
పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి కృపానందం కూడా..
తీర్పు వెల్లడించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం
గాలి జనార్దనరెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్ దోషులు.. ఏడేళ్ల జైలు
రాజగోపాల్‌కు అదనంగా నాలుగేళ్లు
10 వేల చొప్పున జరిమానా.. ఓఎంసీకి రూ.2 లక్షల ఫైన్
సాక్షి, హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. గనుల శాఖ మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి కృపానందంలను నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మంగళవారం మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా తేల్చింది.
ప్రధాన నిందితులైన ఓఎంసీ అప్పటి డైరెక్టర్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, కంపెనీ ఎండీ బీవీ శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్, గాలి జనార్దనరెడ్డి పీఏ మెహఫూజ్ అలీఖాన్‌లను దోషులుగా నిర్ధారిస్తూ.. ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున,ఓఎంసీకి రూ.2 లక్షల జరిమానా విధించింది. రాజగోపాల్‌కు అవినీతి నిరోధక చట్టం కింద అదనంగా నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి ఐఏఎస్ అధికారి యర్రా శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు 2022లో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
2009లో కేసు నమోదు
ఏపీ–కర్ణాటక సరిహద్దు అనంతపురం, బళ్లారి రిజర్వు ఫారెస్టులో ఓబుళాపురం గ్రామ పరిధిలోని ఇనుప గనుల తవ్వకాలను ఓఎంసీ నిర్వహించేంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టిందని 2009 డిసెంబరు 7న సీబీఐకి ఫిర్యాదు అందింది. అనుమతి పొందిన 68.5 హెక్టార్ల ప్రాంతాన్ని దాటి ఇనుప ఖనిజాన్ని తవి్వందని అందులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, వీడీ రాజగోపాల్, ఓఎంసీ, కృపానందం, సబితాఇంద్రారెడ్డి, గనుల శాఖ నాటి ఏడీ లింగారెడ్డి, శ్రీలక్ష్మిలపై అభియోగాలు నమోదు చేసింది.
ఐపీసీ సెక్షన్లతో పాటు కొందరిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు పెట్టింది. రూ.884.13 కోట్ల మేర అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని 2011లో సీబీఐ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. 2014 వరకు ఇలా నాలుగు చార్జిషీట్లు వేసింది. 60 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేశారని, బినామీ లావాదేవీలు జరిగాయని సీబీఐ పేర్కొంది. కాగా, కేసు విచారణ ఏళ్లకు ఏళ్లు పడుతుండడంతో సుప్రీంకోర్టు విచారణను పర్యవేక్షిస్తూ.. మే నెలలోగా పూర్తి చేయాలని గడువు విధించింది. ఇక 219 మంది సాక్షులను విచారించి, 3,330 డాక్యుమెంట్లను పరిశీలించిన సీబీఐ న్యాయస్థానం గత నెలలో తీర్పు రిజర్వు చేసింది. కాగా, లింగారెడ్డి విచారణ దశలోనే మృతి చెందారు.
కోర్టుకు హాజరైన నిందితులు
తీర్పు వెల్లడి సందర్భంగా కేసులో నిందితులు కోర్టుకు హాజరయ్యారు. ఈ నెల 18న తన కుమారుడి పెళ్లి ఉందని అప్పటివరకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని శ్రీనివాసరెడ్డి కోరారు. తాను ఎన్నో ప్రజాపయోగ కార్యక్రమాలు చేశానని, పేద కుటుంబం నుంచి వచ్చి వేలాదిమందికి ఉపాధి కల్పించానని గాలి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.
కోర్టు తనను బళ్లారిలో అడుగుపెట్టొద్దని ఆదేశించినా, మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచానని తెలిపారు. ఉపశమనం కల్పిస్తే ఆధ్యాత్మిక పథంలో వెళ్తానని విన్నవించారు. ప్రభుత్య ఉద్యోగులందరినీ వదిలేసి తనను శిక్షించడం అన్యాయమని రాజగోపాల్ నివేదించారు. తనపై ఆధారపడి తల్లిదండ్రులు, నలుగురు పిల్లలు ఉన్నారని అలీ విజ్ఞప్తి చేశారు. సబితాఇంద్రారెడ్డి, కృపానందం కూడా కోర్టుకు హాజరయ్యారు.