
అదనపు యూరియా సరఫరా చేయాలన్న రాష్ట్రం విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రం
రవాణాలో 60 వేల టన్నుల యూరియా.. వచ్చే వారంలోగా చేరుకోనున్న మిగిలిన 50 వేల టన్నులు
ఈ నెలలో ఇప్పటివరకు 1.44 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులు యూరియా కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అదనపు యూరియా సరఫరా చేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఈ మేరకు చేసిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నెలలో రాష్ట్రానికి అదనంగా 1.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా అదనంగా కేటాయించిన యూరియాలో 60,000 మెట్రిక్ టన్నులు రవాణాలో ఉండగా మరో 50,000 మెట్రిక్ టన్నులు వచ్చే వారంలోగా రాష్ట్రానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది.
ఈనెలలో ఇప్పటికే 1.44 ఎల్‌ఎంటీ యూరియా
రాష్ట్రానికి ఈ సీజన్‌లో కేటాయించిన 8.90 ఎల్‌ఎంటీ యూరియాలో కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ప్రతినెలా కొంత మేర కోత విధిస్తూ సరఫరా చేసింది. దీంతో ఆగస్టు నెలాఖరు నాటికే 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కోత పడింది. ఈ ప్రభావం రాష్ట్రంపై పడటంతో రైతులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రతిరోజూ 5 వేల నుంచి 10 వేల మెట్రిక్ టన్నుల వరకు సరఫరా చేస్తూ వచ్చింది.
అయినా చాలా జిల్లాల్లో కొరత తీరకపోవడంతో వ్యవసాయ మంత్రి తుమ్మల ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతోపాటు ఎరువుల శాఖ అధికారులను కలిసి క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించారు. దీంతో ఇప్పటివరకు ఈ నెలలోనే 1.44 ఎల్‌ఎంటీ యూరియాను సరఫరా చేసిన కేంద్రం మరో 1.17 ఎల్‌ఎంటీ విదేశీ యూరియా పంపించేందుకు అంగీకరించింది. ఈ కేటాయింపులో భాగంగా కాకినాడ, విశాఖపట్నం, గంగవరం, మంగళూరు, జైగడ్, కృష్ణపట్నం వంటి ప్రధాన నౌకాశ్రయాల ద్వారా యూరియా రాష్ట్రానికి చేరనుంది.
ఇందులో కాకినాడ నుంచి 15,900 మెట్రిక్ టన్నులు, విశాఖ నుంచి 37,650 మెట్రిక్ టన్నులు, గంగవరం నుంచి 27,000 మెట్రిక్ టన్నులు, మంగళూరు నుంచి 8,100 మెట్రిక్ టన్నులు, జైగడ్ నుంచి 16,200 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నం నుంచి 13,000 మెట్రిక్ టన్నులు సరఫరా కానున్నాయి. కేంద్రం అదనంగా కేటాయించిన విదేశీ యూరియాలో ప్రస్తుతం 30,000 మెట్రిక్ టన్నులు లోడింగ్‌లో ఉండగా రాబోయే వారంలో మరో 50,000 మెట్రిక్ టన్నులు లోడింగ్ పూర్తి కానున్నాయి. అలాగే 30,000 మెట్రిక్ టన్నులు ఇప్పటికే రవాణాలో ఉన్నాయి.
త్వరలో రామగుండం కేంద్రం పునరుద్ధరణ
రాష్ట్రానికి యూరియా సరఫరా చేసే ప్రధాన వనరుల్లో రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్‌ఎఫ్‌సీఎల్) కీలకమైనది. గత 90 రోజులుగా ప్లాంట్ షట్‌డౌన్ కారణంగా ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో రాష్ట్ర రైతులకు యూరియా అందించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల కేంద్ర రసాయనాల మంత్రి, కార్యదర్శిని కలిసి రామగుండం యూనిట్‌ను త్వరితగతిన పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేయగా దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆర్‌ఎఫ్‌సీఎల్ పునరుద్దరణ జరుగనుందని మంత్రి తుమ్మల ఒక ప్రకటనలో తెలిపారు.