
ప్రాణ నష్టం పరంగా గుల్జార్‌హౌస్ ప్రమాదమే పెద్దది
2002లో శాంతి ఫైర్‌వర్క్స్ ప్రమాదంలో 12 మంది మృతి
2022లో న్యూ బోయిగూడలోని స్క్రాప్ గోదాంలో 11 మంది
నివాస–వ్యాపార సమ్మిళిత ప్రాంతాల్లో జాగ్రత్తలు అవసరం
అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ వై నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని దుకాణాలు, కంపెనీలు, గోదాముల్లో ఏటా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే, భారీ ప్రాణనష్టాలతో కూడిన వి మాత్రం తక్కువే. 2002లో ఉస్మాన్‌గంజ్‌లోని శాంతి ఫైర్ వర్క్స్‌లో జరిగిన అగ్నిప్రమాదం ప్రాణ నష్టం పరంగా ఇప్పటివరకు ప్రథమ స్థానంలో ఉండేది. ఆదివారం పాత బస్తీలోని గుల్జార్‌హౌస్ వద్ద ‘మోదీ ఇంట్లో’జరిగిన ప్రమా దం దాన్ని దాటేసింది. ఒకే ప్రమాదంలో 17 మంది మృతిచెందటంతో నగర చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదంగా రికార్డుల్లోకి ఎక్కింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం కూడా ఇదే తొలిసారి.
గతంలో నగరంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదాల్లో కొన్ని ఇవీ...
23.10.2002:
ఉస్మాన్‌గంజ్‌లోని శాంతి ఫైర్ వర్క్స్‌లో చోరీ చేయడానికి వచ్చిన దొంగ మారుతి నయీం.. అందులో నగదు లభించకపోవడంతో నిప్పు పెట్టాడు. ఈ ఉదంతంలో ఫైర్‌వర్క్స్ పై అంతస్తులో ఉన్న కార్తికేయ లాడ్జిలో బస చేసిన కస్టమర్లు, సిబ్బంది మొత్తం 12 మంది చనిపోయారు.
21.10.2006:
సోమాజిగూడలోని మీనా జ్యువెలర్స్ నిర్మాణ పనులు జరుగుతుండగా, పెయింటింగ్ పని చేయడానికి వచ్చిన వలస కార్మికులు పై అంతస్తులో నిద్రించారు. కింది ఫ్లోర్‌లో జరిగిన అగ్నిప్రమాదంతో పెయింట్లకు నిప్పంటుకొని విడుదలైన విషవాయువుల ప్రభావానికి ముగ్గురు చనిపోయారు.
24.11.2012:
పుప్పాలగూడలోని బాబానివాస్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. వాచ్‌మన్‌తో పాటు స్థానికుల అప్రమత్తత కారణంగా మరో పదిమంది ప్రాణాలతో బయటపడ్డారు.
22.02.2017:
అత్తాపూర్‌లోని ఒక చిన్నతరహా పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. కూలర్లు తయారుచేసే ఈ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో ఒడిశాకు చెందిన ఆరుగురు వలస కార్మికులు చనిపోయారు.
23.02.2022:
న్యూ బోయగూడ వద్ద శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో ఉన్న స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో బిహార్ నుంచి వచ్చిన వలస కార్మికులు 11 మంది చనిపోయారు.
16.05.2023:
సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో క్యూ నెట్ అనుబంధ సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్‌లో పని చేసే ఆరుగురు మరణించారు.
13.11.2023:
నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో ఉన్న నాలుగంతస్తుల భవనం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. భవనం కింది అంతస్తులో ఉన్న కార్ఖానాలో మంటలు చెలరేగి భవనం మొత్తం కాలిపోయింది.
ఆ భవనాల్లో మరిన్ని జాగ్రత్తలు అవసరం
ఫైర్ సేఫ్టీ విషయంలో వాణిజ్య భవనాలకు ఇచ్చిన ప్రాధాన్యం నివాస భవనాలకు ఇవ్వట్లేదు. వ్యాపార సంస్థలు, గృహాలు కలిసి ఉన్న భవనాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం మార్కెట్‌లో తక్కువ ధరకే ఫైర్ అలారమ్స్, అగ్నిమాపక పరికరాలు లభిస్తున్నాయి. వీటిని ఇళ్లలోనూ ఏర్పాటు చేసుకుంటే దుర్ఘటనలు తగ్గుతాయి. ప్రమాదం జరిగినా ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.
– వై.నాగిరెడ్డి, రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీ