Lokesh Kumar Is the New Additional Chief Electoral Officer, Who Is the Next GHMC Commissioner - Sakshi
Sakshi News home page

HYD: లోకేశ్‌కుమార్‌ బదిలీ.. జీహెచ్‌ఎంసీ నెక్ట్స్‌ బాస్‌ ఎవరో?

Published Thu, Jun 29 2023 8:37 PM

Lokesh Kumar Is New Additional CEO Who Is Next GHMC Commissioner - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ అడిషనల్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌గా వెళ్లనుండటంతో కొత్త కమిషనర్‌ ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. లోకేశ్‌కుమార్‌ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించి మూడున్నరేళ్లు దాటింది. మరో రెండు నెలలైతే నాలుగేళ్లు పూర్తయ్యేవి. రాష్ట్ర అసెంబ్లీకి మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో బదిలీలు అనివార్యంగా మారాయి.

కొత్త కమిషనర్‌గా ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందనరావు, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, వాటర్‌బోర్డు ఎండీ దానకిశోర్‌, మేడ్చ ల్‌ జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శశాంక పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు గతంలో జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌గా పని చేసిన హరిచందన పేరు కూడా ప్రచారంలో ఉంది. ఏ పేర్లు వినబడినప్పటికీ, అన్నీ ఊహాగానాలే తప్ప నియామకం జరిగేంతదాకా చెప్పలేమని ప్రభుత్వ తీరు తెలిసిన వారు చెబుతున్నారు.

జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే ఎక్కువ కాలం
జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే అత్యధిక కాలం కమిషనర్‌గా ఉన్న డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ తన పనేమిటో తాను.. అన్నట్లుగా పనులు చేసుకుంటూ పోయారు. బయట హడావుడి, హంగామా లేకుండా అంతర్గతంగా పనులు చేయించడంలో తనదైన ముద్ర వేశారు. తరచూ ఫోన్‌ కాన్ఫరెన్స్‌లు, గూగుల్‌ మీట్‌ వంటి వాటితో ఎప్పటికప్పుడు పనులు చేయించేవారు. ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినా జీహెచ్‌ఎంసీలో నెలనెలా జీతాలకు ఇబ్బందులెదురైనప్పటికీ, నయానో భయానో ట్యాక్స్‌ సిబ్బందితో, ఇతరత్రా పన్నుల వసూళ్లు జరిగేలా చూసేవారు.

ఎస్సార్‌డీపీతో సహా వివిధ ప్రాజెక్టుల పనులు కుంటుపడకుండా చేయగలిగారు. ఎవరెన్నివిమర్శలు చేసినా, క్షేత్రస్థాయిలో తిరగరనే ఆరోపణలున్నా పట్టించుకునేవారు కాదు. ఎలాంటి హడావుడి లేకుండానే నగరంలో క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలించేవారు. ప్రభుత్వం నుంచి, పైఅధికారుల నుంచి అందిన ఆదేశాలకనుగుణంగా పనులు చేసేవారని చెబుతారు. ఎలాంటి సమాచారం, ప్రచారం లేకుండానే నిశ్శబ్దంగా తాను చేయాల్సిన పనులేవో చేసుకుంటూపోయేవారు.
చదవండి: అంతర్గత విబేధాలు.. సైలెంట్‌ మోడ్‌లోకి ఎమ్మెల్యే రఘునందన్‌ రావు

Advertisement
Advertisement