
సాగర్‌డ్యాంపై ఏపీ వైపు ప్రస్తుతం ఉన్న సీఆర్‌పీఎఫ్ బలగాలు
ప్రాజెక్టు కుడివైపు భద్రత మేమే చూసుకుంటాం
ఎస్పీఎఫ్ డీజీపీకి ఏపీ ప్రభుత్వం స్పష్టీకరణ
నాగార్జునసాగర్: సాగర్ ప్రాజెక్టు కుడివైపు (కృష్ణానదికి ఆవలివైపు) ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న ఆనకట్ట, కుడి కాల్వ తమ అధీనంలోనే ఉండాలని, కుడికాల్వ గేట్లను తామే నిర్వహించుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ ఎస్‌పీఎఫ్ (ప్రత్యేక రక్షణ దళం) డీజీపీకి లేఖ ఇచ్చినట్టు తెలిసింది. నాగార్జునసాగర్ డ్యాంపై ఏపీ వైపు ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్ బలగాలు పహారాలో ఉన్నాయి.
తెలంగాణ వైపు సీఆర్‌పీఎఫ్ బలగాలు డ్యాం భద్రతను ఉపసంహరించుకొని ఏప్రిల్‌లో వెళ్లిపోయాయి. ఇరు రాష్ట్రాల మధ్య కేఆర్‌ఎంబీ సమక్షంలో గతంలో జరిగిన సమావేశంలో.. ఏపీ వైపు ఉన్న సీఆర్‌పీఎఫ్ బలగాలు జూన్ నెలాఖరులోగా వెళ్లిపోతాయని ఏపీ ప్రభుత్వం చెప్పింది. వాస్తవంగా సీఆర్‌పీఎఫ్ బలగాలు వెళ్లిపోగానే సాగర్ డ్యాం మొత్తం తెలంగాణకు చెందిన ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీఎఫ్) పర్యవేక్షణలో ఉంటుంది.
అయితే, ఏపీ వైపు సీఆర్‌పీఎఫ్ బలగాలు ఉపసంహరించుకోగానే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్‌పీఎఫ్ బలగాలను ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌పీఎఫ్ డీజీపీకి లేఖ ఇచ్చినట్టు తెలిసింది. సొంత బలగాల ఏర్పాటుతో పాటు కుడి కాల్వ గేట్లను తామే నిర్వహించుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణారివర్ బోర్డుకు కూడా తెలిపింది. దీని ప్రకారం నాగార్జునసాగర్ కుడివైపున గల ప్రాజెక్టు భూభాగం పూర్తిగా తమ (ఏపీ)అధీనంలోనే ఉండాలని, కుడి కాల్వ గేట్లపై తెలంగాణ ప్రభుత్వ సాగునీటి అధికారుల అజమాయిషీ ఉండరాదని చెప్పకనే చెప్పినట్లు అయ్యింది.