రహ్మత్‌నగర్ రోడ్‌షోలో మాట్లాడుతున్న కేటీఆర్
నిరుద్యోగ భృతి ఏమైంది?ఓటమి భయంతోనే సీఎం ధమ్కీలు
సెటిల్‌మెంట్లు చేసుకునే బ్లాక్‌మెయిలర్ సెంటిమెంట్ గురించి మాట్లాడితే ఎలా?.. సీఎం రేవంత్‌రెడ్డిది కాంగ్రెస్‌తో ఫేక్ బంధం, బీజేపీతో పేగు బంధం
రహ్మత్‌నగర్ రోడ్‌షోలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/రహ్మత్‌నగర్: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏటా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. మరో ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి రహ్మత్‌నగర్ డివిజన్‌లో నిర్వహించిన భారీ రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిరాశతో సీఎం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేయకుంటే అన్నీ రద్దుచేస్తామని ధమ్కీ ఇస్తున్నారని విమర్శించారు. ఎగిరెగిరి పడితే జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వాతలకు ప్రభుత్వమే పతనమయ్యే రోజు వస్తుందని హెచ్చరించారు. ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని రేవంత్‌రెడ్డి ప్లాన్ వేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, 500 రోజుల్లో తిరిగి కేసీఆర్ సీఎం కాబోతున్నారని తెలిపారు.
‘గోపన్న లేడని, సునీతమ్మ ఆడబిడ్డ అని అనుకోవద్దు. ఆడబిడ్డ అంటే ఆదిశక్తి. రౌడీలు సతాయిస్తే ఎట్లా అని అనుకోవద్దు. జనతా గ్యారేజ్ వంటి బీఆర్‌ఎస్ భవన్ పక్కనే ఉంది. మీరు ఒక్క ఫోన్ కొడితే 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వస్తా. బీఆర్‌ఎస్ పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుంది’అని భరోసా ఇచ్చారు. గోపీనాథ్ కాపాడిన శివమ్మ పాపిరెడ్డి హిల్స్ స్థలంలో పెద్ద స్టేడియం కట్టించి ఆయన పేరు పెడతామన్నారు. ఒక్క ఆడబిడ్డను ఓడించేందుకు సీఎం, మంత్రులు కాలికి బలపం కట్టుకొని గల్లీగల్లీ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
బీజేపీతో రేవంత్‌రెడ్డిది పేగుబంధం
సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌తో ఉన్నది ఫేక్ బంధమైతే.. బీజేపీతో ఉన్నది పేగు బంధమని కేటీఆర్ ఆరోపించారు. బతికి ఉన్నప్పుడు ఆయన మామ జైపాల్‌రెడ్డిని బండబూతులు తిట్టిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సెటిల్‌మెంట్లు చేసే బ్లాక్‌మెయిలర్ సెంటిమెంట్ గురించి మాట్లాడితే ఏం చెప్పాలి? అని ప్రశ్నించారు.
కరోనా సమయంలో రూపాయి ఆమ్దానీ లేకున్నా కేసీఆర్ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపలేదని, ఇప్పుడు సీఎంకు కనీసం గురుకుల పాఠశాలలు నడపడం తెలియట్లేదని ఎద్దేవా చేశారు. సీఎం ఎన్ని ఎత్తులు వేసినా బీఆర్‌ఎస్‌కు భారీ విజయం దక్కబోతోందని అన్నారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు దేశపతి శ్రీనివాస్, మాగంటి సునీత, మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్, విష్ణువర్ధన్‌రెడ్డి, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బీఆర్‌ఎస్‌లో చేశారు. ఆయనకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహా్వనించారు.


