పిల్లలు, మహిళలపై రక్తహీనత పంజా

Central Health Family Welfare Department report revealed about Anemia  - Sakshi

రాష్ట్రంలో మహిళల్లో 57.6 శాతం, పిల్లల్లో 70 శాతం మంది బాధితులు 

53.2 శాతం మంది గర్భిణుల్లో రక్తహీనత 

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక వెల్లడి 

రక్తహీనత 40 శాతం కంటే ఎక్కువ ఉంటే తీవ్రమైన ప్రజారోగ్య సమస్యే 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మహిళలు, పిల్లలను రక్తహీనత పట్టి పీడిస్తోంది. తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా పరిణమించింది. 15–49 ఏళ్ల మధ్య వయసు గల మహిళల్లో 57.6 శాతం, ఐదేళ్ల లోపు పిల్లల్లో 70 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నివేదికలో పలు వివరాలు పేర్కొంది. పిల్లల రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయి 11 హెచ్‌బీ కంటే తక్కువగా ఉంటే రక్తహీనత కలిగినవారిగా వర్గీకరించారు.

అంతకుముందు ఐదేళ్లతో పోల్చినప్పుడు మహిళల్లో రక్తహీనత ఒక శాతం పెరిగింది. 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు మహిళల రక్తహీనతలో తెలంగాణ 16వ స్థానంలో నిలిచింది. దేశంలో అత్యధికంగా లడక్‌లో 92.8 శాతం మంది, అత్యంత తక్కువగా లక్ష ద్వీప్‌లో 25.8 శాతం మంది రక్తహీనత బాధితులున్నారు. ఇదే వయసు గల గర్భి ణుల్లో 53.2 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని నివేదిక తెలిపింది.

గర్భిణుల రక్తహీనతలో తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఐదేళ్లలో గర్భిణుల్లో 48.2 శాతం మంది రక్తహీనత బాధితులు ఉండగా, ఆ తర్వాత ఐదు శాతం పెరిగింది. ఇక 15–19 ఏళ్ల వయస్సుగల బాలికల్లోనూ రక్తహీనత శాతం 64.7 శాతముంది. అంతకుముందు ఐదేళ్లలో అది 59.7 శాతమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం రక్తహీనత 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా పరిగణించాలి.   

పిల్లల్లో అత్యధికం లడాక్‌.. అత్యల్పం కేరళ 
రాష్ట్రంలో ఆరు నెలల నుంచి ఐదేళ్లలోపు వయ సు గల 70 శాతం మంది పిల్లలు రక్తహీనత బారినపడ్డారు. 2019–21 మధ్య దేశంలో ఆ వయస్సు పిల్లల్లో అత్యధికంగా లడక్‌లో 92.5 శాతం మంది, గుజరాత్‌లో 79.7 శాతం మంది రక్తహీనతకు గురయ్యారు. పిల్లల్లో రక్తహీనత తక్కువగా ఉన్న రాష్ట్రాలు కేరళ (39.4 శాతం), అండమాన్‌– నికోబార్‌ దీవులు(40 శాతం), నాగాలాండ్‌ (42.7 శాతం) మణిపూర్‌ (42.8 శాతం) ఉన్నాయి.

రక్తహీనత బారిన పడిన పి ల్లల విషయంలో తెలంగాణ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఐదేళ్లలోపు పిల్లల్లో జాతీయ సగటు 67.1 శాతం కంటే రాష్ట్రంలో ఎక్కువగా రక్తహీనత బాధితులు ఉన్నారని పేర్కొంది. 2015–16 సంవత్సరంతో పోలిస్తే, 2019–21 మధ్య 9.3 శాతం మేర రక్తహీనత బాధితులు తెలంగాణలో పెరిగారని వెల్లడించింది. 

ఇవీ కారణాలు.. 
తల్లి విద్యాస్థాయి, వయస్సు, తల్లిపాలు ఇచ్చే వ్యవధి తదితర కారణాలు పిల్లల్లో రక్తహీనతపై ప్రభావం చూపిస్తాయి. ఇనుము లోపం రక్తహీనతకు అత్యంత సాధారణ కారణం. పౌష్టికాహార లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.

డయేరియా, మలేరియా, ఇతర ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రక్తహీనత ప్రమాదాన్ని పెంచుతాయి. వివిధ సామాజిక–ఆర్థిక, సాంస్కృతిక, విశ్వాసాల కారణంగా ఏర్పడే ఆహారపు అలవాట్లు కూడా రక్తహీనతకు కారణమవుతున్నాయి. రక్తహీనత సమస్యను అధిగమించాలంటే పుట్టిన తర్వాత మొదటి వెయ్యి రోజుల్లో తీసుకునే చర్యలు కీలకమైనవని డాక్టర్‌ కిరణ్‌ మాదల విశ్లేషించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top