సభ్యత్వ నమోదుకు ఇన్‌చార్జిలు | BRS is preparing a digital app for membership registration | Sakshi
Sakshi News home page

సభ్యత్వ నమోదుకు ఇన్‌చార్జిలు

May 22 2026 2:57 AM | Updated on May 22 2026 2:57 AM

BRS is preparing a digital app for membership registration

119 నియోజకవర్గాల జాబితా విడుదలచేసిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 

సభ్యత్వ నమోదుకు సిద్ధమవుతున్న డిజిటల్‌ యాప్‌ 

డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై ఇన్‌చార్జిలకు శిక్షణ.. ఆ తర్వాత జిల్లాల్లో శిబిరాలు 

శిక్షణ పూర్తయిన తర్వాత సభ్యత్వ నమోదు షెడ్యూలు ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: డిజిటల్‌ పద్ధతిలో పార్టీ సభ్యత్వ నమోదు కోసం బీఆర్‌ఎస్‌ చేస్తున్న సన్నాహాల్లో భాగంగా పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 119 నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను ప్రకటించారు. ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శులకు జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు సమన్వయ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా నియమితులైన ఇన్‌చార్జిలు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. 

ఈ మేరకు 119 నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిల పేర్లతో కూడిన జాబితాను కేసీఆర్‌ గురువారం విడుదల చేశారు. సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలతో పాటు ప్రతీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఐటీ నిపుణుడికి తెలంగాణ భవన్‌లో డిజిటల్‌ పద్ధతిలో నమోదుపై శిక్షణ ఇస్తారు. డిజిటల్‌ పద్ధతిలో సభ్యత్వ నమోదు కోసం రూపొందిస్తున్న డిజిటల్‌ యాప్‌కు తుది మెరుగులు పూర్తయిన తర్వాత త్వరలో ఇది అందుబాటులోకి రానున్నది.

ఇదిలా ఉంటే తెలంగాణ భవన్‌లో శిక్షణ అనంతరం జిల్లా కేంద్రాల్లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాల్లో ఇప్పటికే నియమితులైన పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కోసం నియోజకవర్గాల్లోని బూత్‌ల సంఖ్య ఆధారంగా ఒక్కో పోలింగ్‌ బూత్‌కు ఇద్దరు చొప్పున స్మార్ట్‌ ఫోన్‌ కలిగిన కార్యకర్తలను ఎంపిక చేసి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. 

శిక్షణ పూర్తయిన తర్వాత డిజిటల్‌ సభ్యత్వ నమోదు తేదీని ప్రకటిస్తారు. తొలి రోజున పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో పాటు ముఖ్య నేతలు పాల్గొని తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకుంటారు. సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత గ్రామ స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు సంస్థాగత కమిటీ ఎన్నికల షెడ్యూలును ప్రకటించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement