల్‌–జూన్‌ మాసాల మధ్య 5 లక్షల మెట్రిక్‌ టన్నులకు గాను కేవలం 3.07 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా చేశారని తెలిపారు. 

జూలైలో దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా 63 వేల టన్నులు, విదేశాల నుంచి దిగుమతి అయిన యూరియా 97 వేల మెట్రిక్‌ టన్నులు రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉండగా.. కేవలం 29 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేయడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను పెంచాలని కోరారు. యూరియా సరఫరాకు సంబంధించి రైల్వే శాఖ తగిన రేక్‌లు కేటాయించడం లేదని, వాటి సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు.  

ఏరో–డిఫెన్స్‌ కారిడార్‌గా మంజూరు చేయండి 
హైదరాబాద్‌ ఆదిభట్లలో అత్యున్నతమైన మౌలిక వసతులతో ప్రత్యేక రక్షణ, ఏరోస్పేస్‌ పార్కును తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ను ఏరో–డిఫెన్స్‌ కారిడార్‌గా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న వంద ప్లగ్‌ అండ్‌ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పిస్తాం. 

కేంద్ర ప్రభుత్వం వాటికి మద్దతుగా నిలవాలి. జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి జాతీయ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి, అమలు ట్రస్ట్‌ (ఎన్‌ఐసీడీఐటీ) ఆమోదించిన రూ.596.61 కోట్లను త్వరగా విడుదల చేయాలి. స్మార్ట్‌ సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్, ఇతర వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేయాలి. హైదరాబాద్‌–వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా వరంగల్‌ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాలి..’అని కోరారు. హైదరాబాద్‌–విజయవాడ పారిశ్రామిక కారిడార్‌ ఫీజబిలిటీపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement