హైదరాబాద్‌ సహా తెలంగాణ అంతటా దంచికొడుతున్న వానలు | Along Hyderabad Rains Fall In Telangana April 3rd 2025 News | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ సహా తెలంగాణ అంతటా దంచికొడుతున్న వానలు

Apr 3 2025 3:08 PM | Updated on Apr 3 2025 3:54 PM

Along Hyderabad Rains Fall In Telangana April 3rd 2025 News

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలో పలు జిల్లాలలో వాతావరణం ఒక్కసారిగా మారింది. గురువారం మధ్యాహ్నాం నుంచి ఉరుములతో, మెరుపులతో భారీగా వర్షం ఎడతెరిపి ఇవ్వకుండా దంచికొడుతోంది. దీంతో రోడ్లపై నీరు ఏరులై పారుతోంది. భారీ వర్షం కారణంగా ప్రజలు ఉక్కపోత నుంచి ఊరట పొందుతున్నప్పటికీ.. అకాల వర్షంతో రైతన్నలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుండగా.. సంగారెడ్డి, సిద్ధిపేట, నిజామాబాద్‌లోనూ కుంభవృష్టి కురిసింది.  హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా రోడ్లు నీట మునిగాయి. పంజాగుట్ట-ఖైరతాబాద్‌ ప్రధాన రహదారిపై మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మెర్క్యూరీ హోటల్‌ వద్ద ఓ కారుపై చెట్టు కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు. 

భూ ఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో క్యుములో నింబస్‌ మేఘాలు ఏర్పడి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ముందస్తు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో చాలా చోట్ల ఏకధాటిగా రెండు గంటలపాటు వాన కురవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. శ్రీశైలంలోనూ నాన్‌ స్టాప్‌గా వానపడడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు నాగర్‌కర్నూల్‌లో పిడుగు ధాటికి ఇద్దరు మహిళలు మృతి చెందారు.

మరో మూడు నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే క్యుములో నింబస్‌ కారణంగా.. ఉత్తర తెలంగాణకు వడగండ్లు, ఉరుములు మెరుపులతోనూ వానలు పడొచ్చని హెచ్చరిస్తోంది. అకాల వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికారులు ముందస్తు సూచనలు చేశారు. అయినప్పటికీ కొన్ని చోట్ల పంటలు నాశనం కాగా, కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దైనట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం

Advertisement
 
Advertisement
Advertisement