ఎల్లమ్మ పండుగ వేళ.. కన్నవారికి తీరని కడుపుకోత | 13 Years Girl Ends Life In Nalgonda | Sakshi
Sakshi News home page

ఎల్లమ్మ పండుగ వేళ.. కన్నవారికి తీరని కడుపుకోత

May 31 2026 9:28 AM | Updated on May 31 2026 9:59 AM

13 Years Girl Ends Life In Nalgonda

నల్గొండ జిల్లా: తల్లిదండ్రులు రేణుకా ఎల్లమ్మ పండుగ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వారి కుమార్తె మధ్యాహ్నం సమయంలో సరదాగా తోటి పిల్లలతో ఈత కొట్టేందుకు వెళ్తుండగా తల్లిదండ్రులు వద్దని వారించిన వినలేదు. బాలిక గుంత లోతు గమనించక ఈత కొడుతూ కొంత దూరం వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందింది. ఈ ఘటన కట్టంగూర్‌ మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని బిల్లంకానిగూడెంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

ముత్యాలమ్మగూడెంలో ఆది, సోమవారాల్లో గంగదేవమ్మ పండగ నిర్వహించేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. ముందు రోజు శనివారం గ్రామానికి చెందిన ఎలుక శంకర్, కల్పన దంపతులు ఇంట్లో రేణుకా ఎల్లమ్మ పండుగ నిర్వహిస్తున్నారు. వారు ఈ పనుల్లో నిమగ్నం కాగా.. వారి కుమార్తె హారిక(13) గ్రామ శివారులోని నీటి గుంతలో ఈత కొట్టేందుకు తన అన్న గణేష్, తన మేనత్త కుమార్తె, కుమారుడితో కలిసి గ్రామ శివారులో రైతులు పొలాల దిగువ భాగంలో నీటి నిల్వ కోసం తీసిన పెద్దగుంత వద్దకు వెళ్లారు. 

గుంత లోతు ఎక్కువగా ఉండటంతో గమనించని హారిక ఈత కొడుతూ దూరంగా వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. హారిక అన్న గణేష్‌ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే ఈ విషయాన్ని గణేష్‌ తన తల్లిదండ్రులకు తెలపడంతో అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో నకరేకల్‌ ఫైరింజన్‌ సిబ్బందిని పిలిపించారు. సిబ్బంది బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. హారిక చిన్నపురిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 7వ తరగతి పూర్తి చేసింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.   

Advertisement
 
Advertisement
Advertisement