
మార్గదర్శకాలు రూపొందించాలని అన్ని రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం ఆదేశం
సీసీ కెమెరాల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ తప్పనిసరి
200 కి.మీ. వేగంతో వెళ్లే వాహనాలనూ రికార్డు చేసే సామర్థ్యం ఉండాలని స్పష్టీకరణ
హైరిస్క్ ప్రాంతాల్లో అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్దేశం
గతంలోనే ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు చేసిన హైదరాబాద్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా లక్షల మందిని బలితీసుకుంటున్న రోడ్డు ప్రమాదాలను నిరోధించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత ప్రమాదకర ట్రాఫిక్ ఉల్లంఘనలపై కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పనిచేసే సీసీ కెమెరాలను వినియోగించేలా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ను రూపొందించాలని ఆదేశించింది.
తొలిదశలో ఆ నాలుగు రకాలపై...
కేంద్ర రోడ్డు రవాణా ఉపరితల మంత్రిత్వ శాఖ తొలిదశలో నాలుగు రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలపై దృష్టి సారించింది. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం, వన్ వే, రాంగ్ రూట్లలో దూసుకురావడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను కట్టడి చేయడానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించడానికి ఏఐతో కూడిన సీసీ కెమెరాలను వినియోగించాలని చెప్పింది.
హైరిస్క్ ఏరియాలు గుర్తించి, ఏర్పాటు
తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే హైరిస్క్ ప్రాంతాల్లో అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. బ్లాక్ స్పాట్స్‌గా పిలిచే ఆ ప్రాంతాల గుర్తింపు కోసం సైతం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలు, రాష్ట్ర రహదారుల్లో ఒక కిలోమీటర్ పరిధిలో మూడేళ్లలో మూడు కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగితే అది హైరిస్క్ కారిడార్ కిందికు వస్తుంది.
పట్టణ, నగరాల్లోని రహదారుల్లో 100 మీటర్ల పరిధిలో మూడేళ్లలో రెండు ప్రమాదాలు జరిగినా, ఇతర ప్రధాన రహదారులు, జిల్లా రోడ్లపై 500 మీటర్ల పరిధిలో మూడేళ్ల వ్యవధిలో రెండు యాక్సిడెంట్లు జరిగినా, విద్యాసంస్థలు ఉన్న ప్రాంతాల్లో 100 మీటర్ల పరిధిలో మూడేళ్లలో రెండు ప్రమాదాలు జరిగినా వాటిని హైరిస్క్ జాబితాలో చేర్చాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో కచి్చతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
నామమాత్రంగా కాకుండా...
హైదరాబాద్‌తోపాటు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో సీసీ కెమెరాల వినియోగం విస్తృతమైంది. కానీ వాటిలో అత్యధికం నామమాత్రంగానే ఉంటున్నాయి. ఏదైనా ఉదంతం జరిగినప్పుడో లేదా పోలీసు కేసుల దర్యాప్తులో అవసరమైనప్పుడో మాత్రమే వాటిలోని లోపాలు బయటపడుతున్నాయి. కావాల్సిన కోణంలో వీడియోలు రికార్డు కాకపోవడమో లేదా రికార్డు అయినప్పటికీ విశ్లేషణకు అవసరమైన స్పష్టత లోపించడం పరిపాటిగా మారింది.
చాలాచోట్ల కనీసం 50 శాతం సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం ఏఐ ఆధారిత సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రమాణాలు నిర్దేశించింది. ఆయా కెమెరాలు ఎల్లవేళలా వీడియోలు రికార్డు చేసేలా, ఏదైనా వాహనం గంటకు 200 కి.మీ. వేగంతో దూసుకెళ్లినా స్పష్టంగా ఆయా చిత్రాలను నమోదు చేసే సామర్థ్యం కలిగి ఉండాలని స్పష్టం చేసింది.
అంతా ఆటోమేటిక్‌గా పనిచేసేలా...
ఏఐ ఆధారిత సీసీ కెమెరాలతోపాటు వాటి సర్వర్‌లలో మరికొన్ని హంగులు కూడా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. హైరిస్క్ ఏరియాలపై నిత్యం నిఘా ఉంచేలా సాంకేతిక పరిజ్ఞానం సీసీ కెమెరాల్లో పొందుపరచాలని సూచించింది. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులను గుర్తించి ఈ–చలాన్లు జారీ చేయడంతోపాటు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దాన్ని గుర్తించి సంబంధిత విభాగాలను అప్రమత్తం చేస్తూ సందేశం పంపాలని పేర్కొంది. ఆయా కారిడార్లలో ఉల్లంఘనల తీరుతెన్నుల్ని సాంకేతికంగా అధ్యయనం చేయాలని చెప్పింది.
ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసిన లేదా వాటిని సస్పెండ్ చేసిన వాహనదారుల వివరాలు కలిగి ఉండటంతోపాటు బీమా వివరాలు సర్వర్‌లో నిక్షిప్తమై ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. 2014 తర్వాత ఈ దిశగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొన్ని చర్యలు చేపట్టారు. ఐటీఎంఎస్, హెచ్–ట్రిమ్స్ తదితర పేర్లతో కొన్ని ప్రాజెక్టులు చేపట్టారు. వాటిలో సీసీ కెమెరాల ఏర్పాటు వరకు సమర్థంగా పూర్తయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం నిక్షిప్తం చేయడం మాత్రం పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో మూడు కమిషనరేట్లలోని సీసీ కెమెరాలు ఆశించిన ఫలితాలు ఇవ్వట్లేదు.
చిరునామా, ఫోన్ నంబర్లు మారితే..
కేంద్ర మార్గదర్శకాల్లో మరో కీలకాంశమూ ఉంది. ఓ ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి జారీ చేసే ఈ–చలాన్ వాహనదారుడికి చేరాల్సిన అవసరం ఉంది. ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న వాహనం రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులతో అనుసంధానించిన చిరునామా, ఫోన్ నంబర్లే దీనికి ఆధారం. అయితే చాలా మంది వాహనచోదకులు ప్రస్తుతం నివసిస్తున్న చిరునామా, వినియోగిస్తున్న సెల్‌ఫోన్ నంబర్‌కు రికార్డుల్లో ఉన్న వాటికి సంబంధం ఉండట్లేదు.
ఈ కారణంగానే సగానికి సగం ఈ–చలాన్లు వాహనదారులకు చేరట్లేదు. ఈ నేపథ్యంలో ఆయా వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునేలా వారికి అవకాశం ఇవ్వాలని సూచించింది. అలాగే ట్రాఫిక్ సిబ్బంది సైతం తనిఖీలప్పుడు వాహనదారుల చిరునామా, ఫోన్ నంబర్ల మార్పును పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.