క్యాబ్‌ చార్జీలు; డ్రైరన్‌ పేరిట బాదుడు

Cab Rides Get More Expensive in Hyderabad - Sakshi

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు లేకపోవడమే కారణం

ఆటోల్లోనూ అదే దోపిడీ..

25 శాతమే సిటీ బస్సులు

సాక్షి, హైదరాబాద్‌: పద్మారావునగర్‌కు చెందిన రోహిత్‌ నాలుగు రోజుల క్రితం సికింద్రాబాద్‌ నుంచి మణికొండకు క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాడు. సాధారణ రోజుల్లో రూ.350 చార్జీ నమోదు కాగా ప్రస్తుతం రూ.550కి పెరిగింది. అత్యవసరమైన పని కావడంతో తప్పనిసరిగా బయలుదేరవలసి వచ్చింది. బంజారాహిల్స్‌ నుంచి రాంనగర్‌ వరకు ప్రతి రోజు క్యాబ్‌లో ప్రయాణం చేసే గోపీనాథ్‌కు భారీగా పెరిగిన చార్జీలతో బెంబేలెత్తాడు. లాక్‌డౌన్‌కు ముందు రోజుల్లో అయితే ఆ రూట్‌లో రూ.110 నుంచి రూ.120 వరకు చార్జీ అయ్యేది. కానీ ఇప్పుడు రూ.180 నుంచి రూ.220 వరకు నమోదవుతున్నాయి. ఒక్కోసారి అది రూ.250 వరకు పెరిగిపోతుంది. (హైదరాబాద్‌-తిరుపతి మధ్య తగ్గనున్న దూరం)

ఇది ఏ ఒక్క రూట్‌కు పరిమితమైన చార్జీలు కాదు. నగరంలోని అన్ని రూట్లలోనూ కొద్ది రోజులుగా క్యాబ్‌ చార్జీలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు, తరువాత  క్యాబ్‌ చార్జీల్లో గణనీయమైన తేడా నమోదవుతోంది. ఒకవైపు ప్రయాణికుల డిమాండ్‌కు తగిన విధంగా సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడం, మరోవైపు ఎంఎంటీఎస్‌ ఇప్పటికీ పునరుద్ధరణకు నోచకపోవడంతో మెట్రోరైళ్లు అందుబాటులో లేని మార్గాల్లో ప్రయాణికులు ఎక్కువ శాతం ఆటోలు, క్యాబ్‌లపైన ఆధారపడాల్సి వస్తుంది. ప్రయాణికుల అవసరాన్ని, డిమాండ్‌ను క్యాబ్‌ సంస్థలు ఇష్టారాజ్యంగా సొమ్ము చేసుకుంటున్నాయి.  

అరకొర సదుపాయాలే...

  • అన్‌లాక్‌ 4.0 నుంచి క్రమంగా జనజీవన సాధారణ స్థాయికి చేరుకుంది. రాకపోకలు పెరిగాయి. మొదట్లో మెట్రో రైళ్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అన్‌లాక్‌ 5.0 తరువాత పరిమితంగా సిటీ బస్సులను పునరుద్ధరించారు.
  • సాధారణంగానే గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రతి రోజు సుమారు 30 లక్షల మంది సిటీ బస్సుల్లో తిరుగుతారు. మరో 10 లక్షల నుంచి 15 లక్షల మంది క్యాబ్‌లు, ఆటోల్లో ప్రయాణం చేస్తారు.
  • కరోనా కారణంగా ప్రయాణాలు తగ్గినప్పటికీ లాక్‌డౌన్‌ సడలింపులతో ఇటీవల కాలంలో  బాగా పెరిగాయి. ఉద్యోగ, వ్యాపారాల కోసమే కాకుండా అన్ని రకాల అవసరాల కోసం వివిధ ప్రాంతాల్లో రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
  • కానీ ఇందుకు తగినట్లుగా రవాణా సదుపాయాల పునరుద్ధరణ జరగలేదు. ఐటీ రంగం  ఇంకా ప్రారంభం కాకపోవడంతో క్యాబ్‌లు తక్కువగా తిరుగుతున్నాయి. గతంలో 1.5 లక్షల క్యాబ్‌లు ఉంటే ఇప్పుడు 60 వేలకు తగ్గాయి. తిరిగి ఐటీ పుంజుకుంటే తప్ప క్యాబ్‌ సదుపాయం మెరుగుపడకపోవచ్చునని అంచనా.
  • సాధారణ రోజుల్లో కనీసం 50 లక్షల మంది వివిధ రకాల ప్రజా రవాణా సదుపాయాలను వినియోగించేవారని భావించినా ఇప్పుడు అందులో సగం మందికి సరిపడా ప్రజారవాణా కూడా అందుబాటులో లేదు. 3000 బస్సులకు బదులు 1000 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి.
  • మరో 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులు ఇంకా పునరుద్ధరణకు నోచలేదు.
  • దీంతో అరకొర సదుపాయాలపైన ఆధారపడి ప్రయాణం చేయవలసి వస్తుంది. లేదంటే వ్యక్తిగత వాహనాలపైన ఆధారపడాల్సి వస్తుంది.

డ్రైరన్‌ పేరిట హాఫ్‌ రిటర్న్‌...

  • ఈ క్రమంలోనే క్యాబ్‌ సంస్థలు చార్జీలను అడ్డగోలుగా పెంచేస్తున్నాయి. ప్రయాణికులు కోరుకున్న చోట నుంచి క్యాబ్‌ అందుబాటులో లేదనే సాకుతో డ్రైరన్‌ పేరిట అదనపు చార్జీలు విధిస్తున్నారు.
  • ఉప్పల్‌లో బుక్‌ చేసుకొనే ప్రయాణికుడికి అక్కడికి దగ్గర్లో క్యాబ్‌ అందుబాటులో లేదనే కారణంతో తార్నాక నుంచి రప్పిస్తారు. తార్నాక నుంచి ఉప్పల్‌ వరకు ఖాళీగా వచ్చినందుకు ఆ మొత్తాన్ని ప్రయాణికులపైన మోపుతున్నారు.  
  • ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లోనూ ఇదే తరహాలో ప్రయాణికుల డిమాండ్‌కు తగినట్లుగా క్యాబ్‌లు అందుబాటులో లేవనే కారణంతో సర్‌చార్జీలు విధిస్తున్నారు. డ్రైరన్‌ పేరిట భారం మోపుతున్నారు.  
  • ఆటోల్లోనూ అదే దోపిడీ కొనసాగుతోంది. ప్రయాణికుల నుంచి ఇష్టారాజ్యంగా వసూళ్లకు దిగుతున్నారు.

కమీషన్‌లో మార్పు లేదు  
ఇదంతా క్యాబ్‌ సంస్థల మాయాజాలమే. డ్రైరన్‌ వల్ల బలయ్యేది డ్రైవర్లే. ప్రయాణికుల దగ్గర అదనంగా వసూలు చేసే చార్జీలు క్యాబ్‌ సంస్థలకే వెళ్తున్నాయి. మా దగ్గర మాత్రం ప్రతి రైడ్‌కు యథావిధిగా 25 శాతం కమీషన్‌లు తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 20 శాతానికి తగ్గిస్తే  డ్రైవర్‌లకు ఎంతో మేలు జరుగుతుంది. కానీ క్యాబ్‌ సంస్థలు ఆ పని చేయడం లేదు.  
– షేక్‌ సలావుద్దీన్, తెలంగాణ క్యాబ్‌ డ్రైవర్స్‌ అసోషియేషన్‌    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top