బీర్‌ బాధలు.. బార్‌ ఓనర్ల కష్టాలు...ఇవే కారణాలు

Beer Sales Decreasing Gradually Due To Corona Hyderabad - Sakshi

గ్రేటర్‌లో పడిపోయిన బీర్ల అమ్మకాలు 

15 లక్షల కేసుల నుంచి 

13 లక్షలకు తగ్గుముఖం  

కోవిడ్‌ వైరస్‌ వ్యాపిస్తుందని వెనుకంజ

సాక్షి, సిటీబ్యూరో: చిల్డ్‌ బీర్‌ అంటే మద్యం ప్రియులకు అదో క్రేజ్‌.. చాలా మంది అలాంటి బీర్‌నే ఇష్టపడుతారు..అయితే ఇటీవల నగరంలో బీర్ల వినియోగం తగ్గుముఖం పట్టింది. బీర్‌ తాగేందుకు వెనుకంజ వేస్తున్నారు.గతంలో పెంచిన బీర్ల ధరలను కొంతమేరకు  తగ్గించినప్పటికీ  వినియోగం పెరగకపోవడం గమనార్హం. శీతల పానీయా లు సేవించడం వల్ల  కోవిడ్‌ వ్యాపించవచ్చుననే  భావన  వల్ల చాలా మంది బీర్‌ తాగేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో మద్యం  వైపు మొగ్గు చూపుతున్నారు.  
►గ్రేటర్‌ హైదరాబాద్‌లో  సుమారు  15 లక్షల కేసుల నుంచి 13 లక్షల కేసులకు రోజువారి విక్రయాలు తగ్గినట్లు అధికారుల  అంచనా.   
►కేవలం ఎండాకాలంలోనే కాకుండా  సాధారణ వాతావరణంలోనూ  బీర్ల అమ్మకాలు  అసాధారణంగానే ఉంటాయి. అయితే ఈ సారి మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. కిక్‌ ఇచ్చే మద్యం వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.
 
ధరలు కూడా కారణమేనా... 
గత సంవత్సరం లాక్‌డౌన్‌ అనంతరం బీర్లపై రూ.30 వరకు పెంచారు. సహజంగానే కోవిడ్‌  దృష్ట్యా  బీర్‌కు దూరంగా ఉన్న వారు ధరల పెంపుతో మరింత దూరమయ్యారు.  దీంతో  ప్రభుత్వం ఒక్కో బీర్‌పై  రూ.10  తగ్గించింది.  
► రూ.210 నుంచి రూ.200 కు, రూ.170 నుంచి రూ.160 కి ధరలు తగ్గాయి. ఈ కారణంగానైనా అమ్మకాలు పెరగవచ్చునని అంచనా వేశారు. అయినా ప్రయోజనం లేదు.  
► బీర్‌  సేల్స్‌ పెద్దగా  పెరగలేదు.‘అమ్మకాలు తగ్గడానికి ధరలే  ప్రధాన కారణం. ఒక క్వార్టర్‌ లిక్కర్‌ కంటే ఇప్పటికీ బీర్‌ ధరే ఎక్కువ. అందుకే బీర్‌ కంటే లిక్కర్‌ సేవించడం నయమనే  భావన ఉంది.’ అని ఎక్సైజ్‌  అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. కేవలం  రూ.10 తగ్గించడం వల్ల  అమ్మకాలు పెద్దగా  ప్రయోజనం  లేదని  అన్నారు. కరోనా భయం కూడా సేల్స్‌ తగ్గడానికి కారణం కావచ్చు. 

మూసివేత దిశగా బార్లు 
మరోవైపు బార్లకు చల్లదనమే శాపంగా మారింది. చల్లటి వాతావరణంలో కోవిడ్‌ వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందనే కారణంతో మద్యం ప్రియులు బార్లకు వెళ్లడం తగ్గించారు. క్లోజ్డ్‌ బార్‌లకు బదులు ‘ఓపెన్‌ బార్‌’ను ఎంపిక చేసుకుంటున్నారు. సరదాగా నలుగురు కలిసి బార్‌కు వెళ్లే అలవాటు తగ్గింది.చాలా వరకు ఇంటి వద్ద మద్యం సేవించేందుకు ఇష్టపడుతున్నారు.  

► తప్పనిసరి పరిస్థితుల్లో బార్‌లకు వెళ్లవలసి వచ్చినా ఒక్కరిద్దరు మాత్రమే కలిసి వెళ్లడం  గమనార్హం.దీంతో గ్రేటర్‌లో చాలా బార్లు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.
 
► సుమారు 404  బార్‌లలో 60 శాతం వరకు నష్టాల్లో నడుస్తున్నట్లు అంచనా. ఇప్పటికే 20 బార్లను మూసివేశారు.మరికొన్ని బార్‌లు  లైసెన్సు ఫీజు కూడా చెల్లించలేని స్థితిలో మూసి వేత దిశగా ఉన్నట్లు తీస్తున్నట్లు ఎక్స్‌జ్‌ అధికారులు వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top