
ఏటా ఒకటి, రెండు కంపెనీలపత్తి విత్తనాలకే డిమాండ్ సృష్టించి... కృత్రిమ కొరతతో బ్లాక్ మార్కెట్
ఆపై రెట్టింపు ధరలకు అమ్మకాలు
ఏ కంపెనీ అయినా బీటీ విత్తనాలన్నీ ఒకటే అంటున్న వ్యవసాయ శాఖ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ విత్తన కంపెనీల చేతిలో ఏటా పత్తి రైతు చిత్తవుతూనే ఉన్నాడు. ఒకటి రెండు కంపెనీల పత్తి విత్తనాలకే కృత్రిమ డిమాండ్ సృష్టిస్తూ, వాటిని బ్లాక్ చేస్తున్నారు. ఆపై రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. ఇది ప్రతి ఏటా జరిగే తంతే. ఈ సీజన్‌లోనూ కృత్రిమ కొరత సృష్టించేందుకు కొన్ని విత్తన కంపెనీల ఏజెంట్లు రంగంలోకి దిగినట్టు తెలిసింది.
మరోవైపు టాస్‌్కఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పలు జిల్లాల్లో నకిలీ పత్తి విత్తనాల దందా సాగిస్తున్న వారిని అరెస్టు చేశారు. ఈ నెలాఖరు కల్లా తొలకరి వర్షం పడగానే పత్తి విత్తనాలు విత్తే అవకాశం ఉండడంతో కొన్ని విత్తన కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాల్లో ఉన్నట్టు వ్యవసాయ శాఖ అనుమానిస్తోంది. ఈ మేరకు విజిలెన్స్ విభాగాన్ని అప్రమత్తం చేసింది.
డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు...
వాస్తవానికి బీటీ రకం హైబ్రిడ్ పత్తి విత్తనాలన్నీ ఒకే ఫార్ములాతో రూపొందినవే. బీటీ–1, బీటీ–2 విత్తనాలు మార్కెట్‌లో ఉన్నా, రైతులు బీటీ– 2 విత్తనాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. బీటీ–3 విత్తనాలపై నిషేధం ఉన్నా, కొన్నిచోట్ల గుట్టుగా ఈ విత్తనాలను కూడా రైతులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 475 గ్రాముల పత్తి విత్తన ప్యాకెట్ ధర ఈ సీజన్‌లో రూ. 37 పెరిగి రూ.901కి చేరింది. దీంతో పత్తి విత్తన కంపెనీలన్నీ ఇదే ధరకు రైతులకు విక్రయించాలి.
అయితే ఏవో రెండు కంపెనీల విత్తన బ్రాండ్లకు అధిక డిమాండ్ సృష్టించి, రైతులంతా ఆ విత్తనాలు కొనుగోలు చేసేలా అనివార్య పరిస్థితులను సృష్టించి, వాటిని రైతులకు అందకుండా చేస్తారు. ‘ఫలానా కంపెనీ విత్తనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కానీ ప్రస్తుతం మా దగ్గర ఆ విత్తనాలు అందుబాటులో లేవు. బ్లాక్‌లో తెప్పిస్తాం’అంటూ రైతులకు ఆ బ్రాండ్ విత్తనాలపై ఆసక్తి పెరిగేలా చేసి, కృత్రిమ కొరత సృష్టించి, సొమ్ము చేసుకునే ఎత్తుగడ కొందరు దుకాణదారులు వేశారు. దీని వెనుక ఆయా కంపెనీల ఏజెంట్లు ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
తులసి, రాశి, అంబూజ, మహికో, యూఎస్ అగ్రిసీడ్ 7067, రేవంత్, సంకేత్, క్యాష్, ఏటీఎం సిమ్రాన్, బయోసీడ్, జయాగోల్డ్, చంద్రగోవా, సదానంద్, ప్రవర్ధన్, రేవంత్, యాక్స్ కంపెనీలు వివిధ రకాల బ్రాండ్ల పేరుతో మార్కెట్లో పత్తి విత్తనాలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి. అయితే కొన్ని జిల్లాల్లో కొన్ని బ్రాండ్లకే డిమాండ్ సృష్టిస్తూ వస్తున్నారు.
ఈసారి ఆ పరిస్థితి లేకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే తమ బ్రాండ్‌లకు డిమాండ్ కల్పించేలా కొన్ని కంపెనీలు ఏజెంట్లను ఇప్పటికే ఆయా జిల్లాలకు పంపించాయి. జిల్లా కేంద్రాల్లోని విత్తన దుకాణదారులు, హోల్‌సేల్ డీలర్ల సహకారంతో ఈ ప్రక్రియ సాగుతోంది.
అందుబాటులో 1.37 లక్షల క్వింటాళ్ల విత్తనాలు
రాష్ట్రంలో ఈసారి 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందుకోసం 45 వేల క్వింటాళ్ల బీటీ పత్తి విత్తనాలు అవసరమని లెక్కలు కట్టింది. కానీ ప్రైవేట్ కంపెనీల వద్ద ఇప్పటికే 1.37 లక్షల క్వింటాళ్ల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నట్టు వ్యవసాయ అధికారులు తేల్చారు. ఈ విత్తనాల్లో డిమాండ్ అధికంగా ఉన్న బ్రాండ్ల విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించి, రిటైల్ దుకాణదారులు, హోల్‌సేల్ వ్యాపారులతో కుమ్మక్కై రెట్టింపు ధరలకు విక్రయించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్టు తెలిసింది.
సీడ్ కార్పొరేషన్, ఆగ్రోస్‌ల ద్వారా విక్రయిస్తే...
రాష్ట్రంలో వరి విత్తనాలను తెలంగాణ సీడ్ కార్పొరేషన్ రైతులకు అందుబాటులో ఉంచుతోంది. ఆగ్రోస్ సైతం ఇతర విత్తనాలను రైతులకు విక్రయిస్తోంది. కానీ బీటీ పత్తి విత్తనాల విషయంలో ఈ రెండూ ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. ప్రభుత్వం పూర్తిగా ఈ విత్తనాలను ప్రైవేట్ వ్యక్తులకే ధారాదత్తం చేయడంతో ఈ సంస్థలు కూడా వాటి జోలికి పోలేదు. ప్రభుత్వం ఈ దిశగా దృష్టి పెడితే ప్రైవేట్ కంపెనీల దందాకు అడ్డుకట్ట వేయొచ్చని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు.