అగరం కుటుంబం.. 7 వేలు దాటింది | - | Sakshi
Sakshi News home page

అగరం కుటుంబం.. 7 వేలు దాటింది

Oct 13 2026 1:53 AM | Updated on Oct 13 2026 1:53 AM

తమిళసినిమా: నటుడు శివకుమార్‌ 1979లో తన వందవ చిత్రం రోసాపూ రవికై కారి చిత్రాన్ని పూర్తి చేసిన సందర్భంగా ఆ చిత్ర పారితోషికం మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేసి తద్వారా వచ్చిన వడ్డిని పేద విద్యార్థులకు సాయంగా అందించడం ప్రారంభించారు. ఆ తరువాత వచ్చిన వడ్డీతో పాటు తాను కొంత డబ్బును చేర్చి సేవాకార్యక్రమాలను విస్తరించారు. కాగా ఆ తరువాత నటుడు సూర్య తాను తండ్రి శివకుమార్‌ విద్యా సేవలను కొనసాగించే విధంగా 2006లో అగరం ఫౌండేషన్‌ పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభించి అనేక మంది పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారు. కాగా గత 46 ఏళ్లుగా చిత్ర లేఖనం కళాకారులకు, ఏడాదికి ఒకరికి చొప్పున నగదు రూపంలో సాయం చేస్తూ వస్తున్న నటుడు శివకుమార్‌ ఇప్పుడు 47వ ఏడాది విద్యా సేవాకార్యక్రమాన్ని ఆదివారం చైన్నె, టీ.నగర్‌ లోని అగరం ఫౌండేషన్‌ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు సూర్య తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో చిత్రకారుడు జీవానందంను ఘనంగా సత్కరించి, లక్ష రూపాయలను చెక్కు రూపంలో అందించారు. అదే విధంగా 25 మంది పేద విద్యార్దులకు తలా రూ. 10 వేలు చొప్పున సాయం అందించారు. అదే విధంగా దిండిగల్‌ తాయ్‌ తమిళ్‌ పాఠశాలకు రూ. 6. 28 లక్షలు, ఈరోడ్‌ సుడర్‌ విద్యా సేవా సంస్థకు రూ.2 లక్షలు , వాళై విద్యా సేవా సంస్థకు రూ. 3 లక్షలు విరాళం అందించారు. ఈ సందర్భంగా విద్యే మనిషిని ఉన్నత స్థాయికి చేరుస్తుందని నటుడు శివకుమార్‌ పేర్కొన్నారు. నటుడు సూర్య మాట్లాడుతూ అగరం ఫౌండేషన్‌ 20 వసంతాలను పూర్తి చేసుకుందని చెప్పారు. ఈ 20 ఏళ్లలో అగరం కుటుంబం 7 వేలను దాటిందని దీన్ని మరింతగా విస్తరించే దిశగా తమ ప్రయాణం సాగుతుందని సూర్య స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement