లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ‘బుల్లెట్ బండి’ ఫేమ్ అశోక్

Bullet Bandi Song Fame Ashok Caught To ACB Taking Bribe - Sakshi

నిందితుడు ‘బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా’.. ఫేమ్‌ అశోక్‌  

లంచం తీసుకుంటూ పట్టుబడిన బడంగ్‌పేట్‌ అధికారి

కార్పొరేషన్‌ కార్యాలయంతోపాటు ఆయన ఇంట్లో ఏకకాలంలో సోదాలు 

బడంగ్‌పేట్‌: ‘బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా..’ అంటూ పెళ్లి బారాత్‌లో నృత్యం చేసి ప్రముఖులైన వధూవరులు గుర్తుండే ఉంటారు. ఇప్పుడా పెళ్లికొడుకు ఏసీబీకి పట్టుబడి వార్తల్లో మరోసారి నిలిచాడు. వివరాలివి. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఆకుల అశోక్‌ టౌన్‌ప్లానింగ్‌ సెక్షన్‌ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అల్మాస్‌గూడకు చెందిన దేవేందర్‌రెడ్డికి బడంగ్‌పేటలో రెండు ప్లాట్లు ఉండగా.. వాటి నిర్మాణాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

అందుకోసం టౌన్‌ప్లానింగ్‌ అధికారి అశోక్‌ ఒక్కొక్క ప్లాట్‌కు రూ.30 వేల చొప్పున రూ.60 వేలు డిమాండ్‌ చేశాడు. వారం క్రితం దేవేందర్‌రెడ్డి నేరుగా అశోక్‌కు రూ.20 వేలు అందజేశాడు. మరో రూ.30 వేలు మంగళవారం సాయంత్రం ఇచ్చే ప్రయత్నం చేయగా.. ప్రైవేట్‌ డాక్యుమెంటరీ ప్లానర్‌ ఎర్రబట్టు శ్రీనివాస్‌రాజుకు ఇవ్వండని.. అశోక్‌ సూచించాడు. దేవేందర్‌రెడ్డి రూ.30 వేలను శ్రీనివాస్‌రాజుకు ముట్టజెబుతుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ప్రైవేట్‌ డాక్యుమెంటరీ ప్లానర్‌ శ్రీనివాసరాజును సైతం అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని టౌన్‌ ప్లానింగ్‌ కార్యాలయంతో పాటు నాగోల్‌లోని అశోక్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. నిందితులిద్దరినీ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైల్‌కు తరలించనున్నట్లు  ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top