సిటీ మెట్రో డీలక్స్, ఏసీ బస్సు చార్జీల తగ్గింపు | City Metro Deluxe and AC bus fares reduced | Sakshi
Sakshi News home page

సిటీ మెట్రో డీలక్స్, ఏసీ బస్సు చార్జీల తగ్గింపు

Mar 22 2026 5:31 AM | Updated on Mar 22 2026 5:46 AM

City Metro Deluxe and AC bus fares reduced

హైదరాబాద్‌లో 3 నెలల డిస్కౌంట్‌ ప్రకటించిన ఆర్టీసీ 

ఈ కేటగిరీ బస్సుల్లో ఓఆర్‌ పెరిగితే అవే చార్జీలు కొనసాగించే యోచన 

ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ‘మహాలక్ష్మి’రద్దీ నేపథ్యంలో నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో తిరుగుతున్న మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ ఏసీ బస్సు చార్జీలను ఆర్టీసీ తగ్గించింది. టికెట్‌ ధరలను సవరించనప్పటికీ, డిస్కౌంట్‌ పేరుతో ప్రస్తుతానికి తగ్గించింది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉండే చార్జీలతో సమం చేసింది. మూడు నెలల పాటు దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. చార్జీల తగ్గింపు నేపథ్యంలో ఈ మూడు నెలల పాటు ఆ బస్సులకు ఆదరణ పెరిగితే, ఇవే చార్జీలను కొనసాగించటంతోపాటు ఆ కేటగిరీ బస్సుల సంఖ్యను పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది.  

పురుషులకు సీట్ల కొరత.. 
ప్రస్తుతం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ ఆర్డినరీ (పల్లె వెలుగు కూడా), మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే వీలుంది. ఈ వెసులుబాటు మొదలైనప్పటి నుంచి ఆ రెండు కేటగిరీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఇతర కేటగిరీ బస్సుల్లో వెళ్లే చాలామంది మహిళలు, అలాగే ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించే మహిళలు ఈ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. ఫలితంగా ఆ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) వంద శాతాన్ని దాటింది. ముందు వైపు ఉండే మహిళల సీట్లు నిండిపోయి, వెనకవైపు సీట్లలో కూడా మహిళా ప్రయాణికులు కూర్చుంటున్నారు. 

ఫలితంగా పురుషులకు సీట్లు పరిమితంగానే ఉంటున్నాయి. దీనిపై పురుష ప్రయాణికుల నుంచి అనేక ఫిర్యాదులొచ్చాయి. ఈ నేపథ్యంలో, మెట్రో డీలక్స్‌ పేరుతో కొత్త కేటగిరీ సర్వీసును ఆర్టీసీ మొదలుపెట్టింది. వీటిల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటు లేనందున ఎక్కువ సీట్లు పురుష ప్రయాణికులకు అందుబాటులో ఉంటున్నాయి. కానీ, ఇది డీలక్స్‌ కేటగిరీ సర్వీసు కావటంతో టికెట్‌ ధర కాస్త ఎక్కువగా ఉంది. దీనివల్ల ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ రేషియో నమోదుకాలేదు. దీనిపై ఇటీవల అధికారులు సర్వే చేసి కారణాలను విశ్లేషించారు. 

టికెట్‌ ధర ఎక్కువగా ఉందన్న మాట చాలా మంది నుంచి వినిపించింది. మహాలక్ష్మి పథకం వల్ల ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో తమకు సీట్లు దొరకటం లేదని, వాటిని వదిలి ఎక్కువ టికెట్‌ ఖర్చుతో డీలక్స్‌ బస్సులో వెళ్లటం ఏం న్యాయమని కొందరు ప్రశ్నించారు. దీంతో డీలక్స్‌ బస్సుల టికెట్‌ ధరను కొంత తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అయితే, టికెట్‌ ధరలను సవరించాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. తిరిగి పెంచితే ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వస్తుంది. 

ఈ నేపథ్యంలో సంస్థ తన అధికారాన్ని ఉపయోగించి డిస్కౌంట్‌ను ప్రకటించింది. మార్చి నుంచి మే వరకు ఇది అమలులో ఉంటుంది. ప్రస్తుతం సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉన్న టికెట్‌ చార్జీలనే వీటిల్లో అమలు చేస్తున్నారు. పనిలోపనిగా, నగరంలో తిరుగుతున్న మెట్రో లగ్జరీ(ఎయిర్‌పోర్టుకు తిరిగే పుష్పక్‌ కాకుండా) ఏసీ బస్సుల్లో కూడా ఎక్స్‌ప్రెస్‌ చార్జీలనే అమలు చేయనున్నారు. ఈ మూడు నెలల పాటు పరిశీలించి, ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో పెరిగితే కొంతకాలం పాటు అవే చార్జీలను కొనసాగించటంతోపాటు, ఆ బస్సుల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.

Advertisement
 
Advertisement
Advertisement