
ఖజానాపై ఒకేసారి భారం పడకుండా వెసులుబాటు
తొలిదశలోనే 6 వరుసల రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఆమోదం
రోడ్డుపై టోల్ చార్జీల వసూలు బాధ్యత మరో సంస్థకు అప్పగించనున్న కేంద్రం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం రోడ్డు నిర్మాణాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్)లో నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిర్ణయించింది. తొలుత దీన్ని ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్) పద్ధతిలో నిర్మించాలని నిర్ణయించినప్పటికీ, తాజాగా హ్యామ్ వైపు మొగ్గు చూపింది. ఈ పద్ధతిలో ప్రభుత్వం నిర్మాణానికయ్యే ఖర్చును ఎప్పటికప్పుడు చెల్లించాల్సిన అవ సరం ఉండదు. నిర్మాణ సంస్థకు విడతల వారీగా చెల్లించే వీలుంటుంది. ఖజానాపై భారం పడకుండా వెసులుబాటు లభిస్తుంది.
రద్దీ ఎక్కువగా ఉంటుందని తేలడంతో.. ఉత్తర భాగాన్ని (162 కి.మీ) చేపట్టేందుకు మూడు నెలల క్రితం ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచింది. మొత్తం 8 లేన్లకు గాను తొలివిడతలో 4 వరసలుగా నిర్మించాలని టెండర్ డాక్యుమెంటులో పేర్కొంది. ఈ రోడ్డు మీద టోల్ ఆదాయం తక్కువగా ఉంటుందనే అంచనాతో కాంట్రాక్టర్లు ఈపీసీ పద్ధతిలో పని చేపట్టేందుకే ముందుకొస్తారని ఎన్‌హెచ్‌ఏఐ భావించింది. ఈపీసీ పద్ధతిలో నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.
పనులు జరిగేకొద్దీ ఎప్పటికప్పుడు అయ్యే వ్యయాన్ని నిర్మాణ సంస్థకు విడుదల చేయాల్సి ఉంటుంది. నిధుల విడుదల నిలిచిపోతే పనులు కూడా ఆగిపోతాయి. అయితే పీఎం గతిశక్తిలోని నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ ఈ ప్రాజెక్టుపై సమీక్షించి ఆర్‌ఆర్‌ఆర్ వల్ల ఆయా ప్రాంతాల్లో మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉన్నందున, ఆ రోడ్డుపై వాహనాల సంఖ్య కూడా అధికంగానే ఉంటుందని, దీనివల్ల టోల్ ఆదాయం కూడా ఎక్కువే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. రోడ్డును 4 వరసలుగా కాకుండా, తొలి దశలోనే 6 వరసలతో నిర్మించాలని సూచించింది.
ఈ మేరకు మరోసారి ట్రాఫిక్ స్టడీ నిర్వహించాలని పేర్కొంది. కాగా భవిష్యత్తులో వాహనాల సంఖ్య భారీగా ఉండనుందని ట్రాఫిక్ స్టడీ తేల్చింది. దీంతో 6 వరసల రోడ్డు, 8 వరసలతో వంతెనలు నిర్మించాలని కేంద్రానికి ఎన్‌హెచ్‌ఏఐ ప్రతిపాదించింది. తాజాగా దానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆమోదం తెలిపింది. ఈపీసీ పద్ధతిలో కాకుండా, హ్యామ్ మోడల్‌లో రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థతో ఒప్పందం చేసుకోవాలని కూడా ఆదేశించింది. దీంతో పాత టెండర్ డాక్యుమెంట్‌ను మార్చి ఆ మేరకు మార్పులు చేయాలని ఆదేశించింది.
హ్యామ్‌తో ఇదీ వెసులుబాటు..
హ్యామ్ మోడల్‌లో ప్రభుత్వం మొత్తం నిర్మాణ వ్యయంలో తొలుత 40 శాతం మాత్రమే భరిస్తుంది. మిగతా మొత్తాన్ని నిర్మాణ సంస్థ బ్యాంకుల నుంచి రుణం ద్వారా సమకూర్చుకుంటుంది. సొంత ఆర్థిక వనరులుంటే రుణంతో సంబంధం లేకుండా కూడా ఖర్చు చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని 15 ఏళ్ల సమయం (ఒప్పందంలో పేర్కొనే గడువు)లో ప్రభుత్వం వడ్దీతో చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఆరు నెలలకు ఓ వాయిదా చొప్పున చెల్లిస్తుంది. అంతకాలం రోడ్డు నిర్వహణ బాధ్యతను ఆ సంస్థనే పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇక రోడ్డుపై టోల్‌వసూలు చేసే బాధ్యతను మరో టెండర్ ద్వారా ఇంకో సంస్థకు అప్పగిస్తుంది.
త్వరలో రోడ్డుకు నంబర్..
ఈ రోడ్డును చేపట్టాలంటే దానికి కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోద ముద్ర అవసరం. రోడ్డు పనులకు ఆయ్యే వ్యయం వివరాలను సమీక్షించి, ఆ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై కమిటీ చర్చించి ఆమోద ముద్ర వేస్తుంది. అప్పుడే ఆ రోడ్డుకు జాతీయ రహదారి నంబరు కేటాయిస్తుంది. ఆ తర్వాత టెండర్ తెరిచి నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకుంటారు. ఈ వారంలో కమిటీ సమావేశం జరగనున్నట్టు తెలిసింది. అందుకు వీలుగా ఎన్‌హెచ్‌ఏఐ నివేదిక సిద్ధం చేస్తోంది.