ద్విచక్ర వాహనాన్ని తాకిన ఆర్టీసీ బస్సు
బ్యాగ్ తట్టుకుని కిందపడిన విద్యార్థిని
తండ్రి కళ్లెదుటే బాలిక మృత్యువాత
బంజారాహిల్స్‌లో విషాద ఘటన
హైదరాబాద్ : తండ్రితో బైక్‌పై వస్తున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని స్కూల్ బ్యాగ్ ఆర్టీసీ బస్సుకు తట్టుకోవడంతో కిందపడి ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. తన కళ్లెదుటే కూతురు మృత్యువాత పడటంతో ఆ కన్నతండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, రోడ్డుపై నీరు పేరుకుపోవడం.. పక్కనే కారు పార్క్ చేయడంతో.. బైక్‌ను తప్పించబోవడంతో ప్రమాదానికి కారణమైందని భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు..
ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ఊదురు గ్రామానికి చెందిన కంచి ప్రసాద్, సునీత దంపతులు రెండేళ్ల క్రితం నగరానికి వచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–58లోని ప్లాట్‌నెంబర్ 1143లో వాచ్‌మెన్లుగా పని చేస్తున్నారు. వీరి కూతురు కీర్తిక (14) వెంగళరావునగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి, కుమారుడు సాయి (11) ఆరో తరగతి చదువుతున్నారు. రోజూ మాదిరిగానే ప్రసాద్ శనివారం కూతురు, కొడుకును మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి బైక్‌పై తీసుకువస్తున్నాడు.
బైక్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1556 వద్దకు రాగానే గుంతలు తేలిన రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో పక్కకు వెళ్లాడు. అక్కడ కారు పార్క్ చేసి ఉన్న కారును తప్పించేందుకు అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. ఇదే సమయంలో వెనుక నుంచి మితిమీరిన వేగంతో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దూసుకొచి్చంది. బస్సుకు కీర్తిక స్కూల్ బ్యాగ్ తట్టుకోవడంతో ఆమె కిందపడింది. టైరు బాలిక తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రసాద్‌కు, సాయికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ తిరుపతిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం..
జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–5లోని మెట్రో స్టేషన్ రోడ్డంతా గుంతలమయమై మురుగునీరు పారుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గుంతలు పూడ్చకపోవడం, మురుగు సమస్యకు చెక్ పెట్టకపోవడంతో శనివారం రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృత్యువాత పడింది. దీనికి తోడు రోడ్డు పక్కన అక్రమంగా పార్కింగ్ చేసిన కారు కూడా ఈ ఘటనకు కారణమైందని, జీహెచ్‌ఎంసీ అధికారులపైనా కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


