
యువకుడికి క్యాబ్‌డ్రైవర్ బెదిరింపులు
పోలీసులకు ఫిర్యాదు
బంజారాహిల్స్ : ‘వెనుక కూర్చొని మీరు చేసిన పనులన్నీ గమనించా..వీడియో తీశా..వీటిని సోషల్ మీడియాలో వైరల్ చేయకుండా ఉండాలంటే రూ.50 వేలు ఇవ్వాలి’ అంటూ బెదిరింపులకు పాల్పడిన క్యాబ్ డ్రైవర్‌పై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కవాడిగూడకు చెందిన అహ్మద్ అనే యువకుడితో పాటు మరో యువతి హైటెక్ సిటీలో ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ స్నేహితులు. ఈ నెల 17వ తేదీన వీరిద్దరూ విధులు ముగిసిన తర్వాత సాయంత్రం 5.30 గంటలకు కవాడిగూడ వెళ్లేందుకు క్యాబ్ మాట్లాడుకున్నారు.
జహీరాబాద్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ శ్రీనివాస్ వీరిద్దరినీ ఎక్కించుకుని వెళ్తుండగా మార్గమధ్యలో బంజారాహిల్స్ రోడునెంబర్–2లోని టీవీ–9 సమీపంలో ఓ స్నేహితుడిని కలిసేందుకు 20 నిమిషాలు ఆగి..తిరిగి బయలుదేరారు. వీరిద్దరినీ కవాడిగూడలో దింపిన తర్వాత అహ్మద్ జీపే ద్వారా బిల్లు చెల్లించాడు. ఈ నెల 19వ తేదీ రాత్రి అహ్మద్‌కు ఓ మేసేజ్ వచి్చంది. నువ్వు వెనుక కూర్చొని ఆ అమ్మాయితో ఏమేమీ చేశావో అన్నీ తాను రికార్డ్ చేశానని, వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలంటే రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
గంటసేపటిలోగా డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని హెచ్చరించాడు. తన వద్ద అంత డబ్బు లేదని, తాను చిన్న ఉద్యోగినని అహ్మద్ చెప్పగా, ఒక రోజు గడువు ఇస్తున్నానని, తెల్లారిలోగా రూ.50 వేలు తెచి్చవ్వాలని హెచ్చరించాడు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఊబర్ క్యాబ్ డ్రైవర్ శ్రీనివాస్‌పై బీఎన్‌ఎస్ సెక్షన్ 77, 308 (3), 351 (2), ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.