Sakshi News home page

అటు సన్నద్ధానికి, ఇటు సహనానికి.. మళ్లీ.. మళ్లీ ‘పరీక్షే’

Published Fri, Sep 29 2023 2:57 AM

Achieving government jod is a yajna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సర్కారు కొలువు సాధించడం ఓ యజ్ఞమే. దీనికోసం ఏళ్ల తరబడి కష్టపడేవారు కొందరు ఉంటున్నారు. అన్నీ వదిలేసి కోచింగ్‌ తీసుకునేవారు మరికొందరు ఉంటారు. ప్రైవేట్‌ ఉద్యోగాలకు రాజీనామా చేసేవారు, దీర్ఘకాలిక సెలవు పెట్టేవారూ ఉంటారు. అయితే లీకేజీల మకిలీ, పరీక్షల వాయిదా, పరీక్షల రద్దు ఇలా వరుస ఘటనలు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేవారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. ప్రిపరేషనే ఓ పరీక్ష అయితే...సహనానికీ పరీక్ష పెట్టినట్టుగా ఉందని నిరుద్యోగులు వాపోతున్నారు.  

30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు  
తెలంగాణస్టేట్‌ పబ్లిక్‌సర్విస్‌ కమిషన్‌ గతేడాది ఏప్రిల్‌లో గ్రూప్‌–1 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ తర్వాత వరుసగా ఇప్పటివరకు 30 ఉద్యోగ నియామక ప్రకటనలు ఇచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో ఏకంగా 503 ఉద్యోగాలతో గ్రూప్‌–1 ప్రకటన వెలువడడంతో నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారిలో ఎంతో ఉత్సాహం నింపింది. ఆ తర్వాత గ్రూప్‌–2, గ్రూప్‌–3, గ్రూప్‌–4, ఇంజనీరింగ్‌ ఉద్యోగాలతోపాటు జూనియర్‌ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పాలిటెక్నిక్‌ టీచర్స్, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్, లైబ్రేరియన్స్, డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్, హార్టీకల్చర్‌ ఆఫీసర్స్, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్స్, అగ్రికల్చర్‌ ఆఫీసర్స్, టౌన్‌ ప్లానింగ్‌.. ఇలా దాదాపు 30వేల ఉద్యోగాలకు పైబడి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించింది.  

రెండో ‘సారీ’ 
ప్రశ్నపత్రాల లీకేజీతో డీఏఓ, గ్రూప్‌–1, ఏఈఈ పరీక్షలు రద్దు చేయగా, టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్, హార్టికల్చర్‌ ఆఫీసర్‌ తదితర పరీక్షలు చివరి నిమిషంలో వాయిదా వేసింది. ఈ క్రమంలో దాదాపు ఏడున్నర లక్షల మందికిపైగా అభ్యర్థులంతా రెండోసారి పరీక్షలు రాయాల్సి వచ్చింది. ఇందులో అత్యధికంగా గ్రూప్‌–1కు 3.80 లక్షల మంది, డీఏఓ పరీక్షకు దాదాపు 1.6లక్షల మంది అభ్యర్థులున్నారు.

ఒకసారి పరీక్ష రాశాక, రెండోసారి మళ్లీ పరీక్షకు సన్నద్ధం కావడమనేది మానసికంగా తీవ్రఒత్తిడి కలిగించే విషయమే. ఇక గ్రూప్‌–1 విషయానికి వస్తే పరీక్ష నిర్వహణలోపాల కారణంగా రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు రెండుసార్లు ఆదేశించింది. గ్రూప్‌–1 పరీక్ష రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అత్యంత ఉత్తమమైన సర్విసు. రాష్ట్రస్థాయి సివిల్‌ సర్విసుగా భావించే దీనికి ప్రిపరేషన్‌ అంత ఈజీ కాదు. రోజుకు 18గంటల పాటు కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి వారికి తాజాగా హైకోర్టు నిర్ణయం షాక్‌కు గురిచేసింది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తే హాజరశాతం గణనీయంగా పడిపోయే అవకాశం లేకపోలేదు. 

ఆ తర్వాతే హాజరులో స్పష్టత  
గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను ప్రకటించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూన్‌ 11వ తేదీ సాయంత్రం టీఎస్‌పీ ఎస్సీ హాజరైన అభ్యర్థుల ప్రాథమిక సమాచారం పేరిట ప్రకటన విడుదల చేసింది. పరీక్ష కేంద్రాల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈ గణాంకాలు చెబుతున్నా, ఓఎంఆర్‌ జవాబుపత్రాలు స్వా«దీనం చేసుకున్న తర్వాత పక్కా గణాంకాలు ఇస్తామని తెలిపింది. సాధారణంగా పరీక్షల హాజరుశాతం గణాంకాలపై స్పష్టత రావాలంటే వెంటనే సాధ్యం కాదు. అన్ని కేంద్రాల నుంచి పక్కా సమాచారం సేకరించడానికి సమయం పడుతుంది.

ఈమేరకు టీఎస్‌పీఎస్సీ ప్రకటనలో పేర్కొన్నా, మరుసటి ప్రకటనలో నెలకొన్న గందరగోళం అభ్యర్థులను కొంత అనుమానాలకు గురిచేసింది. ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేసిన తర్వాత టీఎస్‌పీఎస్సీ చేసిన ప్రకటనలో స్పష్టత ఇచ్చినా, అభ్యర్థులకు మాత్రం అనుమానాలు తొలగలేదు. ఇక బయోమెట్రిక్‌ హాజరుతీరు పట్ల కూడా అనుమానాలు నెలకొనడంతో న్యాయస్థానాన్ని ఆశ్ర యించాల్సిన పరిస్థితి వచ్చింది.

గతంలో బయోమెట్రిక్‌ హాజరులో ఎదుర్కొన్న పలు సమస్యల కారణంగానే, బయోమెట్రిక్‌ వద్దనుకున్నట్టు టీఎస్‌పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. అభ్యర్థులకు వారం రోజుల ముందే పంపించిన హాల్‌టికెట్లలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశామని చెబుతున్నాయి. అయి తే రెండోసారి జారీ చేసిన హాల్‌ టికెట్‌లలో బయోమెట్రిక్‌ చెక్‌ఇన్‌ అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు.

Advertisement

What’s your opinion

Advertisement