TG : హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు.. నిందితుడు అరెస్టు | Accused held for inappropriate remarks against Telangana High Court judge | Sakshi
Sakshi News home page

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు.. నిందితుడు అరెస్టు

May 18 2026 2:35 PM | Updated on May 18 2026 3:28 PM

Accused held for inappropriate remarks against Telangana High Court judge

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నిందితుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్‌ ఫిర్యాదుతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో దామోదర్‌ అనే వ్యక్తి హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు గుర్తించారు. కొద్దిసేపటి క్రితమే దామోదర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఏం జరిగిందంటే?
 పోక్సో కేసులో కీలక నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్‌పై హైకోర్టు వాదనలు జరుగుతున్నప్పుడు సోషల్ మీడియా అనుచిత పోస్టుపై నమో దైన కేసు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ఆయా పోస్టులు చేసిన వారిని గుర్తించడం కోసం ఐపీ అడ్రస్లు కోరుతూ ఆదివారం సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదుతో చార్మినార్ పోలీసు స్టేషన్లో నమోదైన ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీసు ఠాణాకు బదిలీ అయింది.

బండి సాయి భగీరధ్‌ను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, అతను ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడని, పోలీసులు, ప్రధాన మీడియా, సోషల్ మీడియాను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని పోస్టులు వచ్చాయి. సీనియర్ వెకేషన్ జడ్జి జస్టిస్ టంగిరాల మాధవి దేవిని కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కేసులో ఆరోపించారు. పాక్సో కేసులో భగీరథకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, జస్టిస్ టంగిరాల మాధవి దేవి భర్తను తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నియమించేలా చూస్తానని కొందరు చెప్పినట్లు పోస్టులు చేశారు.

ఈ కల్పిత వార్తను సోషల్ మీడియాలో ఉంచడమే కాకుండా ప్రింట్ మీడియాలో కూడా ప్రచురించారని, దీని వల్ల అది విస్తృతంగా ప్రచారం చెంది, న్యాయమూర్తులు. న్యాయవాదులు, సాధారణ ప్రజలు చదవడం ద్వారా న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలుగుతోందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఈ కల్పిత వార్తకు సంబంధించిన కాపీని ఫిర్యాదుతో జతపరిచారు.

ఆయా పోస్టులను ఇప్పటికే సేకరించిన పోలీసులు వాటి మూలాలు కనిపెట్టడంపై దృష్టి పెట్టారు. దీనికి ఐపీ అడ్రస్ ప్రధాన ఆధారం కావడంతో వాటిని అందించాల్సిందిగా కోరుతూ సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపారు. సర్వీస్‌ ప్రొవైడర్లు అందించిన వివరాల ఆధారంగా నిందితుడు దామోదర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement