Munugode Politics: రివర్స్‌ ప్లాన్‌తో గేర్‌ మార్చిన కేసీఆర్‌.. మునుగోడుపై అదిరిపోయే వ్యూహం!

CM KCR Target On Munugode Assembly Constituency - Sakshi

Munugode Assembly constituency.. సాక్షి, హైదరాబాద్‌: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనిపై ముందే అప్రమత్తమైన కాంగ్రెస్‌ శుక్రవారం ఆ నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించి శంఖారావం పూరించింది. రాజగోపాల్‌రెడ్డి కూడా బీజేపీలో చేరిక కోసం ఏర్పాట్లు చేసుకుంటూనే ఉప ఎన్నిక కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మునుగోడుకు ఉప ఎన్నిక జరుగుతుందనే అంచనాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ కూడా ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టిపెట్టారు. ఇప్పటికే ఐప్యాక్‌ బృందంతోపాటు ఇతర సర్వే సంస్థలు, ప్రభుత్వ నిఘా విభాగాలు ఇచ్చిన నివేదికలను కేసీఆర్‌ అధ్యయనం చేశారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తోపాటు పలువురు నేతలు ఇప్పటికే కేసీఆర్‌ను కలిశారు. ఈ క్రమంలో మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ స్థితిగతులు, ఓటర్లు, టీఆర్‌ఎస్‌ కేడర్‌ మనోగతం, స్థానిక సంస్థల్లో టీఆర్‌ఎస్‌ బలం, పార్టీపరంగా ఉన్న బలాబలాలపై సీఎం కేసీఆర్‌ లోతుగా పరిశీలన జరుపుతున్నట్టు తెలిసింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో..
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర నేతలతో కేసీఆర్‌ వరుసగా భేటీ అవుతున్నారు. తాజాగా టీఆర్‌ఎస్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, నల్గొండ జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డి.రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. రెండు విడతలుగా సుమారు 6 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో.. ఉప ఎన్నికకు సంబంధించి క్షేత్రస్థాయిలో సేకరించాల్సిన సమాచారం, అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ దిశా నిర్దేశం చేసినట్టు తెలిసింది. 

హడావుడిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలు, వాటి ఫలితాలను ప్రస్తావిస్తూ.. మునుగోడులో ఎలా ముందుకు సాగాలనే అంశంపై వారు సుదీర్ఘంగా మాట్లాడుకున్నట్టు తెలిసింది. 

రాజగోపాల్‌రెడ్డి వెంట బీజేపీలోకి వెళ్లే అవకాశమున్న స్థానిక కాంగ్రెస్‌ నేతలు, వారి బలం, బీజేపీకి ఈ నియోజకవర్గంలో ఉన్న బలం, వలసలు పోగా కాంగ్రెస్‌ పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశాలూ ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరికలకు ఉన్న అవకాశాలపైనా సీఎం కేసీఆర్‌ ఆరా తీసినట్టు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో శనివారం కూడా సీఎం కేసీఆర్‌ సమీక్షించనున్నట్టు సమాచారం.  

ఇది కూడా చదవండి: రేవంత్‌ చేతికి ‘టీడీపీ’ రంగు.. వారి ఎంట్రీ కోసమేనా ఇదంతా..?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top