తండ్రిని చంపాడనే కక్షతోనే హత్య | BRS Leader Chintalapati Madhu Murder case Updates | Sakshi
Sakshi News home page

తండ్రిని చంపాడనే కక్షతోనే హత్య

May 26 2026 1:56 AM | Updated on May 26 2026 1:56 AM

BRS Leader Chintalapati Madhu Murder case Updates

నిందితుల వివరాలను వెల్లడిస్తున్న సూర్యాపేట ఎస్పీ నరసింహ

బీఆర్‌ఎస్‌ నేత చింతలపాటి మధు హత్య కేసును ఛేదించిన పోలీసులు 

వివరాలు వెల్లడించిన సూర్యాపేట ఎస్పీ నరసింహ

సూర్యాపేటటౌన్‌: సూర్యాపేట మండలం యర్కారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నేత చింతలపాటి మధు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇరవై ఏళ్ల క్రితం తన తండ్రి మిద్దె రవీందర్‌ను చంపాడనే కక్షతోనే ఆయన కుమారుడు మిద్దె జీవన్‌తోటు మరో ఐదుగురు కలిసి చింతలపాటి మధును హత్య చేసినట్టు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు. ఈ కేసు వివరాలను సోమవారం ఎస్పీ విలేకరులకు వెల్లడించారు. చింతలపాటి మధు శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆయన భార్య మౌనిక సూర్యాపేట టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేయగా.. శనివారం తెల్లవారుజామున యర్కారం శివారులోని కల్వర్టు కింద గోనె సంచిలో మధు మృతదేహాన్ని గుర్తించారు. మిస్సింగ్‌ కేసును హత్య కేసుగా మార్చి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాళ్లగడ్డలోని ఓ ఇంట్లో హత్య జరిగినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. సోమవారం ఉదయం విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై టేకుమట్లలో ప్రధాన నిందితుడు మిద్దె జీవన్‌తోపాటు మిద్దె ఆనంద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు కుట్ర బయటపడింది.

మిద్దె రవీందర్‌ హత్యకు ప్రతీకారంగా..: 2007లో అప్పటి యర్కారం సర్పంచ్‌ మిద్దె రవీందర్‌ హత్య జరగ్గా.. ఆ కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దీంతో రవీందర్‌ కుమారుడు మిద్దె జీవన్‌ తన తండ్రిని హత్య చేసిన మధును ఎలాగైనా చంపాలనుకున్నాడు. జీవన్‌ తన స్నేహితులు చింత సైదులు, మేదరి ప్రసాద్‌ల సాయం తీసుకున్నాడు. శుక్రవారం దావత్‌ ఉందని చెప్పి మధును సైదులు, ప్రసాద్‌ తాళ్లగడ్డలో సైదులు అద్దెకు తీసుకున్న ఇంటికి పిలిపించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే మద్యం సేవించారు.

మధు మద్యం మత్తులో ఉండగా.. జీవన్‌తోపాటు మిద్దె ఆనంద్‌ అక్కడకు చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లిన వెంటనే ప్రసాద్‌ మధు చేతులు, కాళ్లు పట్టుకోగా.. మటన్‌ కొట్టే కత్తితో సైదులు మధుపై దాడి చేశాడు. వెంటనే ఆ కత్తిని తీసుకున్న జీవన్‌ మధు మెడ, ముఖం, భుజాలపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. హత్య అనంతరం మధు మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి కారులో తీసుకెళ్లి యరా>్కరం శివారులోని కల్వర్టు కింద పడేశారు. మధు బైక్‌ను మరో ప్రాంతంలో వదిలేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, సెల్‌ఫోన్‌లను అడివెంల సమీపంలోని కాల్వలో పడేసి పరారయ్యారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా, ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, కారు, బైక్, ఐదు సెల్‌ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. భవాని పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement